‘దిల్’ రాజు, వేణుగోపాల్, శ్రీహర్ష
‘‘హుషారు’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగుందని, ఆడుతుందని చెప్పాను. నిజంగానే ప్రేక్షకులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ‘హుషారు’ యూనిట్‌కు అభినందనలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 14న విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిపిన 50 రోజుల వేడుకలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ‘హుషారు’ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. కష్టానికి మంచి ఫలితం వస్తుందనడానికి మా సినిమానే ఓ ఉదాహరణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతిరోజూ నా లైఫ్‌లో ఓ తీపి గుర్తు. ప్రేక్షకులు సినిమాను మళ్లీ మళ్లీ చూసి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు’’ అని శ్రీహర్ష కొనుగంటి అన్నారు. తేజ్ కొర్రపాటి, దినేష్, తేజస్ కంచెర్ల, ప్రియా వడ్లమాని, దక్షా నగార్కర్ ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment