‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి హిందీ చిత్రాలతో, తమిళ చిత్రం ‘ఆదిత్య వర్మ’తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బనితా సంధు. ఈ బ్యూటీ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అడివి శేష్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ ఫిల్మ్ (2018) ‘గూఢచారి’కి సీక్వెల్‌గా పాన్ ఇండియా స్థాయిలో ‘జీ 2’ తెరకెక్కుతోంది. గూఢచారిగా హీరో అడివి శేష్ నటిస్తున్నారు. ఈ స్పై సరసన బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో బనితా జాయిన్ అయిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘శేష్, బనితాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. తెరపై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. హై ఆక్టేన్ యాక్షన్ మూవీగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘‘ఈ చిత్రంలో నటించడం క్రియేటివ్‌గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను’’ అని బనితా సంధు అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment