
తమిళసినిమా: పెళ్లి సందడిలో హన్సిక అనగానే ఆశ్చర్యపడుతున్నారా? అయినా ఈ ముంబై బ్యూటీ పెళ్లి చేసుకోనని ఎప్పుడైనా చెప్పిందా? అయితే గియితే ఇప్పట్లో అలాంటి ఆలోచనలేదని చెప్పి ఉండవచ్చు. అదీ ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమ, పెళ్లి వరకూ వచ్చి బెడిసికొట్టడంతో ఆ విరక్తితో అలా అని ఉండవచ్చు. ఇకపోతే పెళ్లిసందడిలో హన్సిక అనగానే ఆమెకే పెళ్లి అనే నిర్ణయానికి రావడం సరికాదు.
అసలు విషయం ఏమిటంటే నటి హన్సిక సోదరుడు ప్రసాద్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. అయితే అదేదో తన పెళ్లే అన్నంతగా నటి హన్సిక సంబరపడి పోయింది. తెగ ఖుషీ అయ్యింది. మెహందీ వేడుక లగాయితు పెళ్లి వరకూ సోదరుడి పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఆటాపాటా అంటూ హన్సిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ వేడుక ఫొటోలను ఈ అమ్మడు తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది. అయితే హన్సిక ఆడిపాడిన కనువిందైన దృశ్యాలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకు ముందు తమిళంలో చేతి నిండా చిత్రాలున్న ఈ అమ్మడికిప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. ఉన్నది ఒక్కటే. ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్న గులేబాకావళి చిత్రం. దీనిపైనే హన్సిక ఆశలన్నీనూ. ఆ చిత్ర విజయం ఆ బ్యూటీకి చాలా అవసరం. త్వరలోనే గీతాల విడుదలకు చిత్ర యూనిట్ సన్నిహాలు చేస్తోంది. బొద్దుగా ముద్దుగా ఉండే హన్సిక ఇటీవల బరువు తగ్గి చాలా స్లిమ్‌గా తయారైంది. ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి తన తాజా అందాలివిగో అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ఫొటోలో సోషల్‌మీడియాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.