ఏలూరు బాలాజీ థియేటలో ప్రేక్షకులతో మాట్లాడుతున్న హీరో అడవి శేష్
పశ్చిమగోదావరి, భీమవరం : గూఢచారి సినిమా యూనిట్ జిల్లాలోని భీమవరం, ఏలూరులో ఆదివారం సందడి చేసింది. చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను హీరో అడవి శేష్, చిత్రబృందం సందర్శించింది. మంచి కథలతో నిర్మించిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి గూఢచారి చిత్రమే నిదర్శనమని హీరో అడవి శేష్ అన్నారు. చిత్రం విజయోత్సవంలో భాగంగా ఆదివారం భీమవరం పట్టణంలోని ఏవీజీ సినిమాస్ (మల్లీఫ్లెక్స్)కు వచ్చారు. తాను అనుష్క, సమంతలతో నటించాలనేది కోరికని అయితే సైజ్ జీరో సినిమాలో అనుష్కతో చిన్నపాత్ర చేయగా సమంతతో యాడ్‌లో కలిసి నటించినట్లు శేష్ తెలిపారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమని, స్నేహితుల సహకారంతో డబ్బు ఖర్చు చేసి సినీపరిశ్రమకు వచ్చానని అయితే అవకాశాలు మాత్రం రాలేదని తనంతటతానే సృష్టించుకున్నానని శేష్ వివరించారు. కర్మ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన తనకు పంజా, రన్ రాజా రన్, క్షణం, గూఢచారి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకువచ్చినట్లు తెలిపారు. 2004లో గూఢచారి చిత్ర కథను తానే రాసుకున్నా అప్పటి స్నేహితుడు శశికిరణ్‌తో కలిసి తాజాగా మార్పులు చేసి చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. గతంలో తాను రాజమౌళి, ఇంద్రగంటి, విష్ణువర్ధన్ వద్ద పనిచేశానని రాజమౌళితో సినిమా చేయాలనే కోరిక ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం 2 స్టేట్స్ చిత్రంలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్‌గా తాను హీరోగా చేస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థినులతో నృత్యం చేసిన శేష్
పట్టణంలోని శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం గూఢచారి చిత్రం యూనిట్ సందడి చేసింది. చిత్ర కథానాయకుడు అడవి శేష్ , దర్శకుడు శశికిరణ్ చిత్ర బృందం విద్యార్థులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. హీరో శేషు మాట్లాడుతూ గూఢచారి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రాజమౌళి, పవన్ వద్ద మెళకువలు నేర్చుకున్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రాజమౌళి, హీరో పవన్ కళ్యాణ్ వద్ద నేర్చుకున్న మెళకువలు తమ గూఢచారి చిత్రానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆ చిత్ర హీరో అడవి శేష్ పేర్కొన్నారు. గూఢచారి చిత్ర బృందం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ టూర్‌లో భాగంగా ఆదివారం స్థానిక బాలాజీ థియేటర్‌లో మ్యాట్నీషో సందర్భంగా థియేటర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తొలుత థియేటర్‌లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను నటించిన తొలి చిత్రం కర్మ విమర్శకుల ప్రశంసలు పొందినా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదన్నారు. అయితే ఆ చిత్రం చూసిన దర్శకుడు విష్ణువర్థన్, హీరో పవన్‌కళ్యాణ్ తనకు పంజా సినిమాలో విలన్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారన్నారు. గూఢచారి చిత్రాన్ని 116 రోజుల పాటు 168 లొకేషన్లలో చిత్రీకరించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించామన్నారు. ఈ చిత్రాన్ని చూసిన హీరోలు నాగార్జున, నాని, హీరోయిన్ సమంతా తమ బృందాన్ని అభినందించారని చెప్పారు. ఈ చిత్రానికి మరో రెండు భాగాలున్నాయని, తన తదుపరి చిత్రాలు అవేనన్నారు. చిత్ర దర్శకుడు శశికుమార్ టిక్కా మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడూ కష్టపడి పనిచేశారని, చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుండడంతో తమ కష్టాన్ని మరిచిపోయామన్నారు. ఉషా పిక్చర్స్ మేనేజర్ సురేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment