Steven Shankar
-
9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్
వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండచ్చు. ఒకప్పుడు పాత కాలంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలు సెకండ్ రిలీజ్ అయ్యేవి. అవికూడా మొదటిది విడుదలైన చాలా నెలల తర్వాత. కానీ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9వ తేదీన ఈ సినిమాను సెకండ్ రిలీజ్ చేస్తున్నట్లు సంపు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తన పుట్టినరోజు బహుమతిగా అందజేస్తున్నానన్నాడు. ''మే 9న మళ్లీ థియటర్స్లో మీ ముందుకు ఈ బర్నింగ్ స్టార్ రాబోతున్నాడు. మీరు కడుపుబ్బా నవ్వితే నాకదే పదివేలు. మా సినిమాని చూసినవాళ్లు, చూడనివాళ్లు ఈసారి తప్పక చూడండి. నా మీద ఫేస్బుక్లో నెగెటివ్ కామెంట్లు పెట్టేవాళ్లు, ఈ సినిమా చూసి ఆ తర్వాత మాట్లాడండి. మీరు పాయింటవుట్ చేస్తున్నా, ఇన్ని నెగెటివ్స్ ఉండి నేను ఒక హీరోగా సినిమా చేసి హిట్ కొట్టి మళ్లీ సెకండ్ రిలీజ్ కూడా చేస్తున్నా. అదికూడా ఇంత పోటీ ఉన్న మన టాలీవుడ్లో. ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించకుండా నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ల దిమాగ్కి, ధైర్యానికి ఛాలెంజ్. చూసి మాట్లాడండి. మా ప్రయత్నం తప్పక నచ్చుతుంది. మీలో మార్పు వస్తుంది'' అని తన ఫేస్బుక్ పేజీలో సంపు రాశాడు. ఇంతకుముందు బాలకృష్ణ లెజెండ్ విడుదలైన సమయంలోనే తన సినిమాను విడుదల చేసి, మంచి కలెక్షన్లు కూడా సాధించిన సంపు, ఇప్పుడు రజనీకాంత్ సంచలనాత్మక సినిమా 'విక్రమసింహ'తో పోటీపడుతూ తన సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇంతకుముందు తన సినిమా వచ్చినప్పుడు యువత అంతా పరీక్షలు, ఎన్నికలతో బిజీగా ఉన్నారని, అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత తన సినిమా విడుదల చేస్తున్నానని చెప్పాడు. -
సినిమా వాళ్ల మీదకొస్తే చూస్తూ ఊరుకోం..!
‘తెలంగాణలో కోటిన్నరమంది. సెటిలర్స్ ఉన్నారు. వాళ్లకు గనుక కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలంగాణ వాదులు అక్కడి దాకా తెచ్చుకోవద్దు’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హెచ్చరించారు. ఇటీవలే విడుదలైన ‘హృదయ కాలేయం’ చిత్రం దర్శకుడు స్టీవెన్ శంకర్, హీరో సంపూర్ణేష్‌బాబులపై కొందరు తెలంగాణ వాదుల దాడిని ఖండిస్తూ ఆయన ఈ రకంగా స్పందించారు. ‘‘తెలంగాణ వ్యక్తిని హీరోగా పెట్టి వ్యంగ్యంతో కూడిన కామెడీ సినిమా తీస్తావా? అని స్టీవెన్ శంకర్‌ని కొట్టడం సబబైన పని కాదు. తెలంగాణ వాడైన సంపూర్ణేష్‌బాబుకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు దర్శకుడు స్టీవెన్‌శంకర్‌ని అభినందించాలి కానీ... కొట్టడం ఎంతవరకు సమంజసం. మరోసారి సినిమావాళ్ల మీదకొస్తే... చూస్తూ ఊరుకోం. అన్ని రాజకీయ పార్టీలూ ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది. సినిమాలకు ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాలూ సినిమాకు సమానమే. తెలుగువారందరూ అన్నదమ్ముల్లా సామరస్యంగా ఉండాలనేది మా అభిమతం’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. -
హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు
కేవలం సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని వెండితెర మీదకు దూసుకొచ్చిన 'హృదయ కాలేయం' చిన్న సినిమాల్లో రికార్డు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కేవలం కోటిన్నర రూపాయల ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు తొలి వారాంతంలోనే దాదాపు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. స్వదేశంతో పాటు అమెరికా లాంటి విదేశాల్లో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి ఈ సినిమాకు రూ. 3.9 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టు త్రినాథ్ చెప్పారు. సాధారణంగా అయితే స్పూఫ్‌లు చిత్రపరిశ్రమలో అంతగా వెళ్తాయో లేదో చెప్పలేం గానీ, ఈ సినిమా మాత్రం బాగానే నడిచిందని, మంచి వసూళ్లు సాధిస్తోందని ఆయన అన్నారు. థియేటర్లకు జనం బాగా వస్తుండటంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే ఉన్నా కూడా ఇంత మంచి విజయం సాధించడం పట్ల త్రినాథ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు ఓ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
హృదయ కాలేయం దర్శకుడిపై దాడి
-
హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి
హృదయ కాలేయం హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి జరిగింది. ఈ దాడిలో సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం చిత్రం గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ లు కూకట్ పల్లి లోని ఓ థియేటర్ లో సినిమా చూసి ఓ హోటల్ కెళ్లినట్టు తెలిసింది. ఆ హోటల్ లో ఓ గ్రూప్ కు దర్శకుడికి వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఆ గొడవలో దర్శకుడు స్టివెన్ శంకర్ పై మనోజ్ అనే వ్యక్తితోపాటు ఇతర వ్యక్తులు కూడా దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో స్టీవెన్ శంకర్ కు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. తమపై దాడిపై చిత్ర యూనిట్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు మనోజ్ ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. -
సినిమా రివ్యూ: హృదయ కాలేయం
బ్యానర్: అమృత క్రియేషన్స్ నటీనటులు: సంపూర్ణేష్ బాబు కావ్య కుమార్, ఇషికాసింగ్, కత్తి మహేష్ తదితరులు సంగీతం: కెకే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్టీవెన్ శంకర్ నిర్మాత: సాయి రాజేష్ విడుదల తేదీ: 04, ఏప్రియల్ 2014 ప్లస్ పాయింట్స్: చెప్పడం చాలా కష్హమైన పనే మైనస్ పాయింట్స్: లెక్కలేనన్ని 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం కావడానికి ముందే సోషల్ మీడియా సృష్టించిన ఓ హీరో సంపూ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు. టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సంపూ మీడియాలో సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు. విడుదలకు ముందే 'హృదయ కాలేయం' సినిమాపై కంటే సంపూ మీదే తెలుగు ప్రేక్షకులు దృష్టి కేంద్రికృతమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4 తేది శుక్రవారం విడుదలైన సంపూ చిత్రం 'హృదయ కాలేయం' ప్రేక్షకుల అంచనాలు చేరుకుందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. 'సంపూ' ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి వస్తుంది. దొంగతనాలతో పోలీసులకు సంపూ సవాల్ గా నిలిస్తాడు. అన్ని రకాల చెమటోడ్చిన పోలీసులు చివరికి సంపూని పట్టుకుంటారు. సంపూని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగగా మారడమేమిటని ఆశ్చర్యపోతాడు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన సంపూ ఎందుకు దొంగగా మారాడు. సమస్యలో కూరుకుపోయిన నీలూని సంపూ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో సంపూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? సంపూ ప్రేమ కథకు 'హృదయ కాలేయం' టైటిల్ సంబంధమేమిటనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. సంపూ పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు ఓ నటుడా, స్టారా, ఎలా నటించాడు అనే ప్రశ్నను కాస్త పక్కన పెడుదాం. సంపూ పాత్రను పోషించిన సంపూర్ణేష్ బాబు సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. తనకున్నస్థాయితో పోల్చుకుంటే సంపూర్ణేష్ బాబు తొలి సినిమా పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. రెండున్నర గంటల సినిమా ప్రేక్షకుడిని చూసేలా మాత్రం ఓ ఆసక్తిని రేకెత్తించాడని మాత్రం చెప్పవచ్చు. హృదయ కాలేయం సినిమాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సంపూదే వన్ మ్యాన్ షో. మిగితా పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే కమిషనర్ పాత్రను పోషించిన కత్తి మహేశ్ కుమారే కాకుండా అన్ని పాత్రలు అతిగానే స్పందించాయి. టెక్నికల్ అంశాలు: ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. తన కెమెరా పనితీరుతో సంపూని తెరపై భరించే స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి కేకే అందించిన రీరికార్డింగ్ అదనపు ఆకర్షణ. సంపూ టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుండటంతో సీన్లు చకచకా పరిగెత్తాయి. తెలుగు సినిమాపై సెటైర్ తో సంధించిన అస్త్రమే హృదయకాలేయం. ప్రతి సీన్ అతిగానే ఉంటుంది. తెలుగు సినిమాలో ఉండే లోటుపాట్లను ప్రధాన అంశంగా చేసుకుని దర్శకుడు స్టివెన్ శంకర్ 'హృదయ కాలేయం' చిత్రాన్ని రూపొందించారు. అంతా అతి కాబట్టి.. ఆ స్థాయికి తగ్గ, ఖచ్చితంగా సరిపోయే హీరో 'సంపూ'తో ప్రయోగం చేయడమే ఓ సాహసం. ఓ సాహసోపేతమైన ప్రయత్నంతో విడుదలకు ముందే డైలాగ్స్ తో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, ప్రేక్షకుల దృష్టిని మర్చేలా చేశారు. అంతేకాకుండా ఓ పెద్ద హీరోకు రాని పాపులారిటీని టీజర్, పోస్టర్స్ తో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. చెట్టు పసర్లతో కంప్యూటర్ చేయడం, ఆర్టిఫియల్ గుండెను తయారు చేయడం, క్లైమాక్స్ లో చనిపోయిన సంపూ చితి నుంచి లేచి వచ్చే అంశాలు సరదాగా నవ్వుకోవడానికి పనికి వస్తాయి. సినిమాలో ప్రతి సీన్ పిచ్చిగా అనిపించినా.. ఈ సినిమానే అతి అనే ప్రధానాంశంతో రూపొందింది కాబట్టి.. హిట్టా, ఫ్లాఫా అనే కేటగిరిలో చేరని ఓ ప్రత్యేకమైన చిత్రం 'హృదయ కాలేయం'. సినిమా కెళ్లిన ప్రేక్షకుల్లో కొందరు అసంతృప్తి కావడం ఎలానో.. చిత్రాన్ని ఆలరించే వారి సంఖ్య అదే మొత్తంలో ఉంటుంది. ఇదే ఈ చిత్రంలో పాజిటివ్ అంశం. ఎలాంటి సినిమాను అందించాడు అనే విషయాని వదిలేస్తే.. చిత్ర దర్శకుడిగా స్టీవెన్ శంకర్ ను అభినందించాల్సిందే. సంపూ తెరపైకి వచ్చాడు.. కొద్దిరోజుల ఉంటాడు.. ఎన్ని రోజులని మాత్ర ఖచ్చితంగా చెప్పలేం. కాని సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు సృష్టించిన హల్ చల్ మాత్రం తెలుగు ప్రేక్షకుడ్ని వెంటాడం మాత్రం ఖాయం. ట్యాగ్: నచ్చని వారికి పిచ్చి సినిమా.. నచ్చిన వారికి నవ్వుకునే సినిమా -
'హృదయ కాలేయం' మూవీ స్టిల్స్