పవన్ కల్యాణ్‌ని చూసి ఆశ్చర్యపోయాను!
తెలుగు తెరపైకి రానున్న మరో ఉత్తరాది భామ ‘సయామీ ఖేర్’. ఈ బ్యూటీది సాదాసీదా నేపథ్యం కాదు. ప్రసిద్ధ హిందీ నటి షబానా ఆజ్మీకి స్వయానా మేనకోడలు. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రేయ్’ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్న సయామీ చెప్పిన కబుర్లు...
నేను పుట్టి, పెరిగింది ముంబయ్‌లోనే. మా నానమ్మ ఉషా ఖేర్ హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 50 చిత్రాల్లో నటించారు. మా అమ్మా, నాన్నలకు కూడా గ్లామర్ ప్రపంచంతో అనుబంధం ఉంది. మా అత్తయ్య షబానా ఆజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నా బ్లడ్‌లోనే నటన ఉందనుకుంటున్నా. ముందు మోడల్‌గా పలు ఉత్పత్తులకు చేశాను. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ చూసి, వైవీయస్ చౌదరిగారు ‘రేయ్’ కోసం అడిగారు. అప్పుడు మా అత్తయ్య నాతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘ఒకవేళ నువ్వు కథానాయికగా చేయాలనుకుంటే ముందు దక్షిణాది చిత్రాలతో మొదలుపెట్టు’ అని. అందుకే చౌదరిగారికి వెంటనే ఓకే చెప్పేశా.
‘రేయ్’ అంటే అర్థం తెలుసు. కోపంగానూ ఆ మాట అనొచ్చు.. ఆత్మీయంగానూ అనొచ్చు. కానీ, నా మటుకు నాకు ఈ పదంలో ఏదో ఆత్మీయత ఉందనిపిస్తుంది. ‘షౌట్ ఫర్ సక్సెస్’ అని ఉపశీర్షిక పెట్టారు. మేం కచ్చితంగా సక్సెస్ కొడతాం. అందులో డౌటే లేదు. ఈ చిత్రంలో నాది పది నిమిషాలు అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే పాత్ర కాదు. చాలా శక్తిమంతమైన పాత్ర. ఈ చిత్రాన్ని చౌదరిగారు తెరకెక్కించిన విధానం సూపర్బ్. పాటలైతే ఎంత బాగా తీశారంటే.. కదలకుండా చూసేస్తారు.
నేనీ సినిమా ఒప్పుకున్నప్పుడు సాయిధరమ్ తేజ్ ఎవరో తెలియదు. ఆ తర్వాత చిరంజీవిగారి మేనల్లుడని తెలిసి, భయపడ్డాను. పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు.. ఎలా ఉంటాడో అనుకున్నాను. కానీ, తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఆ మాటకొస్తే, సాయిధరమ్ ఇంకో బాబాయ్ (పవన్ కల్యాణ్)ని చూసి ఆశ్చర్యపోయాను. అంత పెద్ద స్టార్ అయ్యుండి ఎంతో డౌన్ టు ఎర్త్‌లా ఉంటారు. రామ్‌చరణ్, బన్నీ (అల్లు అర్జున్) అందరూ కూడా అంతే. తన మేనమామల్లానే సాయి కూడా ఉంటాడు.
అందర్నీ ఒకచోట చూసినప్పుడు వాళ్ల హావభావాలు దాదాపు ఒకే విధంగా ఉండటం చూసి, భలే అనిపించింది. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, బన్నీ నటించిన చిత్రాలు చూశాను. నాకైతే తెలుగు హీరోలందరితో నటించాలని ఉంది. గ్లామర్, డీ-గ్లామర్ రెండు రకాల పాత్రలూ చేయాలనుకుంటున్నా. కథానుగుణంగా పెదవి ముద్దు సన్నివేశాలు చేయడానికి వెనకాడను. ప్రస్తుతం హిందీలో రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ‘మీర్జా సాహిబా’ అనే చిత్రంలో నటిస్తున్నా.