సినిమా రివ్యూ: హ్యపీ న్యూ ఇయర్
చంద్రమోహన్ మనోహర్ శర్మ అలియాస్ చార్లీ (షారుక్ ఖాన్) 300 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను పారిశ్రామిక వేత్త చరణ్ గ్రోవర్ (జాకీష్రాఫ్) నుంచి దొంగిలిండచడానికి ప్లాన్ వేస్తాడు. అందుకోసం ఏర్పాటు చేసిన 'హ్యాపీ న్యూ ఇయర్ మిషన్' టీమ్ లో టామీ (బొమ్మన్ ఇరానీ), నందూ భిడే ( అభిషేక్ బచ్చన్), జాక్ (సోనూ సూద్), మోహిని (దీపికా పదుకొనే), రోహన్ (వివాన్ షా)లను చేర్చుకుంటాడు. దుబాయ్లో జరిగే వరల్డ్ డాన్స్ ఛాంపియన్ షిప్లో పాల్గొని, అక్కడే వజ్రాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తారు. వజ్రాలను దొంగిలించడానికి కారణమేంటి? అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వజ్రాలను ఎలా చేజిక్కించుకున్నారనేదే సింపుల్ గా 'హ్యాపీ న్యూ ఇయర్' కథ.
ఆకట్టుకునే అంశాలు:
దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, షారుక్ యాక్టింగ్
బొమ్మన్, సోనూ సూద్ల కామెడీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు, డ్యాన్స్
నిరాశపరిచే అంశాలు:
లాజిక్ లేని, రొటీన్ కథ
కథనంలో వేగం లోపించడం
దోపిడీ నేపథ్యంగా సాగే కథలోథ్రిల్స్, ట్విస్ట్ లు లేకపోవడం
నటీనటుల పెర్ఫార్మెన్స్:
ఈ చిత్రంలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలు కేవలం రెండే రెండు. ఒకటి అభిషేక్ బచ్చన్, రెండవది దీపికా పదుకొనే. నందూ భిటే పాత్రలో అభిషేక్ కొత్తగా కనిపిస్తారు. చక్కటి టైమింగ్తో కామెడీని, ఫెర్మార్మెన్స్ను పండించడంలో అభిషేక్ తన సత్తాను చూపాడు. అభిషేక్కు మంచి గుర్తింపు తెచ్చే పాత్ర అని చెప్పవచ్చు. ఇక మోహినిగా బార్ డాన్సర్గా దీపిక కనిపించింది. వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే పాత్రలో దీపికా మంచి మార్కులు కొట్టేసింది. ఇక షారుక్తో కలిసి అక్కడక్కడ మెరుపులు మెరిపించింది. చెవిటి వాడిగా సోను సూద్, మూర్ఛ రోగిగా బొమ్మన్, సాఫ్ట్ వేర్ హ్యాకర్గా వివాన్ షా తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనింపిచారు. కథ అంతా షారుక్ నడిపించినా.. ఆపాత్రకు బలమైన క్యారెక్టరైజేషన్ కొరవడంతో పెద్దగా ఆకట్టకోలేకపోయడానే చెప్పవచ్చు.
దర్శకత్వ విభాగ పనితీరు:
సింపుల్ కథను ఎంచుకుని పగ, ప్రతీకారం నేపథ్యానికి వినోదం, ప్రేమ, ఎమోషన్స్ లను మేళవించి టాప్ ఆర్టిస్టులతో దర్శకురాలు ఫరాఖాన్ చేసిన ప్రయత్నం హ్యాపీ న్యూ ఇయర్. పగ, ప్రతీకారం నేపథ్యంగా రూపొందే చిత్రాల్లో బలమైన విలనిజం లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా మారింది. ప్రధానమైన విలన్ జాకీ ష్రాఫ్ పాత్రను గెస్ట్గా మార్చడంతో హీరోయిజం ఎక్కడా ఎలివేట్ కాలేకపోయింది. షారుక్ తోపాటు మిషన్ హ్యాపీ న్యూయర్ టీమ్ ను బలంగా తీర్చిదిద్దలేకపోవడం లాంటి అంశాల్లో ఫరా ఖాన్ బలహీనతలు కనిపిస్తాయి. పూర్తి స్థాయిలో అటు యాక్షన్ చిత్రంగా లేదా వినోదాత్మకం చిత్రంగా మలచడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రేమ కథ సాగడం, షారుక్-దీపికా పదుకొనేల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాకపోవడం ఈ చిత్రంలో మరో ప్రధానమైన వైఫల్యంగా మారింది. షారుక్ ఎయిట్ ప్యాక్, సోనుసూద్ సిక్స్ ప్యాక్ మీద పెట్టిన దృష్టిని కొంత మరల్చి కథపై పెట్టి ఉంటే మరింత మెరుగైన ఫలితాన్ని పొందే అవకాశం ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఈ చిత్రం చూశాక హ్యపీ న్యూ ఇయర్ పూర్తిస్థాయి చిత్రంగా కాకుండా టెలివిజన్ డ్యాన్స్ అండ్ రియాల్టీ షోగానే ప్రేక్షకులకు అనిపించడం సహజం.
--రాజబాబు అనుముల