బెక్కెం వేణుగోపాల్, ‘దిల్’ రాజు, తేజస్
‘‘బెక్కెం వేణుగోపాల్ నా వద్దకు వచ్చి సినిమా తీస్తున్నానని చెప్పగానే నవ్వాను. ఏదో విషయం ఉంటే తప్ప సినిమాలు ఆడటం లేదని చెప్పాను. ఎకానమీ బడ్జెట్‌లో తీస్తున్నానని చెప్పడంతో సరే అని చెప్పా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని ముఖ్య తారలుగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’.
లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రంలో భాస్కరభట్ల రాసిన ‘నానానా’ అనే పాటను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, వీళ్లేమో నన్ను పిలిచి పాటను విడుదల చేయమన్నారు. భవిష్యత్తులో వీళ్ల దారికే నేను రావాల్సి ఉంటుందేమో. ప్రేక్షకులిప్పుుడు మంచీ, చెడు ఆలోచించడం లేదు. ఎంటర్‌టైన్ అయ్యామా? లేదా? అని చూస్తున్నారు. అంతేగానీ లిప్‌లాక్‌లున్నాయా, ఇంకోటున్నాయా? అనే పట్టింపులు లేవు’’ అన్నారు.
‘‘శ్రీహర్ష చెప్పిన ‘హుషారు’ కథ నచ్చడంతో సినిమా మొదలుపెట్టి, పూర్తి చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత రథన్ సంగీతం అందించిన సినిమా ఇది. తేజస్ మినహా అందరూ కొత్తవారే అయినా బాగా చేశారు’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ‘‘ఈ రోజుల్లో లైఫ్‌కి గ్యారంటీ లేదు. ప్రతి సెకనూ హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారనే కథతో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు శ్రీహర్ష. అసోసియేట్ నిర్మాతలు లింగా శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు రథన్, భాస్కరభట్ల, తేజస్, అభినవ్, ప్రియా వడ్లమాని, తేజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment