
ఒకసారి మైండ్‌లో ఫిక్స్ అయితే... బ్లైండ్‌గా వెళ్లిపోతా!
సినిమా వెనుక స్టోరీ - 37
శ్రీను వైట్ల ఫుల్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నాడు. మహేశ్‌బాబుతో ఫస్ట్ మీటింగ్. చాలా చెప్పాలనుకున్నాడు. కానీ ఏమీ చెప్పలేక పోతున్నాడు. ఫైనల్‌గా ఒకటే అన్నాడు... ‘‘మీతో బ్లాక్ బస్టర్ తీస్తాను!’’ ‘‘అయితే ఆ పనిలో ఉండండి’’ అని చిలిపిగా నవ్వేశాడు మహేశ్. బయటకు రాగానే మంజులకు వందసార్లు థ్యాంక్స్ చెప్పాడు శ్రీను వైట్ల. ఆ మీటింగ్ అరేంజ్ చేసిందీ... ఈ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నదీ... ఆవిడే మరి!
2009... డిసెంబరు నెల. చాలా చలిగా ఉంది. శ్రీను వైట్ల మాత్రం చాలా వేడి మీద ఉన్నాడు. మహేశ్‌కో కథ దొరి కితే తప్ప ఈ మనసు వేడి చల్లారదు. ఆస్థాన రచయిత గోపీ మోహన్‌తో కూర్చుని రకరకాల స్కెచ్‌లు వేస్తున్నాడు. కాన్సెప్ట్‌లు ఆలోచిస్తున్నాడు. ‘‘మహేశ్‌తో పీరియాడికల్ మూవీ చేద్దామా?’’ సడన్‌గా అడిగాడు శ్రీనువైట్ల. ‘‘చాలా బావుంటుంది. మొన్నీ మధ్యనే తమిళంలో కార్తీ ‘యుగానికి ఒక్కడు’ చేశాడు. ఆ ప్యాట్రన్ బాగుంటుంది. కానీ అది టైమ్ టేకింగ్ ప్రాసెస్’’ చెప్పాడు గోపీమోహన్.
‘‘ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది?’’ అన్నాడు శ్రీను వైట్ల. ఆయనలా అన్నా డంటే, ఇక పని మొదలు కావాలన్నట్టే!
పని మొదలైంది. ఒకటి, రెండు లైన్లు అనుకున్నారు. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘రంగ్‌దే బసంతి’ తరహాలో ఏమైనా చేద్దామా? నో యూజ్. ఇంకా కొత్తగా ఏదో ఆలోచించాలి. ఆ రోజు కె.రాఘవేంద్రరావు ఆఫీసు నుంచి డెరైక్ట్‌గా శ్రీను ఆఫీసుకు వచ్చాడు గోపీమోహన్. అతనో ట్రాన్స్‌లో ఉన్నాడు. ‘‘శ్రీనుగారూ! రచయిత జేకే భారవి గారు ఈ రోజు రాఘవేంద్రరావు గారికి ‘రావణబ్రహ్మ’ కథ చెబుతుంటే వండర్ అయిపోయా. మీరొకసారి కలవాలి’’ చెప్పాడు గోపీమోహన్. నెక్స్ట్ డే- శ్రీనువైట్ల, భారవి మీటింగ్. గంట కూర్చుందామనుకున్న వాళ్లు, ఐదు గంటలు అలానే ఉండిపోయారు. మైథలాజి కల్, హిస్టారికల్ థీమ్స్ గురించి డిస్కషన్. వీటిలో మహేశ్‌కి ఏది పనిచేస్తుంది? శ్రీను వైట్లకు ఇదే ఆలోచన.
మహేశ్ ‘ఖలేజా’ షూటింగ్‌లో ఉన్నాడు. శ్రీను వైట్ల రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాడు. అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ‘‘శ్రీనుగారూ! మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా. ఏదైనా నేను చేయడానికి రెడీ’’చెప్పేశాడు మహేశ్. ఇది ఇంకా బర్డెన్. మహేశ్‌తో సినిమా అంటేనే విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్. అన్నీ రీచ్ కావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. శ్రీను వైట్ల ఓ డెసిషన్‌కు వచ్చాడు. రైటర్స్ టీమ్‌ను పిలిచాడు. ‘ఖలేజా’ బాగా డిలే అవుతోంది. ఈ టైమ్‌లో మనం ఎపిక్ మూవీ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మహేశ్‌తో హిలేరియస్ ఎంటర్‌టైనర్ చేయమంటు న్నారు. ఇక నుంచి ఆ పనిలో ఉందాం.’’
ఇక్కడో చిన్న చేంజ్! కాదు...పెద్ద చేంజే!! ఇప్పుడు ప్రొడ్యూసర్ మంజుల కాదు... 14 రీల్స్ వాళ్లు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర... ఈ ముగ్గురూ శ్రీను వైట్లకు క్లోజ్‌ఫ్రెండ్స్. వెంకటేశ్ ‘నమో వెంకటేశ’ సినిమాతో ప్రొడక్షన్‌లోకి ఎంటరయ్యారు. కూతురి చదువు కోసం మంజుల కొన్నాళ్లు ప్రొడక్షన్‌కు దూరంగా ఉందామనుకోవడంతో 14 రీల్స్ వాళ్లకు గోల్డెన్ చాన్స్.
మళ్లీ అసలు కథలోకి వద్దాం. ఇక్కడ కథల వేటల కొనసాగు తోంది. శ్రీను బయట కథలు కూడా వింటున్నాడు. తెలుగు, తమిళం... ఇలా ఏ లాంగ్వేజ్ రైటర్‌నీ వదలడం లేదు. ఏదీ వర్కవుట్ కావడం లేదు. శ్రీను లేటెస్ట్ సినిమా ‘నమో వెంకటేశ’ రిలీజై 75 రోజులై పోయింది. ఇక్కడేమో ఒక్క ఇంచ్ కూడా డెవలప్‌మెంట్ లేదు. శ్రీనులో విపరీతమైన కసి. అలాంటి టైమ్‌లో గోపీ మోహన్ ఓ కాన్సెప్ట్ చెప్పాడు. శ్రీనువైట్లకు విపరీతంగా నచ్చేసింది. మహేశ్ కూడా ఓకే. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. చలో మహాబలేశ్వర్! నియరెస్ట్ ప్లేస్ టుపుణే.
శ్రీను వైట్ల... రైటర్స్ గోపీ మోహన్, శ్రీధర్ సీపాన, కో-డెరైక్టర్ సూర్య....ఇంకో ఇద్దరు. పంచగని ఏరియాలో పెద్ద గెస్ట్ హౌస్. టూవీక్స్ పగలూ రాత్రీ డిస్కషన్స్ మీద డిస్కషన్స్... 80 శాతం సూపర్‌గా వచ్చింది. లాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఎపిసోడ్ ఎంతకూ తెగడం లేదు. అదే బాగా రావా లని శ్రీనువైట్ల పట్టు. . విందు భోజనం పెట్టాలనుకున్నప్పుడు పప్పూ కూరలూ పచ్చడి, సాంబారే కాదు... పెరుగూ పాన్ కూడా అదిరిపోవాలి.
శ్రీను వైట్లకు ఏం పాలుపోవడం లేదు, ఏదో ఒక చోట డెసిషన్ తీసుకోవాల్సిందే. మహాబలేశ్వర్ లోకి శివాలయానికెళ్లాడు. ఆ గుళ్లోనే చాలా సేపు ఒంటరిగా కూర్చున్నాడు. బయటకు రాగానే డేరింగ్ డెసిషన్. ఈ కథ డ్రాప్. అందరూ షాక్. ఇదేమో మే నెల. జూలై కల్లా ‘ఖలేజా’ అయిపోతే, ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ కావాలి. అంటే 2,3 నెలల మించి టైమ్ లేదు. ఇప్పటి కిప్పుడు మళ్లీ కొత్త కథ చేసుకోవాలి. అందరిలోనూ టెన్షన్. కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్నాడు శ్రీను. బాడీ కన్నా మైండ్ ఎక్కువ వాక్ చేస్తోంది. ఫ్లాష్‌లా ఓ ఐడియా. మహేశ్‌ని వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఎమ్మెల్యేలా చూపిస్తే?
ఆఫీసులో మీటింగ్. ‘‘ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి తెలుసుగా! ఆయనో మంచి మాస్ లీడర్. ఆయన అంతిమయాత్రకు లక్షల్లో జనాలు వచ్చారు....’’ అని చెప్పుకుంటూ పోతు న్నాడు శ్రీను. ఏదైనా కాన్సెప్ట్ చెబుతాడను కుంటే పీజేఆర్ గురించి లెక్చర్ ఇస్తున్నా డేంటని టీమ్ మెంబర్స్‌లో కన్ ఫ్యూజన్. ‘‘ఇదే మన కథ. హీరో తండ్రి పీజేఆర్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి. హీరో కూడా ఎమ్మెల్యేనే... కానీ కాదు. రియాల్టీ షోలాగా సినిమా నడవాలి’’ అని కన్‌క్లూజన్ ఇచ్చేశాడు శ్రీను.
ఆ టీమ్‌లో ఒకతను హుషారుగా విజిలేశాడు. శ్రీనుకు ఆ కథ స్టామినా అర్థమైపోయింది. స్క్రిప్ట్‌వర్క్ స్టార్ట్స్.
రాత్రి ఎనిమిదిన్నరకూ కూర్చొని తెల్లారేలోగా స్టోరీ కాన్సెప్ట్ రెడీ చేసేశారు శ్రీను వైట్ల, గోపీమోహన్. తర్వాత ఊటీ వెళ్లి ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసేశారు. ‘‘ఫెంటాస్టిక్... మైండ్‌బ్లోయింగ్... అన్‌బిలీవబుల్...’’ కథ విన్నాక మహేశ్ ఇమ్మీడియేట్ రియాక్షన్. డైలాగులు బాంబుల్లాగా ఉండాలి. శ్రీను రాయడం మొదలుపెట్టాడు. అలాంటి టైమ్‌లోనే కోన వెంకట్ ఎంటరయ్యాడు. అగ్నికి ఆజ్యం తోడయ్యింది. డైలాగ్ వెర్షన్ కూడా మైండ్ బ్లోయింగ్.
ఇక్కడో చిన్న సర్‌ప్రైజ్. కథ కూడా రెడీ కాకుండానే హీరోయిన్ రెడీ. ‘ఏ మాయ చేశావె’తో హీరోయిన్‌గా ఎంటరైన సమంతా ఫస్ట్‌లుక్‌లోనే నచ్చేసింది. మహేశ్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్. మంజుల సపోర్ట్‌తో సమంత సెకండ్ సినిమా అగ్రి మెంట్ తీసేసుకున్నారు. ఆమెకు కూడా ఇది గోల్డెన్ ఛాన్స్. కాస్టింగ్ అంతా ఫైనల్. హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒకటే బ్యాలెన్స్. నెంబరాఫ్ ఆప్షన్స్. ఏదీ సెట్ కావడం లేదు. ‘ప్రకాశ్‌రాజ్‌గారిని పెట్టుకోండి....’ - ఇది మహేశ్ సజెషన్.
కథకెంత టెన్షన్ పడ్డారో, టైటిల్‌కే అంతే టెన్షన్. ‘పవర్’ అని పెడితే బాగుం టుంది. ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ట్రెడ్‌మిల్ మీద రన్నింగ్ చేస్తుంటే వచ్చిందో టైటిల్... ‘దూకుడు’. ఫెంటా స్టిక్... మైండ్‌బ్లోయింగ్... అన్‌బిలీవబుల్. శ్రీను సినిమాలో మ్యూజిక్ అదిరిపో తుంది. దేవిశ్రీప్రసాద్‌తో హిట్ కాంబి నేషన్. ఇద్దరూ కలిసి ఏడు సినిమాలు చేశారు. ఇప్పుడేమో దేవీ బిజీ. ఎవరిని తీసుకోవాలి? శ్రీనుకు తమన్ రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నాడు. ‘‘ఒక్క చాన్స్... ఒక్క చాన్స్’’ అంటూ వెంటాడుతున్నాడు. అతనికో చాన్స్ ఇద్దామా? రెండు సిట్యు యేషన్స్ చెప్పి ‘‘టూ, త్రీ డేస్‌లో కలువ్’’ అన్నాడు శ్రీను. ఆ సాయంత్రానికే తమన్ రెడీ. రెండు పాటలు చేసుకొచ్చాడు. ‘నీ దూకుడు...’, ‘గురువారం మార్చి 1’. తమన్ కొట్టావురా గోల్డెన్ చాన్స్.
హైదరాబాద్... ముంబయ్... బ్యాంకాక్... దుబాయ్ - ఇలా చాలా ప్లేసుల్లో షూటింగ్. ఓ ఇంపార్టెంట్ ఎపిసోడ్‌కి మాత్రం ఎవరూ వెళ్లని ఫారిన్ లొకేషన్‌కు వెళ్లాలని ప్లానింగ్. ఇస్తాంబుల్ బ్యూటిఫుల్ సిటీ. కానీ ట్రాఫిక్ ఎక్కువ. షూటింగ్ చేయడం కొంచెం కష్టమే! అయినా ప్రొసీడైపోయారు. ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేశారు. మహేశ్‌కి ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్‌లోనే ప్రాజెక్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్. ఓ రోజు సడన్‌గా మహేశ్ అడిగాడు... ‘‘మీ సినిమాల్లో తాగుడు సీన్లు ఫేమస్ అటగా. ఇందులో ఏమైనా పెట్టారా?’’
‘‘అబ్బే లేదండీ!’’
‘‘మీ సెంటిమెంట్‌ను ఎందుకు బ్రేక్ చేసుకోవడం. హ్యాపీగా పెట్టుకోండి!’’ మహేశ్ ఈజీగానే చెప్పేశాడు. కానీ మహేశ్ మందు కొట్టే సీన్ ఎలా ఇరికిం చడం? జస్ట్ అలా మందు స్మెల్ చేయిస్తే, వెరీ గుడ్ ఐడియా. ‘దూకుడు’తో పాటూనే మహేశ్ ఇంకో సినిమా చేయాలి. తమిళ్ డెరైక్టర్ శంకర్ మూవీ. ‘త్రీ ఇడియట్స్’ హిందీ మూవీకి రీమేక్. అక్కడా, ఇక్కడా - రెండు పక్కలా చేస్తూ ఉంటే క్యారెక్టర్ ఫ్లేవర్‌ని ఫీల్ కాలేడు. అందుకే మహేశ్ వదిలేసుకున్నాడు. ఇప్పుడు కాన్సన్ ట్రేషన్ మొత్తం ‘దూకుడు’ మీదే! 150 రోజుల షూటింగ్. టాకీ పార్ట్ తీసింది 50 రోజులే.
మిగతా 100 రోజులూ పాటలూ, ఫైట్లకే పట్టేసింది. మధ్యలో సినీవర్కర్స్ స్ట్రయిక్. దాంతో రిలీజ్... టు మంత్స్ డిలే! లెన్త్ కూడా ఎక్కువైపోయింది. ట్వంటీ మినిట్స్ సినిమా ఎడిట్ చేసి పక్కన పడేశారు. అయినా మూడు గంటలుంది. శ్రీను వైట్ల మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. రిజల్ట్ విషయంలో నో డౌట్. నో డైలమా. ఇది పక్కా బ్లాక్ బస్టర్.
‘కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు! దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’... ఇక్కడ శ్రీను వైట్లకు దిమాక్ ఉంది. ఇక్కడ దిమాక్ అంటే... తెలివైన మంచి కథ అనుకోవచ్చు. అలాంటి కథకు మహేశ్ లాంటి సూపర్‌హీరో దొరికాడు. ఇంకేం... రిజల్ట్ అలా ఇలా ఉండదు. 2011 సెప్టెంబరు 23న ‘దూకుడు’ రిలీజైంది. మార్నింగ్ షో చూసి సూపర్‌స్టార్ కృష్ణ ‘‘ఇది 80 కోట్ల సినిమా’’ అన్నారు. ఆయన చెప్పింది జోస్యం కాదు... పచ్చి నిజం. మహేశ్‌తో బ్లాక్‌బస్టర్ తీయాలని శ్రీనువైట్ల మైండ్‌లో ఫిక్సయ్యాడు. అందుకే- ‘దూకుడు’ బాక్సాఫీస్ దగ్గర బ్లైండ్‌గా దూసుకుపోయింది.
- పులగం చిన్నారాయణ
వెరీ ఇంట్రస్టింగ్
* ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్ లేదు. అది లాస్ట్ మినిట్ యాడింగ్. చాలామంది అబ్జెక్ట్ చేసినా, శ్రీను మొండిగా ఈ క్యారెక్టర్ పెట్టారు. తీరా సినిమా రిలీజయ్యాక, ఆ క్యారెక్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్
* ‘రోబో’లోని ‘కిలీమంజారో...’ పాట ఇన్‌స్పిరేషన్‌తో ఇందులో ‘చిల్‌బులీ...’ పాట డిజైన్ చేశారు
* హీరోయిన్ పార్వతీ మెల్టన్‌తో ఐటెమ్‌సాంగ్ చేయించారు హిందీలో సల్మాన్‌ఖాన్‌తో రీమేక్ ప్రపోజల్ వచ్చింది. ఎందుకనో కుదర్లేదు
* కన్నడలో ‘పవర్’ పేరుతో 14 రీల్స్ వాళ్లే రీమేక్ చేశారు.