మా అబ్బాయికి...దానవీరశూరకర్ణ చూపించా! | I have shown dana veera sura karna movie to my son says Kalyan Ram | Sakshi
Sakshi News home page

మా అబ్బాయికి...దానవీరశూరకర్ణ చూపించా!

Published Tue, Feb 3 2015 10:19 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

మా అబ్బాయికి...దానవీరశూరకర్ణ చూపించా! - Sakshi

మా అబ్బాయికి...దానవీరశూరకర్ణ చూపించా!

‘నిన్ను నువ్వు నమ్ముకొంటే, ఆలస్యమైనా సరే విజయం అనివార్య’మనే పాఠానికి తాజా ఉదాహరణ - నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. సినిమాల్లోనూ, వ్యక్తిగతంగానూ అనేక ఎదురుదెబ్బలు తగిలినా, ఆయన ఎట్టకేలకు ఇప్పుడు ‘పటాస్’ చిత్రంతో మంచి వాణిజ్య విజయం సాధించారు. వివాద రహితుడూ, మంచి మనిషి అయిన కళ్యాణ్ రామ్కు సక్సెస్ రావాలని పరిశ్రమలో అందరూ కోరుకున్నారంటే, ఆయన సంపాదించుకున్నది కోట్లకు మించిన సంపద అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పదేళ్ళ కష్టానికీ, నిరీక్షణకూ దక్కిన ఫలితం ఎంత తీయగా ఉంటుందో స్వయంగా చవిచూసిన ఈ యువ హీరో ‘పటాస్’ విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు. తప్పొప్పుల్ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటూనే, బాబాయ్‌తో 100వ సినిమా మొదలు కుటుంబ విలువల దాకా అనేక అంశాలపై ఆయన మనసు విప్పి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
  ‘పటాస్’ బాగా పేలినట్లుంది... చాలాకాలం తరువాత అందరి నుంచి ఏకగ్రీవంగా విజయానికి అభినందనలందుకోవడం ఎలా ఉంది?
 (నవ్వుతూ...) బాగుంది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సక్సెస్ అనే మాట వినడం ఎనర్జీనిస్తుంది. మన ప్రయత్నాన్ని ఎవరైనా మెచ్చుకోవడాన్ని మించి ఆనందం ఇంకేముంటుంది! ‘అతనొక్కడే’ (2005) తరువాత ‘హరేరామ్’ వాణిజ్యపరంగా విజయవంతమైనా, జనం నుంచి ఇంత స్పందన రాలేదు. ‘పటాస్’ను అందరూ మెచ్చుకొన్నారు.
 
  ఇన్నేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురుచూడడం, నిరాశ పడకుండా శ్రమించడం అంత సులభం కాదేమో!
 పదేళ్ళుగా ఒంటరి పోరాటం చేస్తున్నా. నిరాశపడ్డ సందర్భాలున్నాయి. అయితే, నన్ను నేను నమ్మాను. ‘మన ప్రయత్నం మనం కష్టపడి చేద్దాం... ఫలితం ప్రేక్షకులకు వదిలేద్దాం’ అని నిశ్చయించుకున్నా. సినిమా ఫెయిలైతే, లోతుగా విశ్లేషించుకుంటా. ఎందుకంటే, మా కుటుంబమంతా సినిమా మీదే బతుకుతోంది.
 
  మరి, మీరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసిన గత చిత్రం ‘ఓం-3డి’ ఫెయిల్యూర్‌పైనా విశ్లేషించుకున్నారా?
 కచ్చితంగా! నా వ్యక్తిగత విశ్లేషణ ఏమిటంటే, సినిమాను కొత్తగా చెప్పాలనీ, చాలా మలుపులు ఉండాలనీ నేను ప్రయత్నిస్తుంటా. అయితే, ఇవాళ జనం బయట సవాలక్ష పనులు, సమస్యల నుంచి విరామం కోసం హాలుకు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నదే అందుకోసం కాబట్టి, రెండున్నర గంటల పాటు వాళ్ళు తమ జీవితంలోని కష్టాలను మర్చిపోయేలా వినోదింపజేయాలి. ఇక్కడ వినోదమంటే కేవలం నవ్వించడమనే కాదు... ఫీల్‌గుడ్ సినిమా, ప్రేమ కథ, యాక్షన్ - ఇలా ఏదైనా కావచ్చు. వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకూడదు. కానీ, ‘ఓం - 3డి’లో ట్విస్టులు, లింకులతో ప్రేక్షకులపై భారం మోపాం. అదే ఇబ్బంది అయింది. ఏదైనా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పాలని అర్థమైంది.‘ఓం-3డి’తో పోలిస్తే, ‘పటాస్’ ఎంటర్‌టైనింగ్ సినిమా కాబట్టి, ప్రతిరోజూ ఒక పండగలాగా సాగిపోయింది. ఇందులోని స్ట్రెయిట్ నేరేషన్, సినిమాలో ఉన్న ‘పార్థాయ...’ లాంటి రకరకాల ప్రత్యేక అంశాలు, దర్శకుడి ప్రతిభ సక్సెస్‌కు తోడ్పడ్డాయి. ముఖ్యంగా, తల్లులే పిల్లలకు బుద్ధి చెప్పడమనే ఘట్టం చాలా మందికి నచ్చింది. నూటికి నూరుపాళ్ళు జనం వినోదించారు.
 
  చాలాకాలం సక్సెస్‌కు దూరంగా ఉండి, కోట్ల కొద్దీ డబ్బు నష్టపోయినప్పుడు మీకు అండగా నిలిచిందెవరు
 ఇంకెవరు! నా కుటుంబమే! మా అమ్మా నాన్న, నా భార్య, నా బావమరిది, ఆప్తమిత్రులు కొందరు - వీళ్ళే నాకెప్పుడూ కొండంత అండ. వాళ్ళెవరూ నన్ను నిరుత్సాహపరచలేదు. పెపైచ్చు, విజయం సాధించగలవంటూ నన్ను ముందుకు నెట్టారు, ప్రోత్సహించారు. మీడియా దగ్గర నుంచి నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సారి నాకు విజయం రావాలని మనసారా కోరుకున్నారు. వాళ్ళందరి ఆశీస్సులూ ఫలించాయి.
 
  ఇంతకీ, ‘పటాస్’ చూసి, మీ నాన్న గారు, బాబాయ్ బాలకృష్ణ వాళ్ళు ఏమన్నారు?
 (మెరిసే కళ్ళతో...) చాలా కాలంగా నా విజయం కోసం ఎదురుచూస్తున్న నాన్న గారు చాలా హ్యాపీ. నా సినిమా సక్సెసైతే గుడికి వెళతానని మొక్కుకున్నట్లున్నారు. రిలీజ్ రోజున నేను ఫోన్ చేసి, ‘సినిమా బాగుందట’ అనే లోపుగానే, తనకు విషయం తెలిసిందంటూ, మేమెక్కడికో రమ్మన్నా రాకుండా, వెంటనే గుడికి వెళ్ళారు. బాలకృష్ణ బాబాయ్ కూడా సినిమా చూసి, సంతోషించారు. తమ్ముడు తారక్ (చిన్న ఎన్టీయార్) ‘అన్నా! నీ కెరీర్‌లో అత్యుత్తమ అభినయం!’ అంటూ మెచ్చుకున్నాడు. మా కుటుంబం కళ్ళల్లో ఆనందబాష్పాలు చూశాను.
 
  మీ పిల్లలిద్దరికీ సినిమా నచ్చిందా? వాళ్ళ ముత్తాత పెద్ద ఎన్టీఆర్ గురించి చెబుతుంటారా?
 మేము బతుకుతున్నదే మా తాత ఎన్టీఆర్ గారి పేరు మీద! ఆయన నుంచి మా నాన్న గారు... మా నాన్న గారి నుంచి మేము నేర్చుకున్న కుటుంబ విలువలు, అనుబంధాలు మా పిల్లలకు కూడా అలవడేలా చూస్తుంటా. మా అమ్మాయి తారక అద్వితకు నాలుగేళ్ళు. చిన్నపిల్ల. అబ్బాయి శౌర్యరామ్‌కు ఆరున్నరేళ్ళు. వాడు ఇప్పటికే రెండుసార్లు ‘పటాస్’ చూశాడు. వాడికి సినిమా బాగా నచ్చేసింది. నా చదువు, తదితర కారణాల వల్ల నేను ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడుతుంటా. కానీ, పిల్లలకు తెలుగు బాగా రావడం కోసం చిన్నప్పటి నుంచి శ్రద్ధ చూపిస్తున్నా. మా వాడు చూసిన మొదటి సినిమా - వాళ్ళ ముత్తాత గారి ‘దానవీరశూర కర్ణ’. అలాగే, పెద్దాయన ‘ఆలీబాబా 40 దొంగలు’, బాబాయ్ ‘భైరవద్వీపం’ అంటే వాడికి చాలా ఇష్టం.
 
  కొత్త దర్శకులతో, అదీ సొంత సినిమాలే తప్ప బయటవాళ్ళకు సినిమాలు చేయరేం?
 అదేమీ లేదు. నాకు వేరే వ్యాపారాలు తెలియవు. ఆలోచనలు లేవు. మా తాత గారి పేరు మీద ఈ ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ సంస్థ పెట్టాను. నా దగ్గరకు కొత్త దర్శక, రచయితలు వస్తారు. వాళ్ళు చెప్పిన కథ నచ్చితే, మరోమాట లేకుండా చేసేస్తుంటా. మా సంస్థను విస్తరించాలనే ఉద్దేశంతో సురేంద్రరెడ్డి-రవితేజలతో ‘కిక్2’ నిర్మిస్తున్నా. సెట్స్ మీద ఉన్న నా ‘షేర్’ బయటి నిర్మాతలదే. అలాగే, నా తదుపరి చిత్రం కూడా బయటవాళ్ళదే.
 
  తారక్, నాగ చైతన్య, నాగ్‌లతో  సినిమాలు చేయాలని యత్నిస్తున్నట్లున్నారు!
 అవును. చైతన్యకు గతంలో స్క్రిప్ట్ చెప్పాను. ఆ ప్రాజెక్ట్‌ను పట్టాల మీదకు ఎక్కించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘బాలగోపాలుడు’లో నన్ను బాలనటుడిగా పరిచయం చేసి, నటనలో ఓనమాలు దిద్దించిన బాబాయ్ బాలకృష్ణ 100వ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నా.
 
  మీ తమ్ముడు తారక్‌తో మునుపటి కన్నా అనుబంధాలు బాగా పెరిగినట్లున్నాయి..!
 మేమంతా ఒకే కుటుంబం కదండీ! గతాన్ని తవ్వుకోదలుచుకోలేదు. మునుపటితప్పులు మళ్ళీ జరగకూడదని జాగ్రత్త పడుతుంటా. 1983 వరకు మా తాత గారి దగ్గర ఉమ్మడి కుటుంబంలో పెరిగినవాణ్ణి. కుటుంబ బంధాలు, విలువలు తెలుసు. ఎప్పుడూ వాటికి విలువనిస్తా.
 
  ఇన్నాళ్ళుగా ఉన్నా పార్టీలు, ఫంక్షన్లలో మీరు కనిపించరు! వివాదాలు, ఆర్భాటాలకూ దూరమే!
 వాటన్నిటికీ నేను దూరం. ‘ఇష్టం లేకపోతే మాట్లాడకు. అంతే తప్ప మాట తూలితే వెనక్కి తీసుకోలేం నాన్నా! జాగ్రత్త’ అని తాత గారు, నాన్న గార్ల నుంచి నేర్చుకున్నదే పాటిస్తుంటాను. వివాదాల జోలికి పోను. నేను ఎవరి గురించి, దేని గురించీ మాట్లాడను. ‘నీ సినిమా బాగుండాలని కోరుకో! అంతేకానీ, పక్కవాడిది పోవాలనుకోకు’ అని నా సిద్ధాంతం. ఇల్లు, ఆఫీసు, షూటింగ్ తప్ప నాకు వేరే తెలియదు.
 
  అయితే, ఇంటికి చాలా ప్రాముఖ్యమిస్తారన్న మాట!
 పెళ్ళయినవాణ్ణి కాబట్టి ఇంటికే ప్రాధాన్యమిస్తా. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతా. ఖాళీ సమయం దొరికితే, మూడ్‌ను బట్టి రకరకాల టీవీ చానల్స్ చూస్తుంటా. అలాగే, ఇంట్లో ఉంటే కుటుంబమంతా కలిసే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తాం. అందరం కలసి తినాలనే ఆ పద్ధతినీ, కుటుంబ విలువలనూ తప్పనిసరిగా పాటిస్తుంటా. అలాగే, చిర్రుబుర్రులాడుతూ ఉండేవాళ్ళ కన్నా, చిరునవ్వుతో ఉండేవాళ్ళంటే నాకిష్టం. లొకేషన్‌లోనూ సీరియస్‌గా ఉండేవాళ్ళకు నేను దూరం.
 
  రాజకీయాల పట్ల మీరు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించరేం?
 (గంభీరంగా...) ఏ పని చేస్తుంటే, దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలనేది నా తత్త్వం. రాజకీయం పెద్ద వ్యవస్థ. అవగాహన లేని దానిలో వేలు పెట్టను.
 
  మీ అన్నయ్య జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం...
 (చెమర్చిన కళ్ళతో...) అది మా కుటుంబమంతటికీ తీరని బాధ. మా నాన్న గారెప్పుడూ తాత గారి పనుల వ్యవహారాల్లో ఉండేవారు కాబట్టి, చిన్నప్పటి నుంచి మా విషయాలన్నీ అన్నయ్యే చూసుకొనేవాడు. వాడు మాకు నాన్న తరువాత నాన్న లాంటివాడు. మా అన్నయ్యకు సినిమాలంటే బాగా ఇష్టం. అయితే, పెద్దగా బయటకు వచ్చేవాడు కాదు. ఏదైనా మంచి సినిమా, పాట, రీరికార్డింగ్ చూస్తే, ఆ రిఫరెన్స్‌లు నాకు ఇస్తుండేవాడు. ‘పటాస్’ ఫస్ట్‌లుక్ రిలీజయ్యాక చూసి, ‘నీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ సినిమా హిట్టవుతుంది’ అని చెప్పాడు. అలాంటివాడు కొన్ని వందల సార్లు తిరిగిన రోడ్డు మీదే ప్రమాదానికి గురై చనిపోవడం విధి విలాసం. అందుకే, ‘పటాస్’ మొదట్లో నేను, తారక్ అందరికీ మెసేజ్ ఇవ్వాలని ‘రోడ్డు ప్రమాదం జాగ్రత్తలు’ చెప్పాం.
 
  మీ నాన్న గారికీ ఎప్పుడైనా సలహాలిస్తుంటారా? బాబాయ్‌తో...
 (మధ్యలోనే అందుకుంటూ...) వాళ్ళ మార్గదర్శకత్వంలో పెరిగినవాళ్ళం. వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వగలిగినంత వాళ్ళం కాదు. మాదంతా ఒక కుటుంబం. అన్ని కుటుంబాలలో లాగానే మాకూ చిన్న చిన్న అలకలు, కోపతాపాలు ఉంటాయి. అయితే, అవేవీ శాశ్వతం కాదు. అన్నీ వచ్చిపోతుంటాయి. మేమంతా ఎప్పుడూ ఒక్కటే! ఎప్పటికైనా ‘మనం’ లాగా మా కుటుంబంలో మా నాన్న, బాబాయ్, నేను, తమ్ముడు తారక్ - ఇలా మూడు తరాల వాళ్ళం కలసి సినిమా చేయాలని నా కోరిక. అలాంటి అవకాశం, అదృష్టం మన తెలుగు పరిశ్రమకే ఉండడం విశేషం.
 
 మీ అమ్మాయి పేరును ‘ఓం’ చిత్రం నిర్మాణ బాధ్యతల్లో వేశారు. ఇక మీ అబ్బాయిని నటుణ్ణి చేస్తారా?
 (నవ్వేస్తూ...) చిన్నపిల్లలు... వాళ్ళకు కావాల్సినట్లుగా వాళ్ళను ఉండనివ్వండి. పెద్దయ్యాక వాళ్ళకు ఏది చేయాలనిపిస్తే, అది చేస్తా. అంతేతప్ప, సినిమాల్లోకే రమ్మని బలవంతపెట్టను. మా అబ్బాయికి సినిమాలంటే ఇష్టం. వాళ్ళ అమ్మను తోడు తీసుకొని, ప్రతివారం సినిమాలకు వెళతాడు. నేను ఎంత ఒత్తిడిలో ఉన్నా దాని నుంచి బయటపడడానికి పిల్లలే నాకు పెద్ద రిలీఫ్. ఆ సంగతి చెబితే అర్థం కాదు... పిల్లలున్నవాళ్ళకు ఎవరికి వారికి అనుభవంలోకి వస్తుంది.
 
 - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement