అందాల భామ హన్సిక మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించనున్నారు. మహా చిత్రంతో అర్ధ సెంచరీ కొట్టేసిన ఈ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం నటుడు అధర్వతో రొమాన్స్ చేసిన 100 చిత్రం 9వ తేదీన తెరపైకి రానుంది. కాగా మహా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్రలో నటించడం విశేషం. అంతే కాదు మహా చిత్రంలో హన్సిక పలు గెటప్‌లలో కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కల్యాణ్ తెరకెక్కించనున్న నూతన చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
కథ సొల్లపోరేర్, గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన కల్యాణ్ తాజాగా నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్‌పాట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్టైయిన్‌మెంట్ పతాకంపై నటుడు సూర్య నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో తదుపరి చిత్రానికి కల్యాణ్ సిద్ధం అవుతున్నారు.
ఈ సారి కల్యాణ్ సూపర్ నేచులర్ థ్రిల్లర్ కథను తయారు చేసుకున్నారు. ఇందులో నటి హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నారు. కల్యాణ్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన గులేభకావళి చిత్రలోనూ హన్సిక లీడ్ రోల్‌లో నటించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో హన్సిక మరోసారి కల్యాణ్ దర్శకత్వంలో నటించడానికి ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment