కొత్త హంగులతో సారథి
‘‘తెలుగు సినిమా అనే పదానికి ఉపమానం లాంటి ‘సారథీ స్డూడియో’ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సరికొత్త సొబగులు అద్దుకోవడం ఆనందంగా ఉంది. దాదాపు 25 నుంచి 30 సినిమాలు నేను ఈ స్టూడియోలోనే రూపొందించా’’ అని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. హైదరాబాద్‌లో తొలి తరం ఫిలిమ్ స్టూడియోగా తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన సారథీ స్టూడియోను స్థాపించి, 60 ఏళ్లు పూర్తయింది. 1956లో ప్రారంభమైన ఈ స్డూడియో నేటి షూటింగ్‌లకు అనుగుణంగా సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది.
శుక్రవారం జరిగిన ఈ స్టూడియో పునరంకితోత్సవంలో సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ సారథీ స్టూడియో వెబ్‌సైట్ ‘సినీ సారథి’నీ, దాసరి ప్రివ్యూ థియేటర్‌నూ, కె. రాఘవేంద్రరావు డబ్బింగ్, ఎడిటింగ్ విభాగాలనూ ఆవిష్కరించారు. ఇక నుంచి ‘సారథి సంస్థ’ పేరుతో కొనసాగుతుందని సంస్థ చైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి. ప్రసాద్, డెరైక్టర్ కేవీ రావు తెలిపారు.