నటి చనిపోయిన 24 గంటల్లో మరో విషాదం!
లాస్ ఏంజెలిస్: కూతురు మరణించిందన్న బాధతో తీవ్ర అస్వస్థతకు గురై ఆ మరుసటి రోజే హాలీవుడ్ దిగ్గజ నటి డెబ్బీ రెనాల్డ్స్(84) కన్నుమాశారు. రెనాల్డ్స్ కూతురు, ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్(60) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సోదరి క్యారీ చనిపోయిందన్న వార్త వినగానే అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఛాతిలో నొప్పి వచ్చిందని రెనాల్డ్స్ కుమారుడు టాడ్ ఫిషర్ తెలిపాడు. ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి ఆమెను హాస్పత్రికి తరలించామని అయినా ప్రయోజనం లేకపోయిందని బుధవారం ఆమె చనిపోయారని వివరించాడు.
'టామీ అండ్ ద బ్యాచిలర్', 'ద అన్ సింకబుల్ మాలీ బ్రౌన్'లలో నటనకు గానూ ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్లారు. డెబ్బీకి ఇద్దరు సంతానం కాగా, కూతురు క్యారీ ఫిషర్ ఈ నెల 27న గుండెపోటుతో చనిపోయింది. టాడ్ ఫిషర్ అనే కుమారుడు ఉన్నాడు. సోదరితో పాటు తల్లి మృతి అతనికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డెబ్బీ ఫిషర్ వృత్తిగత జీవితం కంటే వ్యక్తిగత జీవితంతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. 1959లో ఎడ్డీ ఫిషర్‌తో విడాకులు తీసుకున్న ఈ నటి 1960, 1984 లలో వివాహాలు చేసుకున్నారు. సోదరి అంత్యక్రియలు నిర్వహించాలని చూస్తుండగానే తల్లి మృతిచెందడంతో క్యారీ ఫిషర్ అంత్యక్రియలకు ఆలస్యమైంది. బహుశా ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహిస్తారని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.