టైటిల్ : గౌతమ్నంద
జానర్ : యాక్షన్ మూవీ
తారాగణం : గోపిచంద్, హన్సిక, కేథరిన్ థెరిస్సా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషి
సంగీతం : తమన్
దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లారావు
చాలా కాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ హీరో గోపిచంద్, తన స్టైల్, బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకొని చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గౌతమ్నంద. మాస్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎలివేట్ చేసే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్ ఆశించిన విజయాన్ని అందించిందా..? సంపత్ కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడా...?
కథ :
ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్), ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించిన తెలుగు బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని( సచిన్ కేడ్కర్) వారసుడు. ఆకలి, కష్టం, బాధ, కన్నీళ్లులతో పాటు ప్రేమ అంటే ఎంటో కూడా తెలియకుండా పెరిగిన కుర్రాడు. ఎప్పుడు పార్టీలు పబ్ లు అంటూ తిరిగే గౌతమ్ కు ఒక సంఘటన మూలంగా.. తను ఎవరు..? విష్ణు ప్రసాద్ కొడుకుగా కాక తనకంటూ వ్యక్తిగతంగా ఉన్న గుర్తింపు ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతుంది..? ఆ ఆలోచనలోనే గమ్యం తెలియకుండా ప్రయాణిస్తున్న గౌతమ్ కు, అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మరో వ్యక్తి నంద కిశోర్ ఎదురుపడతాడు.
డబ్బు తప్ప వేరే ఏ ఎమోషన్ తెలియని గౌతమ్, డబ్బుంటే చాలు ఏదైనా చేసేయోచ్చు అనే నంద, తమ స్థానాలు మార్చుకొని ఒకరి ఇంటికి ఒకరు వెళతారు. నందు ఇంటికి వెళ్లిన గౌతమ్, వారి ప్రేమతో జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ కుటుంబ కష్టాలు తీర్చడానికి చిన్న ఉద్యోగంలో చేరతాడు. కానీ వరుసగా నందు కుటుంబానికి ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో తన ఆస్తి మీద కన్నేసిన విష్ణు ప్రసాద్ స్నేహితుడు ముద్ర (ముఖేష్ రుషి) మీద గౌతమ్ కు అనుమానం వస్తుంది. మరి నిజంగా ముద్రానే నందు కుటుంబాన్ని ఎటాక్ చేశాడా..? ఆ ప్రమాదాల నుంచి నందు ఫ్యామిలీని గౌతమ్ ఎలా కాపాడాడు..? చివరకు నందు, గౌతమ్ లు ఎవరి స్థానాల్లోకి వారు వచ్చారా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
మాస్ యాక్షన్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న గోపిచంద్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. మేకోవర్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా వేరియేషన్ చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్న గోపిచంద్, రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ తో మెప్పించాడు. హీరోయిన్ కేథరిన్ నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో అదరగొట్టింది. హన్సిక స్క్రీన్ టైం కూడా తక్కువ కావటంతో ఉన్నంతలో పరవాలేదనిపించింది. విలన్లుగా ముఖేష్ రుషి, నికితిన్ ధీర్ లు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, సీత తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
వరుసగా కమర్షియల్ హిట్స్ సాధిస్తున్న దర్శకుడు సంపత్ నంది రెండేళ్ల విరామం తరువాత తెరకెక్కించిన సినిమా గౌతమ్నంద. మాస్ హీరో గోపి చంద్ ను స్టైలిష్ గా ప్రజెంట్ చేయాలనుకున్న సంపత్ నంది మంచి విజయం సాధించాడు. గోపిచంద్ మేకోవర్ తో పాటు సినిమాను స్టైలిష్ గా ప్రజెంట్ చేయటం లో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. డ్యూయల్ రోల్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కథనే తనదైన టైకింగ్ తో కొత్తగా ప్రజెంట్ చేశాడు సంపత్. ఫస్ట్ హాఫ్ క్లాస్ గా నడిపించిన సంపత్ నంది, సెకండాఫ్ లో తన మార్క్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించాడు. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను పక్కగా యాడ్ చేసిన దర్శకుడు మరోసారి ఆకట్టుకున్నాడు.
సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ సుందర్ రాజన్ సినిమాటోగ్రఫి. డ్యూయల్ రోల్ సీన్స్ చాలా నేచురల్ గా కనిపించాయి. లావిష్ గా కనిపించే గౌతమ్ ఇంటిని ఎంతో బాగా ప్రజెంట్ చేశాడో.. బోరబండ స్లమ్ ఏరియాను అంతే నేచురల్ గా చూపించాడు. తమన్ పాటలు పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాతలు సినిమా కోసం పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
గోపిచంద్ నటన
నిర్మాణ విలువలు
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్