Carrie Fisher
-
నటి చనిపోయిన 24 గంటల్లో మరో విషాదం!
లాస్ ఏంజెలిస్: కూతురు మరణించిందన్న బాధతో తీవ్ర అస్వస్థతకు గురై ఆ మరుసటి రోజే హాలీవుడ్ దిగ్గజ నటి డెబ్బీ రెనాల్డ్స్(84) కన్నుమాశారు. రెనాల్డ్స్ కూతురు, ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్(60) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సోదరి క్యారీ చనిపోయిందన్న వార్త వినగానే అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఛాతిలో నొప్పి వచ్చిందని రెనాల్డ్స్ కుమారుడు టాడ్ ఫిషర్ తెలిపాడు. ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి ఆమెను హాస్పత్రికి తరలించామని అయినా ప్రయోజనం లేకపోయిందని బుధవారం ఆమె చనిపోయారని వివరించాడు. 'టామీ అండ్ ద బ్యాచిలర్', 'ద అన్ సింకబుల్ మాలీ బ్రౌన్'లలో నటనకు గానూ ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్లారు. డెబ్బీకి ఇద్దరు సంతానం కాగా, కూతురు క్యారీ ఫిషర్ ఈ నెల 27న గుండెపోటుతో చనిపోయింది. టాడ్ ఫిషర్ అనే కుమారుడు ఉన్నాడు. సోదరితో పాటు తల్లి మృతి అతనికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డెబ్బీ ఫిషర్ వృత్తిగత జీవితం కంటే వ్యక్తిగత జీవితంతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. 1959లో ఎడ్డీ ఫిషర్‌తో విడాకులు తీసుకున్న ఈ నటి 1960, 1984 లలో వివాహాలు చేసుకున్నారు. సోదరి అంత్యక్రియలు నిర్వహించాలని చూస్తుండగానే తల్లి మృతిచెందడంతో క్యారీ ఫిషర్ అంత్యక్రియలకు ఆలస్యమైంది. బహుశా ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహిస్తారని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. -
చనిపోయిన నటి చివరి వింత కోరిక!
స్టార్ వార్స్ సినిమాలో నటించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించింది. స్టార్‌వార్స్ ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ఆమెకు 60 ఏళ్లు. ఆమెకు హారిసన్ ఫోర్డ్‌తోపాటు ఇతర స్టార్ వార్స్ సిరీస్ నటులు నివాళులర్పిస్తుండగా.. తాజాగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది. 'వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది' అని తన గురించి శ్రద్ధాంజలిలో రాయాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని 2008లో తాను ప్రచురించిన ఆత్మకథ 'విష్‌ఫుల్ థింకింగ్'లో పేర్కొంది. 1997నాటి స్టార్‌వార్ సినిమాలో పిన్సెస్ లీయా పాత్ర అంతరిక్షంలో తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ దుస్తులు ఎంతో ప్రసిద్ధి పొందాయి. అయితే, సినిమా దర్శకుడు జార్జ్ లుకాస్ ఈ దుస్తుల గురించి తనతో చర్చిస్తూ.. వీటిని వేసుకునేటప్పుడు లోదుస్తులు వేసుకోవద్దని, ఎందుకంటే అంతరిక్షంలో వాటిని వేసుకోబోరని చెప్పాడని తెలిపింది. 'ఈ డ్రెస్ వేసుకొనేటప్పుడు బ్రా ధరించవద్దని అతను చెప్పాడు. నిజమే అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మీ శరీర బరువు తేలికైపోతుంది. అప్పుడు మీ శరీరం ఉబ్బిపోవొచ్చు. కానీ బ్రా అలా పెరిగిపోదు. అందుకే నేను ఎలా చనిపోయినా పర్వాలేదు కానీ, బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయిందని శ్రద్ధాంజలిలో రాయమని నా స్నేహితులకు చెప్పాను' అంటూ తన పుస్తకంలో సరదాగా వివరించింది ఫిషర్.