సినిమా రివ్యూ: హృదయ కాలేయం | Hrudaya Kaleyam: Sampoornesh Babu one man over action show | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: హృదయ కాలేయం

Published Fri, Apr 4 2014 6:14 PM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

సినిమా రివ్యూ: హృదయ కాలేయం

సినిమా రివ్యూ: హృదయ కాలేయం

బ్యానర్: అమృత క్రియేషన్స్ 
నటీనటులు: సంపూర్ణేష్ బాబు కావ్య కుమార్, ఇషికాసింగ్, కత్తి మహేష్ తదితరులు 
సంగీతం: కెకే 
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్టీవెన్ శంకర్ 
నిర్మాత: సాయి రాజేష్ 
విడుదల తేదీ: 04, ఏప్రియల్ 2014
 
ప్లస్ పాయింట్స్:
చెప్పడం చాలా కష్హమైన పనే
 
మైనస్ పాయింట్స్:
లెక్కలేనన్ని
 
'హృదయ కాలేయం' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం కావడానికి ముందే సోషల్ మీడియా సృష్టించిన ఓ హీరో సంపూ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు. టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సంపూ మీడియాలో సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు. విడుదలకు ముందే 'హృదయ కాలేయం' సినిమాపై కంటే సంపూ మీదే తెలుగు ప్రేక్షకులు దృష్టి కేంద్రికృతమైంది. ఈ నేపథ్యంలో  ఏప్రిల్ 4 తేది శుక్రవారం విడుదలైన సంపూ చిత్రం 'హృదయ కాలేయం' ప్రేక్షకుల అంచనాలు చేరుకుందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. 
 
'సంపూ' ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి వస్తుంది. దొంగతనాలతో పోలీసులకు సంపూ సవాల్ గా నిలిస్తాడు. అన్ని రకాల చెమటోడ్చిన పోలీసులు చివరికి సంపూని పట్టుకుంటారు. సంపూని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగగా మారడమేమిటని ఆశ్చర్యపోతాడు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన సంపూ ఎందుకు దొంగగా మారాడు. సమస్యలో కూరుకుపోయిన నీలూని సంపూ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో సంపూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? సంపూ ప్రేమ కథకు 'హృదయ కాలేయం' టైటిల్ సంబంధమేమిటనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. 
 
సంపూ పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు ఓ నటుడా, స్టారా, ఎలా నటించాడు అనే ప్రశ్నను కాస్త పక్కన పెడుదాం. సంపూ పాత్రను పోషించిన సంపూర్ణేష్ బాబు సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు.  తనకున్నస్థాయితో పోల్చుకుంటే సంపూర్ణేష్ బాబు తొలి సినిమా పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. రెండున్నర గంటల సినిమా ప్రేక్షకుడిని చూసేలా మాత్రం ఓ ఆసక్తిని రేకెత్తించాడని మాత్రం చెప్పవచ్చు. హృదయ కాలేయం సినిమాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సంపూదే వన్ మ్యాన్ షో. మిగితా పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే కమిషనర్ పాత్రను పోషించిన కత్తి మహేశ్ కుమారే కాకుండా అన్ని పాత్రలు అతిగానే స్పందించాయి. 
 
టెక్నికల్ అంశాలు: ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. తన కెమెరా పనితీరుతో సంపూని తెరపై భరించే స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి కేకే అందించిన రీరికార్డింగ్ అదనపు ఆకర్షణ. సంపూ టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది.  ఎడిటింగ్ కూడా బాగుండటంతో సీన్లు చకచకా పరిగెత్తాయి. 
 
తెలుగు సినిమాపై సెటైర్ తో సంధించిన అస్త్రమే హృదయకాలేయం. ప్రతి సీన్ అతిగానే ఉంటుంది. తెలుగు సినిమాలో ఉండే లోటుపాట్లను ప్రధాన అంశంగా చేసుకుని దర్శకుడు స్టివెన్ శంకర్ 'హృదయ కాలేయం' చిత్రాన్ని రూపొందించారు. అంతా అతి కాబట్టి.. ఆ స్థాయికి తగ్గ, ఖచ్చితంగా సరిపోయే హీరో 'సంపూ'తో ప్రయోగం చేయడమే ఓ సాహసం. ఓ సాహసోపేతమైన ప్రయత్నంతో విడుదలకు ముందే డైలాగ్స్ తో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, ప్రేక్షకుల దృష్టిని మర్చేలా చేశారు. అంతేకాకుండా ఓ పెద్ద హీరోకు రాని పాపులారిటీని టీజర్, పోస్టర్స్ తో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. చెట్టు పసర్లతో కంప్యూటర్ చేయడం, ఆర్టిఫియల్ గుండెను తయారు చేయడం, క్లైమాక్స్ లో చనిపోయిన సంపూ చితి నుంచి లేచి వచ్చే అంశాలు సరదాగా నవ్వుకోవడానికి పనికి వస్తాయి.  సినిమాలో ప్రతి సీన్ పిచ్చిగా అనిపించినా.. ఈ సినిమానే అతి అనే ప్రధానాంశంతో రూపొందింది కాబట్టి.. హిట్టా, ఫ్లాఫా అనే కేటగిరిలో చేరని ఓ ప్రత్యేకమైన చిత్రం 'హృదయ కాలేయం'. సినిమా కెళ్లిన ప్రేక్షకుల్లో కొందరు అసంతృప్తి కావడం ఎలానో.. చిత్రాన్ని ఆలరించే వారి సంఖ్య అదే మొత్తంలో ఉంటుంది. ఇదే ఈ చిత్రంలో పాజిటివ్ అంశం.  ఎలాంటి సినిమాను అందించాడు అనే విషయాని వదిలేస్తే..  చిత్ర దర్శకుడిగా స్టీవెన్ శంకర్ ను అభినందించాల్సిందే. 
 
సంపూ తెరపైకి వచ్చాడు.. కొద్దిరోజుల ఉంటాడు.. ఎన్ని రోజులని మాత్ర ఖచ్చితంగా చెప్పలేం. కాని సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు సృష్టించిన హల్ చల్ మాత్రం తెలుగు ప్రేక్షకుడ్ని వెంటాడం మాత్రం ఖాయం. 
 
ట్యాగ్: నచ్చని వారికి పిచ్చి సినిమా.. నచ్చిన వారికి నవ్వుకునే సినిమా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement