లౌక్యం... చాకచక్యం
‘కండబలముతోనే ఘనకార్యమ్ము సాధించలేరు... బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరించగలరు...’ అనే కృష్ణబోధను సరిగ్గా ఆకళింపు చేసుకున్నాడా కుర్రాడు. కొండల్ని పిండిచేసే కండబలం ఉన్నా.. బుద్ధిబలమే అతని ఆయుధం. లౌక్యం, చాకచక్యం అతని శంఖచక్రాలు. అసాధ్యమనుకున్నదాన్ని చిరునవ్వుతోనే సుసాధ్యం చేసేయడం అతని స్టైల్. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్యా క్రియేషన్స్ వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో గోపీచంద్ పాత్ర తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి. గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లక్ష్యం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రతిష్ఠాత్మకంగా శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ ఇందులో కథానాయిక. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ నెల 11తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 25 నుంచి 30 వరకూ క్లైమాక్స్ చిత్రీకరిస్తాం. ఆగస్టులో మూడు పాటలను విదేశాల్లో, రెండు పాటలను హైదరాబాద్‌లోనూ చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
శ్రీవాస్ మాట్లాడుతూ- ‘‘గోపీచంద్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్రచిత్రణ గమ్మత్తుగా ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర ఓ హైలైట్. హంసానందిని స్పెషల్ కేరక్టర్ చేస్తున్నారు. ఆమెపై ఓ పాట కూడా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అయిదు పాటలకు అద్భుతమైన స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. చంద్రమోహన్, పోసాని, కోవై సరళ, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, కెమెరా: వెట్రి, ఎడిటింగ్: శేఖర్.