'తను తప్పు చేసిందని అనుకోవడం లేదు'
ముంబయి: ప్రముఖ నటి సోహా అలీ ఖాన్‌కు మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ అండగా నిలిచారు. ఆమె చీరకట్టుకోవడంలో తప్పేముందని అన్నారు. సోహా ఏ తప్పు చేసినట్లు తనకు అనిపించడం లేదని దన్నుగా నిలిచారు. బాలీవుడ్ నటి అయిన సోహా అలీఖాన్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతి అయిన ఆమెకు ఇంట్లో సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోహా అలీఖాన్ ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇళ్లంతా అలకరించిన బెలూన్‌ల నడుమ.. గులాబీ రంగు చీర కట్టుకొని, భర్త , ఆమె భర్త కునాల్ ఖేముతో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. అయితే, ఆమెచీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నందుకు విమర్శలు చేశారు. ముస్లిం మతంలో నుంచి హిందువుగా మారిపోయావా అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన టైగర్ ష్రాఫ్..
'ప్రతి ఒక్కరికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. తమకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో దాని ప్రకారం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సోహా అందరూ గర్వించదగిన నటి, పౌరురాలు. ఆమెకు నచ్చినది ఏదో ధరించినంతమాత్రానా ఆమె తప్పు చేసిందని నేను అనుకోవడం లేదు.. కానీ, ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది' అని అన్నారు. అదే సమయంలో తాను నటిస్తున్న మున్నా మైఖెల్ చిత్రం గురించి స్పందిస్తూ 'నేను చాలా అసంతృప్తితో ఉన్నాను. నా మూడో చిత్రం ద్వారానైనా నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను' అని చెప్పారు.