కంటెంట్ ఉంటే హీరో కటౌట్‌తో పనిలేకుండా సెంచరీలు కొట్టేస్తున్న రోజులివి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్‌లో కొత్త ఆటగాళ్లు ఎలా దంచికొడుతున్నారో.. సినిమాల్లోకి కొత్తగా వచ్చిన హీరోలు కూడా అలాగే వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. సిద్దు సెంచరీ కొట్టడంతో టిల్లు క్యూబ్ అంటూ తన తదుపరి చిత్రంపై కూడా మరింత అంచనాలను పెంచగలిగాడు.
ఆ రకంగా సిద్దు ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్‌గా తీర్చిదిద్దుకున్నాడు. టిల్లుతో తనలో ఉన్న రైటింగ్ స్కిల్స్ అతన్ని 100 కోట్ల హీరోగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాయి అన్నది వాస్తవం. అయితే ఇతడి కంటే ముందు తేజ సజ్జ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు.
అలాగే హీరో నాని దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు.గీతగోవిందంతో విజయ్ దేవరకొండ, ఎఫ్-2 తో వరుణ్ తేజ్, 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. కార్తికేయ-2 తో నిఖల్ వంద కోట్లు సాధించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.
ఇక తన తొలి సినిమా ఉప్పెన చిత్రంతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వందకోట్ల క్లబ్‌లో చేరిన వాడే. మరి ఈ రేసులో తదుపరి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడివి శేష్‌కు ఉందని చెప్పొచ్చు. గతంలో శేష్ నటించిన గుఢచారి, హిట్-2, ఎవరు, మేజర్ లాంటి సినిమాలతో అడవి శేష్ పేరు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు 50-60 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మేజర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచి 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం శేష్ గుఢచారి-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాలతో నటనతో పాటు రైటింగ్‌లో కూడా శేష్‌కు అపార అనుభవం ఉంది. తనని స్టార్‌గా మార్చుకోవడంలో రైటింగ్ స్కిల్ అతడికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పాలి. గుఢచారి-2 తో అడివి శేష్ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడు అనే అంచనాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్యమని భావిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment