వినాయకచవితికి ఇరుముగ న్
ఇరుముగన్ చిత్రం వినాయకచవితి పండగ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. సియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంతో అందాల భామలు నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు. అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రంతో మోగాఫోన్ పట్టిన యువ దర్శకుడు ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఇరుముగన్ తాజాగా భారీ షెడ్యూల్‌ను శనివారం నుంచి చెన్నైలో జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని జూలైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇంతకు ముందు తెలిపారు. అయితే చిత్ర విడుదల తేదీ మారనుందని సమాచారం. చిత్ర షూటింగ్ జూన్ చివరి వరకూ జరగనుందని తెలిసింది. చెన్నై షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత తదుపరి లడక్‌లో నిర్వహించనున్నట్లు, చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను బ్యాంకాంక్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందువల్ల చిత్రాన్ని వినాయకచవితి పండగను పురష్కరించుకుని సెప్టెంబర్ ఐదున విడుదల చేయడానికి సన్నాహాలు చే స్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.