అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రంలో కథానాయికగా నటించడం ద్వారా శోభిత ధూళిపాళ్ల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అభిషేక్ నామా, టీజీ. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 3న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా శోభిత చెప్పిన విశేషాలు..
∙మాది తెనాలి. వైజాగ్‌లో ప్లస్ టు కంప్లీట్ చేసిన తర్వాత ముంబై వెళ్లాను. అక్కడే డిగ్రీ పూర్తి చేశా. ఆ టైమ్‌లోనే మిస్ ఇండియా పోటీలకు వెళ్లి సెలక్ట్ అయ్యాను. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు పడ్డాయి. ఏదైనా కొత్తగా నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. భరతనాట్యం, కూచిపూడిలో మంచి ప్రావీణ్యం ఉంది.
∙అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో హిందీలో రూపొందిన ‘రామన్ రాఘవ్ 2.0’ నా కెరీర్ తొలి చిత్రం. ఈ సినిమాకు తొలి ఆడిషన్స్‌లోనే సెలక్ట్ కావడం, నా ఫస్ట్ సినిమానే అనురాగ్ కశ్యప్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారితో అసోసియేట్ అవ్వడంతో ఫుల్ హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా విడుదల తర్వాత అడవి శేష్ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్ని భాషల్లో నటించిన నేను తెలుగమ్మాయినే కదా. అందుకే తెలుగు సినిమా అవకాశం రాగానే ఒకే చెప్పేశాను. అయినా సొంత భాషలో నటించడం వల్ల కలిగే తృప్తి వేరు. అలాగే అడవి శేష్ చెప్పిన ‘గూఢచారి’ కథ నాకు బాగా నచ్చింది. ఇందులో సమీరా పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మంచి ఫేజ్‌లో ముందుకు వెళ్తున్నాం అనిపిస్తోంది.
∙మా ఇంట్లో వారికి సినిమాల గురించి పెద్దగా తెలియదు. గ్లామర్ ఫీల్డ్‌లోకి వెళ్తున్నాను అని చెప్పగానే షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత బాగా ప్రోత్సహించారు. మిస్ ఇండియా గెలిచినప్పుడే తెలుగులో నటించమని కొందరు అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను నటించాలనుకోలేదు. సో..ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ‘గూఢచారి’ టీజర్ రిలీజ్ తర్వాత మరికొంత మంది మళ్లీ అప్రోచ్ అవుతున్నారు. ప్రస్తుతం హిందీలో ‘ది బాడీ, ముథూన్, మేడ్ ఇన్ హెవెన్’ చిత్రాల్లో నటిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment