ఇరుక్కున్న హన్సిక | Hansika gets stuck in Chennai rains | Sakshi
Sakshi News home page

ఇరుక్కున్న హన్సిక

Published Thu, Nov 26 2015 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

ఇరుక్కున్న హన్సిక

ఇరుక్కున్న హన్సిక

 హీరోయిన్ హన్సికకు ఇదో మర్చిపోలేని అనుభవమైంది. వానలో షూటింగ్ అలవాటున్న ఈ అందాల రాశికి, వాన నీళ్ళలో ఇరుక్కుపోవడమంటే ఏమిటో తెలిసొచ్చింది. ఆ సంగతి గురించి హన్సిక చెబుతూ, ‘‘ఈ నవంబర్ 24ని ఎప్పటికీ మర్చిపోలేను. ముంబయ్‌కో, విదేశాలకో వెళ్లి, తిరిగొచ్చినప్పుడు ఎలా చెన్నై వస్తానో అలానే ఆ రోజు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. భారీ వర్షాల కారణంగా చెన్నై పరిస్థితి దారుణంగా మారిన విషయం నాకు తెలియదు. నా హోటల్ రూమ్‌కి వెళ్లడానికి కారు ఎక్కాను.
 
 సమయం గడుస్తోందే తప్ప హోటల్ రావడం లేదు’’ అని గుర్తుచేసుకున్నారు. తుపానుతో ఎడతెగని వర్షాల కారణంగా చెన్నై రోడ్లన్నీ జలమయం కావడంతో కొన్ని ఏరియాల్లో ఆ నగరవాసులు పడవ ప్రయాణం చేస్తున్నారు. కారులో ప్రయాణం అంటే ఇక గమ్యం చేరినట్లే. హన్సికకు అదే జరిగింది. ఇలా అయితే ఎప్పటికీ హోటల్‌కి చేరుకోలేమని భావించిన ఈ బ్యూటీ కారు దిగారు. దగ్గరలోనే వేరే ఏదైనా హోటల్‌లో బస చేయాలనుకున్నారు. పూనమల్లి రోడ్డులో కత్తిపరా ఫ్లై ఓవర్ మీదుగా నడక మొదలుపెట్టారు.
 
 వానలో పూర్తిగా తడిసిపోయారు. ఈలోపు హన్సికను కొంతమంది గుర్తుపట్టారు. కానీ, ఆమెను ఇబ్బందిపెట్టలేదు. ఎలాగోలా ఆమె హోటల్ చేరారు. ‘‘ఉత్తరాది అమ్మాయినైనా సౌత్‌ని నా హోమ్ టౌన్‌లానే భావిస్తాను. ప్రకృతి వైపరీత్యం కారణంగా తమిళనాడు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి’’ అన్నారు. మొత్తానికి, చెన్నై తుపాను వర్షాలు హన్సికకు ఒక అనుభవాన్నిచ్చాయన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement