
ఆయన స్పాట్ ఫ్రెండే!
హీరోలు హీరోయిన్లను సిఫారసు చేయడం అన్నది సాధారణంగా జరిగే విషయమే.
హీరోలు హీరోయిన్లను సిఫారసు చేయడం అన్నది సాధారణంగా జరిగే విషయమే. అయితే దీన్ని ఎవరూ అంగీకరించరు. సిఫారసు చేసే హీరోలు కూడా హీరోయిన్ల ఎంపిక అన్నది దర్శక నిర్మాతల పరిధిలోని విషయం అనే చెబుతుంటారు. ఇక ఫలాన హీరో నాకు సిఫారసు చేశారని హీరోయిన్లు మాత్రం ఎందుకు చెబుతారు? ఏమీ చెప్పకపోయినా వారి మధ్య ఏదో ఉందని గాసిప్స్ గుప్పించే మీడియా నిజాలు చెబితే ఇంకా రెచ్చిపోదూ. అందుకు నటి తాప్సీ కూడా తనకెవరూ సిఫారసు చేయడం లేదని ఢంకా ఊదేస్తోంది. ఇంతకు ముందు వరకూ తమిళం, తెలుగు భాషల్లో నటించిన ఈ ఢిల్లీ బ్యూటీకి ఇక్కడ అవకాశాలు పూర్తిగా అడుగంటాయి.
అయితే బాలీవుడ్ అమ్మడిని ఆదుకుంది. ఆ మధ్య అమితాబ్ నటించిన పింక్ చిత్రంలో అత్యాచారానికి గురైన అమ్మాయిగా జీవించడంతో అక్కడ తాప్సీ పరిస్థితి బాగానే ఉంది. ఈ భామకు టాలీవుడ్ యువ నటుడు రానా సిఫారసు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రానా బహుభాషా నటుడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే త్రిష, తమన్నా, శ్రియలతో ఈయన్ని కలిపి వదంతులు దొర్లాలి. తాజాగా రానాతో తాప్సీ సన్నిహితం అంటూ గాసిప్స్ హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బేబీ అనే హిందీ చిత్రంలో కలిసి నటించిన రానా, తాప్సీ తాజాగా కాళీ అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రంలో నాయకి పాత్రకు తాప్సీకి రానానే సిఫారసు చేశారనే ప్రచారానికి స్పందించిన ఈ ఢిల్లీ పాప నటుడు రానా తనకు షూటింగ్ స్పాట్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేసింది. అంతకంటే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయినా రానా తనకు సిఫారసు చేయాల్సిన అవసరం లేదని, హిందీలో తానిప్పుడు బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నానని చెప్పింది. అలా ఈ కథకు తాను అవసరం కావడంతో దర్శకుడు తనను ఎంపిక చేశారని తాప్సీ పేర్కొంది.