
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఇది
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రస్తుతం యువతను ఉర్రూతలుగిస్తున్న పేరు. ఇందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి ఈ తెలుగువీరుడి కథలో హీరోగా నటించనుండటమే. అయితే, నేటి యువతకు ఉయ్యాలవాడ ఎవరో పెద్దగా తెలీదు. ఆయన గురించి గూగుల్‌లో వెతికితే కనిపిస్తున్నది చిరంజీవి ఫోటోనే. దీంతో ఉయ్యాలవాడ గురించి తెలుసుకుంనేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. 18వ శతాబ్దంలో ఓ దక్షిణ భారత సామ్రాజ్యం సీడెడ్ జిల్లాల్లోని(కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి) కొన్ని గ్రామాలకు నియమించిన పాలేగార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ.
ఆ కాలంలో చాలా దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగార్ వ్యవస్ధ ఉండేది. ప్రజలకు రక్షణ కల్పించడం, పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటం, స్ధానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగివుండేవారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను(డ్యామ్‌ల నిర్మాణం, వ్యవసాయంలో సాయం తదితరాలు) కూడా చేపట్టేవారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో కీలకపాత్ర ఉంది. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుబాటు చేసిన పాలేగార్లకు గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఉయ్యాలవాడ గురించి పూర్తిగా తెలిసిన వారు అతి కొద్దిమందే ఉన్నారు.
సిపాయిల తిరుగుబాటుకు కొద్ది సంవత్సరాల క్రితమే తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల పరిపాలనపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులపై తిరుబాటు ప్రకటించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ. సైన్యంతో ఓ బ్రిటీష్ స్ధావరంపై దాడి చేసిన నరసింహారెడ్డి బ్రిటీష్ సైనికులను అక్కడి నుంచి తరిమికొట్టాడు. దీంతో ఉయ్యాలవాడను అణచివేయాలని అప్పటి బెంగాల్ గవర్నర్ మార్క్ హేస్టింగ్స్ మద్రాస్ కలెక్టర్ సర్ థామస్ మన్రోకు ఆదేశాలు జారీ చేశాడు.
దీంతో ఉయ్యాలవాడను పట్టుకుని ఆయన్ను బహిరంగంగా ఉరి తీయించారు. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వెనుక ఉన్న చరిత్ర. మరి తొలి తెలుగు వీరుడి చరిత్రను ఉన్నది ఉన్నట్లు చిత్రిస్తారో.. లేక ఏవైనా మార్పులు చేస్తారో.. తెర మీదే చూడాల్సివుంది. మొన్ననే సారాయ వీర్రాజు సినిమా దర్శకుడు కన్నన్‌ను ఈ చిత్రానికి రైటర్‌లలో ఒకరిగా ఎంపిక చేశారు. కథనాయికగా పలువురు బాలీవుడ్ భామల పేర్లను పరిశీలిస్తున్నారు.