గెలుపు కోసం పిలుపు
గెలుపు కోసం పిలుపు
Published Sun, Dec 1 2013 12:05 AM | Last Updated on Mon, May 28 2018 2:13 PM
‘రేయ్..’ ఇలా అమ్మాయి పిలిచిందనుకోండీ.. రొమాంటిగ్గా ఉంటుంది. ఫ్రెండ్ పిలిస్తే.. జోష్‌గా ఉంటుంది. అదే... సినిమాల్లో విలన్‌ని హీరో పిలిస్తే.. ఇక థియేటర్‌లో ఈలలు, గోలలే. ఒక్క పిలుపులో ఎన్ని డెమైన్షన్సో కదా. అందుకే... తన సినిమాకు వైవీఎస్ చౌదరి ‘రేయ్’ అని నామకరణం చేసి ఉంటారు. ఉపశీర్షిక ‘షాట్ ఫర్ సక్సెస్’ అని పెట్టారు. కొత్తవాళ్లను వైవీఎస్ చౌదరి పరిచయం చేస్తే... ఆ సినిమా హిట్టే. ‘సీతారాములకల్యాణం చూతము రారండి’ నుంచి ఒక్కసారి ఆయన కెరీర్‌ని పరిశీలిస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు.
ఆ రకంగా ఆలోచిస్తే ‘రేయ్’ విజయం తథ్యం అనిపిస్తోంది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మెగా అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని సాయిధరమ్‌తేజ్ పాత్రను అత్యంత శక్తిమంతంగా వైవీఎస్ తీర్చిదిద్దారని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి తెలిపారు. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలైలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చాం.
రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ ఈ నెలలో విడుదల అనగానే... ‘రేయ్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. అయితే... ‘ఎవడు’ అనుకోకుండా సంక్రాంతికి వాయిదా వేశారు. దాంతో ‘రేయ్’ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి ఫైనల్‌గా నిర్ణయించుకున్నాం. ఈ సినిమా ప్రారంభించినప్పట్నుంచీ ఎన్నో అవాంతరాలు. వాటన్నింటినీ అధిగమించి చిత్రాన్ని పూర్తి చేశాం’’అని వైవీఎస్ చెప్పారు. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ ఈ చిత్ర నాయికలు.
Advertisement
Advertisement