మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్యమీనన్ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఇటీవల కాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అలాంటివేమి తనకు ఎదురుకాలేదని ఈ బామ చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ఐశ్వర్యమీనన్ తెలిపింది. ఆ చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. అంతేకాక ఈత దుస్తులు ధరించడానికైనా సరే.. అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో మాత్రం నటించను అని ఐశ్వర్యమీనన్ స్పష్టం చేసింది.
అంతేకాక ఏ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చెప్పాలంటే ఆ లిస్ట్ చాలానే ఉందన్నారు. విజయ్, అజిత్, శివకార్తికేయన్ ఇలా చాలా మందితో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ఇలా చాలా మంది నాకిష్టమైన హీరోలు అని హీరోయిన్ చెప్పింది. అయితే ఈ అమ్మడు పుట్టి పెరిగింది, చదివింది తమిళనాడులోనే. కన్నడం, మలయాళం, తమిళ్, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీతో సాక్షి చిన్న భేటీ..
మీ సినీ రంగప్రవేశం ఎలా జరిగింది?
నేను పుట్టింది తమిళనాడులోని ఈరోడ్డులో. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాను. బీటెక్‌ను చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో చేశాను. అమ్మనాన్న, సోదరుడు అందరూ విద్యావేత్తలే. నేను ఇంజినీరింగ్ చదివినా నటన అంటే చిన్నతనం నుంచి ఆసక్తి. అందుకే చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. అలా తొలుత కన్నడంలో హీరోయిన్ అవకాశం వచ్చింది. ఆ తరువాత మలయాళంలో ఎంట్రీ అయ్యాను. ఆ చిత్రాల్లో నా నటనను చూసే తమిళంలో వీర చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అందులో నటించిన కృష్ట నా తొలి హీరో. గత శుక్రవారం తెరపైకి వచ్చిన తమిళ్ పడం–2 కు ఇక్కడ హీరోయిన్‌గా రెండవ చిత్రం.
తమిళ్ పడం–2లో నటించిన అనుభవం గురించి?
సీఎస్.అముదన్ దర్శకత్వం వహించిన తమిళ్ పడం నా ఫేవరేట్ చిత్రం. అది నేను చదువుకుంటున్న రోజుల్లో విడుదలైంది. దానికి రెండవ భాగం తమిళ్ పడం–2లో కథానాయకిగా నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. నన్ను నమ్మి ఇందులో అవకాశం ఇచ్చిన దర్శకుడు సీఎస్.అముదన్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తమిళ్ పడం–2లో నటించడం మంచి అనుభవం. కథానాయకిగా నాకిది ఐదవ చిత్రం.
తమిళంతో పాటు, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నారు. వీటిలో ఏ భాషా చిత్రానికి ప్రాముఖ్యతనిస్తారు?
తమిళ చిత్రాలకే ప్రాధాన్యతనిస్తా. అందుకు కారణం కూడా ఉంది. తమిళం మినహా ఇతర భాషలు సరళంగా మాట్లాడలేను.
కొత్త చిత్రాల అవకాశాల గురించి?
తమిళపడం–2 చిత్రం ఇటీవలనే తెరపైకి వచ్చింది. కొత్త చిత్రాల అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ చర్చల్లోనే ఉన్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెలువడతాయి.
తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారట?
అవును. తెలుగులో ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తా.
టాలీవుడ్‌లో అందాలారబోయాల్సి ఉంటుందంటారే?
నాకు సౌకర్యంగా ఉన్నంత వరకూ అందాలారబోతకు అభ్యంతరం లేదు. అది ఈత దుస్తులు ధరించడానికైనా సరే. అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో మాత్రం నటించను.
ఏ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నారు?
ఆ లిస్ట్ చెప్పాలంటే చాలానే ఉంది. విజయ్, అజిత్, శివకార్తికేయన్ ఇలా చాలా మందితో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ఇలా చాలా మంది నాకిష్టమైన హీరోలు.
నచ్చిన హీరోయిన్లు?
త్రిష, కాజల్ అగర్వాల్. నాకు స్ఫూర్తి వాళ్లే. వారిని చూసే నేను ఈ రంగంలోకి వచ్చానని కూడా చెప్పవచ్చు.
డ్రీమ్ పాత్రలంటూ ఏమైనా ఉన్నాయా?
నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. ఎలాంటి పాత్రకైనా పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.
కీర్తీసురేశ్ లాంటి వారు బయోపిక్ చిత్రాల్లో నటించి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. మీకు అలాంటి చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉందా?
అలాంటి అవకాశం రావాలే గానీ, కచ్చితంగా నటిస్తాను. అయితే నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలన్నది దర్శకులే నిర్ణయిస్తారు.
హీరోయిన్లకు ఇప్పుడు గట్టి పోటీ నెలకొందే?
నేనెవరినీ పోటీగా భావించను. నాకు లభించిన పాత్రలను సమర్థవంతంగా పోషించడంపైనే పూర్తిగా దృష్టి సారిస్తాను.
ప్రస్తుతం సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ కలకలం రేపుతోంది. దీనిపై మీ స్పందన?
నేను వింటున్నాను. అయితే నాకలాంటి సంఘటనలు ఎదురవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment