భయపెడదాం!
సకల కళల సమ్మేళనం సినిమా. రకరకాల అంశాలను తమ చిత్ర కథలకు ఇతి వృత్తంగా ఎంచుకుంటున్నారు. అలాగే హీరోకయినా, హీరోయిన్‌కయినా, దర్శక నిర్మాతలకయినా విజయమే ముఖ్యం. అందుకు వాళ్లొక ట్రెండ్‌ను అనుసరించక తప్పదు. ఇప్పుడు కాలం మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పైపైకి పరుగులు పెడుతోంది. ఈ ఆధునిక యుగంలో మూస చిత్రాలకు మనుగడలేదు.
హర్రర్ మోహం
కొంత కాలంగా హర్రర్ కథా చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు ఆ తరహా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. హర్రర్ చిత్రాలకు హీరోల కన్నా కథ నేపథ్యం, సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యం. హీరోయిన్లు ముఖ్యంగా మారారు. ఇటీవల తెరపైకొచ్చిన చిత్రాలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఇంతకు ముందు హీరోయిన్లు కుటుంబ కథా చిత్రాల్లో ప్రేమ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపేవారు.
భయపెట్టాలి
ప్రస్తుతం వైవిధ్యం ఉందనిపిస్తే ఏ తరహా పాత్ర అయినా పోషించడానికి సిద్ధం అంటున్నారు. అవసరమయితే దెయ్యాలుగా భూతాలుగా భయపెట్టడానికి, అలాంటి పాత్రలకు భయపడటానికి ఓకే అంటున్నారు. ఆ మధ్య ప్రశాంత్ నటించిన షాక్ చిత్రంలో నటి మీనా భయంతో గగ్గోలు పెట్టారు. అంబులి 3డీ చిత్రంలో సనా శెట్టి భయంతో వణికిపోయింది. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని భయపెట్టి నిర్మాతల గల్లాపెట్టెలు నింపినవే. దీంతో ఇలాంటి భూత ప్రేత ఇతివృత్తాలతో చిత్రాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రముఖ హీరోయిన్లు అలాంటి చిత్రాల్లో నటించడానికి సై అంటున్నారు. దర్శకడు సుందర్.సి దెయ్యం ఇతివృత్తంగా అరణ్మణై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హన్సిక, ఆండ్రియ, రాయ్‌లక్ష్మి దెయ్యం బారినపడి ఎంత భయపడుతారన్నది త్వరలోనే చూడనున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆత్మ ప్రధాన పాత్రగా ఉంటుందట. అయితే ఈ పాత్రలో సూర్య భయపెట్టకుండా నవ్విస్తారట. ఈ చిత్రానికి పూచ్చాండి అనే పేరును నిర్ణయించారు. ఇక వైవిద్యభరిత చిత్రాల దర్శకుడు మిష్కిన్ హర్రర్ బాటనే పట్టారు.
ఆయన తాజా చిత్రం పిశాచి. ఈ చిత్రంలో పిశాచి కొత్తగా ఉంటుందట. అంబులి కూడా చిత్ర యూనిట్ తదుపరి చిత్రం కూడా దెయ్యం ఇతివృత్తమే. త్వరలో తెరపైకి ఆలమరం లాంటి మరి కొన్ని హర్రర్ చిత్రాలు రానున్నాయి. పలువురు దర్శకులు హాలీవుడ్ హర్రర్ చిత్రాలను ఉల్టా చేసి తమిళంలో తెరకెక్కించి కాసులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి కథా చిత్రాల్లో భయం లేదా హాస్యమే ప్రధానాంశంగా ఉంటోంది. ప్రేక్షకులను అలరించడంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం అధికం అవుతోందని సినీ పండితులు అంటున్నారు.