
ముంబై : అక్షయ్‌కుమార్ అప్‌కమింగ్ మూవీ హౌజ్‌ఫుల్-4 లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించడంతో అతడు సినిమా నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. తనుశ్రీ ఆరోపణలతో ‘మీటూ’ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో.. సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్‌పై కూడా వేధింపుల ఆరోపణలు రాగా అతడు కూడా దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తాజాగా... హౌజ్‌ఫుల్-4 సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు ఆరోపించారు. హీరోలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ సెట్లో ఉన్న సమయంలోనే తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. సదరు జూనియర్ ఆర్టిస్టు స్నేహితుడికి(సినిమాతో సంబంధం లేని వ్యక్తి), డాన్స్‌మాస్టర్‌కు గొడవ జరిగింది వాస్తవమేనని.. అయితే ఆ సమయంలో అక్షయ్, రితేశ్ అక్కడ లేరని తెలిపాడు. వ్యక్తిగత విషయాల కారణంగా జరిగిన గొడవను సినిమా యూనిట్‌కు ఆపాదించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. గొడవ జరిగిన సమయంలో తన అసిస్టెంట్ అక్కడే ఉన్నారని.. జూనియర్ ఆర్టిస్టు చెబుతున్నట్లుగా ఆమెను ఎవరూ లైంగిక వేధించలేదని తనతో చెప్పారని పేర్కొన్నాడు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంటే.. సంబంధంలేని విషయాల్లో కూడా ఇలా తమను ఇరికించడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment