
తమిళ నిర్మాతలు లేకుంటే రాజ్‌కుమార్ లేరు!
తమిళ నిర్మాతలు అవకాశం ఇవ్వకుంటే కన్నడ నటుడు రాజ్‌కుమార్ ఎక్కడుండేవారని సీనియర్ నిర్మాత వీసీ.గుహనాథన్ ప్రశ్నించారు.నటుడు కిశోర్, కరుణాకరన్ కథానాయకులుగా నటి స్తున్న చిత్రం గడియాగార మనిదర్‌గళ్. క్రిస్ట్ పి.ది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ పతాకంపై ప్రవీష్. కే.ప్రదీప్ జోష్ నిర్మిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన ప్రదీప్ జోష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వైగరై బాలన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శశికుమార్ శిష్యుడన్న విషయం గమనార్హం.
అద్దె ఇళ్ల నివాసుల ఇతి బాధలను ఆవిష్కరించే చిత్రంగా తెరకెక్కుతున్న ఈ గడిగార మనిదర్‌గళ్ చిత్రంలో షెరీన్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లతారావ్, వాసు విక్రమ్, బాలాసింగ్, సిజర్‌మనోహర్, పావా లక్ష్మణ్, సౌందర్, షీలాగోపి, మాస్టర్ రిషీ నటిస్తున్నారు. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రం, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కే.భాగ్యరాజ్, వీసీ.గుహనాథన్, కదిరేశన్, పీఎల్.తేనప్పన్ పాల్గొన్నారు. వీసీ.గుహనాథన్ మాట్లాడుతూ కులమతాలకు, భాషలకు అతీతం కళాకారులని పేర్కొన్నారు.
అలాంటి కళాకారులు నీటి కోసం జరిగే పోరాటంలో జోక్యం చేసుకోరాదన్నారు. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ఇదే జరుగుతుందన్నారు. నిజం చెప్పాలంటే కన్నడ నటుడు రాజ్‌కుమార్ తమిళ నిర్మాతలు ఏవీ.మెయప్పన్, సీఆర్.బసవరాజు లాంటి వారు నిర్మించిన బేడర కన్నప్ప చిత్రం లేకపోతే ఎక్కడుండేవారని ప్రశ్నించారు.అలాంటి రాజ్‌కుమార్‌కు చెందిన వారు కావేరి నీటి విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శక నటుడు కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ వీసీ.గుహనాథన్ ఎప్పుడూ భావోద్రేకంతో మాట్లాడతారని, అయినా ఆయన మాటల్లో న్యాయం ఉంటుంద ని అన్నారు.
ఇది భావోద్రేకాలకు గురైయ్యే పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ఇక ఈ గడిగార మనిద ర్‌గళ్ చిత్ర విషయానికి వస్తే మంచి విషయం ఉన్న దర్శకుడు శశికుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని భావించవచ్చునన్నారు.అదే విధంగా కిషోర్ నటిస్తున్నారంటే కచ్చితంగా కథలో కొత్తదనం ఉంటుందని అన్నారు. గడియార మనిదర్‌గళ్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కిషోర్, నటి షెరీన్, ప్రదీప్ జోష్, నిర్మాత ప్రవీష్.కే, దర్శకుడు వైగరై బాలన్ పాల్గొన్నారు.