సాక్షి, చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో శింబు సోదరుడు కురళరసన్ తాజాగా మతం మార్చుకున్నారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. శింబుతోపాటు బాలనటుడిగా కురళరసన్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించి శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదునమ్మ ఆలు’ చిత్రంతో సంగీతదర్శకుడిగా మారారు. ఆయన తండ్రి సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు టీ. రాజేందర్.. ఆయన ఏ మతమైన సమ్మతమే అంటారు. ఇక, ఆయన పెద్ద కొడుకు శింబు శివభక్తుడు. కూతురు ఇలఖ్య ఆ మధ్య క్రైస్తవ మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. తాజాగా కురళరసన్ ఇస్లాం మతం స్వీకరించారు.
ఆయన శుక్రవారం చెన్నై, అన్నాశాలైలోని మక్కా మసీదులోని ముస్లిం మత గురువుల సమక్షంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కురళరసన్ తల్లిదండ్రులు టీ.రాజేందర్, ఉషా హాజయ్యారు. టీ.రాజేందర్ మాట్లాడుతూ కురళరసన్ చిన్నతనంలోనే ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యాడని, తనకు అన్ని మతాలు సమ్మతం కావడంతో తన ఇష్టాన్ని గౌరవించినట్లు తెలిపారు. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌రాజా ఇప్పటికే ఇస్లాం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కురళరసన్ ఆ కోవలో చేరారు. అయితే కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవడానికే తను మతం మారారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment