Dana Veera Sura Karna
-
దాన వీర శూర కర్ణ
మా ఊరోళ్లకు వేడివేడిగా ఆరోజే విడుదలైన సినిమాలు బోర్ కొట్టేశాయి. విడుదల కాకముందే లీకైన సినిమాలు సెల్ఫోన్లో చూసీచూసీ బొర్ కొట్టేశాయి. పనీపాటలేని అప్లోడింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ట్రెండింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ఇలాంటి మహాబోర్ సమయంలో...‘‘మన గ్రామ సర్పంచి పుట్టిన రోజు సందర్భంగా రేపు రాత్రి మన ఊళ్లో దానవీరశూరకర్ణ నాటకం ఉంటుందహో’’ అనే చాటింపు విని ఊళ్లో ఆబాలగోపాలం ఆనందించారు.‘నాటకం చూడక ఎన్నాళ్లయిందో...ఆరోజులే వేరు’ అనే నాస్టాల్జియాతో వయసు మళ్లిన వాళ్లు...‘నాటకమటా...ఎలా ఉంటుందో చూద్దాం’ అని సోషల్ మీడియా జమానాలో పుట్టిన లేలేత కుర్రోళ్లు...చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆరోజు సర్పంచి పుట్టిన రోజు. ఆయన ఇంటెనకాల పెద్ద గ్రౌండ్లో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరింటికే ప్రేక్షకదేవుళ్లతో నాటకప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకల తరువాత నాటకం మొదలైంది....నాటుసార సారయ్య శకుని వేషం కట్టాడు. బాగా కుదిరాడు.‘‘దుర్యోధన... నాకే ఓ కూతురు ఉండి ఉంటే....నీ తలపు, వలపు, నీ కులుకు వేరే వన్నెలాడివైపు పొనిచ్చేవాడినాఏంచేయనూ...మేనమామనై ఉండి కూడా మామను కాలేని దురదృష్టవంతుడిని’’ అని విషాదంగా డైలాగు కొట్టాడు ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఒక తాగబోతు గట్టిగా అరుస్తూ పైకి లేచాడు. ఇతడు సారయ్యకు స్వయానాబావమరిది. పేరు సారా సాంబయ్య.‘‘ఒరేయ్ సారిగా...నీకు కూతుళ్లు లేకపోవడం ఏందిరా! పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్నరు. ఒక్కరి పెళ్లి అయినా చేసినవా? పొద్దున లేసుడు....కల్లుతాగుడు....సాయంత్రం గుడంబ తాగుడు...నీ ముఖానికో నాటకం...’’సాంబయ్య తిట్లు విని ప్రేక్షకులు ఒకటే నవ్వడం! పాపం కళాకారుడు సారయ్య ముఖం మాడిపోయిన పెసరట్టయింది.‘‘ఒరేయ్ సాంబా కూకో....’’ అని సర్పంచి అరిచేసరికి సైలెంట్ అయిపోయాడు సాంబయ్య. ఆతరువాత భీష్మ పాత్రధారి కాషయ్య డైలాగు:‘‘నాయనా...వంశం కోసం బ్రతికున్నంత వరకు వయసంతా ధారబోసిన ఘోటక బ్రహ్మచారిని. నేను మాట ఇవ్వను. ఇచ్చాను అంటే దానికి చచ్చినా తిరుగుండదు. నేను ప్రతిజ్ఞ చేసినానుఅంటే, అంతే...తిరుగుండదు. అందుకే భీష్మప్రతిజ్ఞ అంటారు’’ఈలోపే ప్రేక్షకుల మధ్యలో నుంచి కాషయ్య క్లాస్మేట్ ఒకడు లేచి....‘‘ఒరే కాశీ....వంశం కోసం వయసంతా ధారపోసావా?! పదిహేడేళ్లకే మూడు కాపురాలు పెట్టావు....నువ్వు వయసు ధారపోయడం ఏమిట్రా బెవకూఫ్. పెళ్లి చేసుకుని వదిలేయడమేనా? వాళ్ల బాగోగుల గురించి పట్టించుకునేదిలేదా! మూడో భార్య ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పిల్లను సాకుతోంది. రెండో భార్య ఎండల్లో కూలీనాలికీ పోతూ కష్టపడుతోంది. మొదటి భార్యను పట్టించుకునే దిక్కేలేదు....భార్యలు కష్టపడుతుంటే నాటకాలంటూ తిరుగుతున్నవేందిరా మొద్దునాయాలా....గబ్బు నాయాలా...’’ అని నాన్‌స్టాప్‌గా తిట్లు మొదలు పెట్టాడు.ఈలోపు లచ్చయ్య అనే వార్డు మెంబరు లేచాడు... ‘‘ఆడిన మాటను తప్పను...అని ఎంత సిగ్గులేకుండా అంటున్నావురా కాశీగా! నన్ను ఉపసర్పంచి చేస్తానని మాటిచ్చావు. చేశావా? చేయకపోతే చెయ్యకపోతివి...నా దగ్గర తీసుకున్న డబ్బైనా ఇచ్చినవా? నీకేమాత్రం సిగ్గున్నా నా డబ్బు నాకు ఇచ్చేయాలి లేదా నన్ను ఉపసర్పంచి చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను’’ అని అవేశంగా అరిచాడు.ఉపసర్పంచి రాజయ్య ఆగ్రహంగా లేచి...‘‘దైవం మీద ఆన. నన్ను పదవీచ్యుతుడిని చేస్తే ఊరుకునేది లేదు. ఫస్ట్‌టైమ్ వార్డ్మెంబర్గా గెలిచాను. భగవంతుని దయతో ఫస్ట్‌టైమ్ ఉపసర్పంచి అయ్యాను. పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మీ కళ్లు మండిపోయాయి. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండాలా? ఇదేనా డెమోక్రసీ? అని ఈ సందర్భంగా అడుగుతూ, ఓటరు మహాశయులకు నమస్తేచెబుతూ...నా సీట్లో నేను కూసుంటున్నాను’’ అంటూ కూర్చున్నాడు.ఫ్రెండ్స్ మాటలతో భీష్మ పాత్రధారి కాశయ్య హర్ట్ అయ్యాడు....‘‘రేయ్ దొంగనాయల్లారా...టేజీ(స్టేజీ) మీదున్నంత వరకే నేను భీష్ముడిని. టేజీ దిగానా....మాస్....పక్కా మాస్. నా డైలాగులు అయిపోయేంతవరకు గమ్మునుండండి. ఆ తరువాత...మీరు మా ఇంటికొచ్చినా సరే. నన్ను మీ ఇంటికి రమ్మన్నా సరే...ఎక్కడైనాసరే...ఎప్పుడైనా సరే...మొకాలి చిప్పలు పగిలిపోవాలా....ఏం అనుకున్నారో ఏమో....’’ అన్నాడు ఆవేశంగా.సర్పంచి మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నాటకం వేస్తరా? నకరాలు చేస్తరా?’’చిన్నబ్రేక్ తరువాత నాటకం మళ్లీ మొదలైంది.దుర్యోధన సార్వభౌముడు రేకుల కైలాసం ఆవేశంగా తన డైలాగు స్టార్ట్ చేశాడు...‘‘ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి?ఎంత మాట ఎంత మాటా!మట్టికుండలో పుట్టిన నీదే కులం?(ఆ తరువాత డైలాగు మరిచిపోయాడు కైలాసం. ఈ మతిమరుపు వల్లే పదవతరగతి పరీక్ష మూడుసార్లు తప్పాడు. ఇంకా తప్పుతూనే ఉన్నాడు. ఏదో ఒక సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసై తనను తాను ప్రూవ్ చేసుకోవాలనేది కైలాసం ఆశయం. ఎంత పెద్ద మొనగాడైనా స్టేజీ మీద డైలాగులు మరిచిపోవడం కామన్ విషయమని, అలాంటప్పుడు ప్రేక్షకులకు అనుమానం రాకుండా ఫ్లోలో నోటికొచ్చింది దంచుకుంటూ పోవాలని సీనియర్ నటుడు, నటరత్న కల్లు నాగమల్లు చెప్పిన విషయం కైలాసానికి గుర్తుకు వచ్చింది. ఇక చూస్కోండి. ఇలా అందుకున్నాడు...)‘ఆచార్యదేవాఏమంటివి ఏమంటివి?ఇది క్షేత్రపరీక్ష కాని క్షత్రియపరీక్ష కాదు... టెన్త్‌క్లాస్ పరీక్ష కానేకాదు.ఆచార్యదేవా...ఏమంటివి?టెన్త్క్లాస్పరీక్ష పాసు కావడమంటే మామూలనుకుంటివా?పొద్దున లేచి పండ్లు తోముకున్నంత ఈజీ అనుకుంటివా?ఆచార్యాదేవా...క్షేత్రపరీక్ష, క్షత్రియపరీక్షైనా పాస్కావచ్చుగానీ... టెన్త్క్లాసుపరీక్ష పాస్ కావడం అల్లాటప్పా వ్యవహారం అనుకుంటివా...’ఇంకేముంది....ఒన్స్మోర్ అంటూ ఒకటే లీలలు! – యాకుబ్ పాషా -
ఫ్లయిట్లో డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య
హీరో బాలకృష్ణకు పౌరాణిక పాత్రలు అంటే చాలా మక్కువ. అందులోనూ తండ్రి ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలంటే బాలయ్యకు చాలా ఇష్టం. పలు సందర్భాల్లో బాలకృష్ణ ఆయా పౌరాణిక సినిమాల్లోని భారీ డైలాగ్స్ అవలీలగా చెప్పి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కూడా. తాజాగా విమాన ప్రయాణంలో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన ఎవర్ గ్రీన్ ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని ఓ ప్రయాణికుడు తన ట్యాబ్ లో వీక్షిస్తున్నాడు. కాగా అదే ఫ్లయిట్లో బాలయ్య కూడా ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆయన సీటు దగ్గరకు వెళ్లి...అందులోని డైలాగ్స్ కొన్ని చెప్పాలంటూ విజ్ఞప్తి చేశాడు. దాన్ని తాను రికార్డు చేసుకుంటానని రిక్వెస్ట్ చేయడంతో... ఇక బాలయ్య... డైలాగ్స్‌తో అదురగొట్టారు. దాంతో ఉబ్బితబ్బిబ్బు అయిన ఆ యువకుడు బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సన్నివేశం మొత్తాన్ని ఆ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూడండి మరి... -
నందమూరి నాలుగో తరం ఇది!
‘‘మా కుటుంబంలోని నాలుగో తరం వారు కూడా బాలనటులుగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అరుదైన అవకాశం అందించిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు’’ అని ఎన్టీఆర్ అన్నారు. నందమూరి హరికృష్ణ మనుమలు, దివంగత జానకీరామ్ తనయులు మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రలను వెండితెరకు పరిచయం చేస్తూ సీహెచ్ వెంకటేశ్వరరావు, జె. బాలరాజు నిర్మిస్తున్న బాలల చిత్రం ‘దానవీరశూరకర్ణ’. జె.వి.ఆర్ దర్శకుడు. గాయని కౌసల్య స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని హీరో కల్యాణ్‌రామ్ ఆవిష్కరించి, ఎన్టీఆర్‌కు అందించారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘మమ్మల్ని ప్రోత్సహించినట్టుగానే మా వంశం నుంచి వస్తున్న నాలుగో తరం వారిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. చాలా మంచి సబ్జెక్ట్ ఇది’’ అని సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, నిర్మాత సి.కల్యాణ్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు!
నటవిఖ్యాత నందమూరి తారక రామారావు నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అదే పేరుతో ఓ బాలల చిత్రం రానుంది. ఇందులో నందమూరి జానకిరామ్ తనయులు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, మరో కుమారుడు సౌమిత్రి సహదేవునిగా నటించారు. శ్రీ సాయి జగపతి పిక్చర్స్ సంతోష్ ప్రొడక్షన్స్ పతాకంపై చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జేవీఆర్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మేము అనుకున్న దానికన్నా బాల నటీనటులు బాగా నటించారు. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రి తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు’’ అని చె ప్పారు. ‘‘నాటి ‘దానవీరశూరకర్ణ ’కు పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి కూడా పనిచేయడం విశేషం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని జె.బాలరాజు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, కళాదర్శకులు: ఎస్.ఆర్.కె.శర్మ. -
మా అబ్బాయికి...దానవీరశూరకర్ణ చూపించా!
‘నిన్ను నువ్వు నమ్ముకొంటే, ఆలస్యమైనా సరే విజయం అనివార్య’మనే పాఠానికి తాజా ఉదాహరణ - నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. సినిమాల్లోనూ, వ్యక్తిగతంగానూ అనేక ఎదురుదెబ్బలు తగిలినా, ఆయన ఎట్టకేలకు ఇప్పుడు ‘పటాస్’ చిత్రంతో మంచి వాణిజ్య విజయం సాధించారు. వివాద రహితుడూ, మంచి మనిషి అయిన కళ్యాణ్ రామ్‌కు సక్సెస్ రావాలని పరిశ్రమలో అందరూ కోరుకున్నారంటే, ఆయన సంపాదించుకున్నది కోట్లకు మించిన సంపద అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పదేళ్ళ కష్టానికీ, నిరీక్షణకూ దక్కిన ఫలితం ఎంత తీయగా ఉంటుందో స్వయంగా చవిచూసిన ఈ యువ హీరో ‘పటాస్’ విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు. తప్పొప్పుల్ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటూనే, బాబాయ్‌తో 100వ సినిమా మొదలు కుటుంబ విలువల దాకా అనేక అంశాలపై ఆయన మనసు విప్పి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ‘పటాస్’ బాగా పేలినట్లుంది... చాలాకాలం తరువాత అందరి నుంచి ఏకగ్రీవంగా విజయానికి అభినందనలందుకోవడం ఎలా ఉంది? (నవ్వుతూ...) బాగుంది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సక్సెస్ అనే మాట వినడం ఎనర్జీనిస్తుంది. మన ప్రయత్నాన్ని ఎవరైనా మెచ్చుకోవడాన్ని మించి ఆనందం ఇంకేముంటుంది! ‘అతనొక్కడే’ (2005) తరువాత ‘హరేరామ్’ వాణిజ్యపరంగా విజయవంతమైనా, జనం నుంచి ఇంత స్పందన రాలేదు. ‘పటాస్’ను అందరూ మెచ్చుకొన్నారు. ఇన్నేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురుచూడడం, నిరాశ పడకుండా శ్రమించడం అంత సులభం కాదేమో! పదేళ్ళుగా ఒంటరి పోరాటం చేస్తున్నా. నిరాశపడ్డ సందర్భాలున్నాయి. అయితే, నన్ను నేను నమ్మాను. ‘మన ప్రయత్నం మనం కష్టపడి చేద్దాం... ఫలితం ప్రేక్షకులకు వదిలేద్దాం’ అని నిశ్చయించుకున్నా. సినిమా ఫెయిలైతే, లోతుగా విశ్లేషించుకుంటా. ఎందుకంటే, మా కుటుంబమంతా సినిమా మీదే బతుకుతోంది. మరి, మీరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసిన గత చిత్రం ‘ఓం-3డి’ ఫెయిల్యూర్పైనా విశ్లేషించుకున్నారా? కచ్చితంగా! నా వ్యక్తిగత విశ్లేషణ ఏమిటంటే, సినిమాను కొత్తగా చెప్పాలనీ, చాలా మలుపులు ఉండాలనీ నేను ప్రయత్నిస్తుంటా. అయితే, ఇవాళ జనం బయట సవాలక్ష పనులు, సమస్యల నుంచి విరామం కోసం హాలుకు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నదే అందుకోసం కాబట్టి, రెండున్నర గంటల పాటు వాళ్ళు తమ జీవితంలోని కష్టాలను మర్చిపోయేలా వినోదింపజేయాలి. ఇక్కడ వినోదమంటే కేవలం నవ్వించడమనే కాదు... ఫీల్‌గుడ్ సినిమా, ప్రేమ కథ, యాక్షన్ - ఇలా ఏదైనా కావచ్చు. వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకూడదు. కానీ, ‘ఓం - 3డి’లో ట్విస్టులు, లింకులతో ప్రేక్షకులపై భారం మోపాం. అదే ఇబ్బంది అయింది. ఏదైనా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పాలని అర్థమైంది.‘ఓం-3డి’తో పోలిస్తే, ‘పటాస్’ ఎంటర్టైనింగ్ సినిమా కాబట్టి, ప్రతిరోజూ ఒక పండగలాగా సాగిపోయింది. ఇందులోని స్ట్రెయిట్ నేరేషన్, సినిమాలో ఉన్న ‘పార్థాయ...’ లాంటి రకరకాల ప్రత్యేక అంశాలు, దర్శకుడి ప్రతిభ సక్సెస్‌కు తోడ్పడ్డాయి. ముఖ్యంగా, తల్లులే పిల్లలకు బుద్ధి చెప్పడమనే ఘట్టం చాలా మందికి నచ్చింది. నూటికి నూరుపాళ్ళు జనం వినోదించారు. చాలాకాలం సక్సెస్‌కు దూరంగా ఉండి, కోట్ల కొద్దీ డబ్బు నష్టపోయినప్పుడు మీకు అండగా నిలిచిందెవరు ఇంకెవరు! నా కుటుంబమే! మా అమ్మా నాన్న, నా భార్య, నా బావమరిది, ఆప్తమిత్రులు కొందరు - వీళ్ళే నాకెప్పుడూ కొండంత అండ. వాళ్ళెవరూ నన్ను నిరుత్సాహపరచలేదు. పెపైచ్చు, విజయం సాధించగలవంటూ నన్ను ముందుకు నెట్టారు, ప్రోత్సహించారు. మీడియా దగ్గర నుంచి నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సారి నాకు విజయం రావాలని మనసారా కోరుకున్నారు. వాళ్ళందరి ఆశీస్సులూ ఫలించాయి. ఇంతకీ, ‘పటాస్’ చూసి, మీ నాన్న గారు, బాబాయ్ బాలకృష్ణ వాళ్ళు ఏమన్నారు? (మెరిసే కళ్ళతో...) చాలా కాలంగా నా విజయం కోసం ఎదురుచూస్తున్న నాన్న గారు చాలా హ్యాపీ. నా సినిమా సక్సెసైతే గుడికి వెళతానని మొక్కుకున్నట్లున్నారు. రిలీజ్ రోజున నేను ఫోన్ చేసి, ‘సినిమా బాగుందట’ అనే లోపుగానే, తనకు విషయం తెలిసిందంటూ, మేమెక్కడికో రమ్మన్నా రాకుండా, వెంటనే గుడికి వెళ్ళారు. బాలకృష్ణ బాబాయ్ కూడా సినిమా చూసి, సంతోషించారు. తమ్ముడు తారక్ (చిన్న ఎన్టీయార్) ‘అన్నా! నీ కెరీర్లో అత్యుత్తమ అభినయం!’ అంటూ మెచ్చుకున్నాడు. మా కుటుంబం కళ్ళల్లో ఆనందబాష్పాలు చూశాను. మీ పిల్లలిద్దరికీ సినిమా నచ్చిందా? వాళ్ళ ముత్తాత పెద్ద ఎన్టీఆర్ గురించి చెబుతుంటారా? మేము బతుకుతున్నదే మా తాత ఎన్టీఆర్ గారి పేరు మీద! ఆయన నుంచి మా నాన్న గారు... మా నాన్న గారి నుంచి మేము నేర్చుకున్న కుటుంబ విలువలు, అనుబంధాలు మా పిల్లలకు కూడా అలవడేలా చూస్తుంటా. మా అమ్మాయి తారక అద్వితకు నాలుగేళ్ళు. చిన్నపిల్ల. అబ్బాయి శౌర్యరామ్కు ఆరున్నరేళ్ళు. వాడు ఇప్పటికే రెండుసార్లు ‘పటాస్’ చూశాడు. వాడికి సినిమా బాగా నచ్చేసింది. నా చదువు, తదితర కారణాల వల్ల నేను ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడుతుంటా. కానీ, పిల్లలకు తెలుగు బాగా రావడం కోసం చిన్నప్పటి నుంచి శ్రద్ధ చూపిస్తున్నా. మా వాడు చూసిన మొదటి సినిమా - వాళ్ళ ముత్తాత గారి ‘దానవీరశూర కర్ణ’. అలాగే, పెద్దాయన ‘ఆలీబాబా 40 దొంగలు’, బాబాయ్ ‘భైరవద్వీపం’ అంటే వాడికి చాలా ఇష్టం. కొత్త దర్శకులతో, అదీ సొంత సినిమాలే తప్ప బయటవాళ్ళకు సినిమాలు చేయరేం? అదేమీ లేదు. నాకు వేరే వ్యాపారాలు తెలియవు. ఆలోచనలు లేవు. మా తాత గారి పేరు మీద ఈ ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ సంస్థ పెట్టాను. నా దగ్గరకు కొత్త దర్శక, రచయితలు వస్తారు. వాళ్ళు చెప్పిన కథ నచ్చితే, మరోమాట లేకుండా చేసేస్తుంటా. మా సంస్థను విస్తరించాలనే ఉద్దేశంతో సురేంద్రరెడ్డి-రవితేజలతో ‘కిక్2’ నిర్మిస్తున్నా. సెట్స్ మీద ఉన్న నా ‘షేర్’ బయటి నిర్మాతలదే. అలాగే, నా తదుపరి చిత్రం కూడా బయటవాళ్ళదే. తారక్, నాగ చైతన్య, నాగ్‌లతో సినిమాలు చేయాలని యత్నిస్తున్నట్లున్నారు! అవును. చైతన్యకు గతంలో స్క్రిప్ట్ చెప్పాను. ఆ ప్రాజెక్ట్‌ను పట్టాల మీదకు ఎక్కించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘బాలగోపాలుడు’లో నన్ను బాలనటుడిగా పరిచయం చేసి, నటనలో ఓనమాలు దిద్దించిన బాబాయ్ బాలకృష్ణ 100వ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నా. మీ తమ్ముడు తారక్‌తో మునుపటి కన్నా అనుబంధాలు బాగా పెరిగినట్లున్నాయి..! మేమంతా ఒకే కుటుంబం కదండీ! గతాన్ని తవ్వుకోదలుచుకోలేదు. మునుపటితప్పులు మళ్ళీ జరగకూడదని జాగ్రత్త పడుతుంటా. 1983 వరకు మా తాత గారి దగ్గర ఉమ్మడి కుటుంబంలో పెరిగినవాణ్ణి. కుటుంబ బంధాలు, విలువలు తెలుసు. ఎప్పుడూ వాటికి విలువనిస్తా. ఇన్నాళ్ళుగా ఉన్నా పార్టీలు, ఫంక్షన్లలో మీరు కనిపించరు! వివాదాలు, ఆర్భాటాలకూ దూరమే! వాటన్నిటికీ నేను దూరం. ‘ఇష్టం లేకపోతే మాట్లాడకు. అంతే తప్ప మాట తూలితే వెనక్కి తీసుకోలేం నాన్నా! జాగ్రత్త’ అని తాత గారు, నాన్న గార్ల నుంచి నేర్చుకున్నదే పాటిస్తుంటాను. వివాదాల జోలికి పోను. నేను ఎవరి గురించి, దేని గురించీ మాట్లాడను. ‘నీ సినిమా బాగుండాలని కోరుకో! అంతేకానీ, పక్కవాడిది పోవాలనుకోకు’ అని నా సిద్ధాంతం. ఇల్లు, ఆఫీసు, షూటింగ్ తప్ప నాకు వేరే తెలియదు. అయితే, ఇంటికి చాలా ప్రాముఖ్యమిస్తారన్న మాట! పెళ్ళయినవాణ్ణి కాబట్టి ఇంటికే ప్రాధాన్యమిస్తా. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతా. ఖాళీ సమయం దొరికితే, మూడ్‌ను బట్టి రకరకాల టీవీ చానల్స్ చూస్తుంటా. అలాగే, ఇంట్లో ఉంటే కుటుంబమంతా కలిసే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తాం. అందరం కలసి తినాలనే ఆ పద్ధతినీ, కుటుంబ విలువలనూ తప్పనిసరిగా పాటిస్తుంటా. అలాగే, చిర్రుబుర్రులాడుతూ ఉండేవాళ్ళ కన్నా, చిరునవ్వుతో ఉండేవాళ్ళంటే నాకిష్టం. లొకేషన్‌లోనూ సీరియస్‌గా ఉండేవాళ్ళకు నేను దూరం. రాజకీయాల పట్ల మీరు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించరేం? (గంభీరంగా...) ఏ పని చేస్తుంటే, దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలనేది నా తత్త్వం. రాజకీయం పెద్ద వ్యవస్థ. అవగాహన లేని దానిలో వేలు పెట్టను. మీ అన్నయ్య జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం... (చెమర్చిన కళ్ళతో...) అది మా కుటుంబమంతటికీ తీరని బాధ. మా నాన్న గారెప్పుడూ తాత గారి పనుల వ్యవహారాల్లో ఉండేవారు కాబట్టి, చిన్నప్పటి నుంచి మా విషయాలన్నీ అన్నయ్యే చూసుకొనేవాడు. వాడు మాకు నాన్న తరువాత నాన్న లాంటివాడు. మా అన్నయ్యకు సినిమాలంటే బాగా ఇష్టం. అయితే, పెద్దగా బయటకు వచ్చేవాడు కాదు. ఏదైనా మంచి సినిమా, పాట, రీరికార్డింగ్ చూస్తే, ఆ రిఫరెన్స్‌లు నాకు ఇస్తుండేవాడు. ‘పటాస్’ ఫస్ట్‌లుక్ రిలీజయ్యాక చూసి, ‘నీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ సినిమా హిట్టవుతుంది’ అని చెప్పాడు. అలాంటివాడు కొన్ని వందల సార్లు తిరిగిన రోడ్డు మీదే ప్రమాదానికి గురై చనిపోవడం విధి విలాసం. అందుకే, ‘పటాస్’ మొదట్లో నేను, తారక్ అందరికీ మెసేజ్ ఇవ్వాలని ‘రోడ్డు ప్రమాదం జాగ్రత్తలు’ చెప్పాం. మీ నాన్న గారికీ ఎప్పుడైనా సలహాలిస్తుంటారా? బాబాయ్‌తో... (మధ్యలోనే అందుకుంటూ...) వాళ్ళ మార్గదర్శకత్వంలో పెరిగినవాళ్ళం. వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వగలిగినంత వాళ్ళం కాదు. మాదంతా ఒక కుటుంబం. అన్ని కుటుంబాలలో లాగానే మాకూ చిన్న చిన్న అలకలు, కోపతాపాలు ఉంటాయి. అయితే, అవేవీ శాశ్వతం కాదు. అన్నీ వచ్చిపోతుంటాయి. మేమంతా ఎప్పుడూ ఒక్కటే! ఎప్పటికైనా ‘మనం’ లాగా మా కుటుంబంలో మా నాన్న, బాబాయ్, నేను, తమ్ముడు తారక్ - ఇలా మూడు తరాల వాళ్ళం కలసి సినిమా చేయాలని నా కోరిక. అలాంటి అవకాశం, అదృష్టం మన తెలుగు పరిశ్రమకే ఉండడం విశేషం. మీ అమ్మాయి పేరును ‘ఓం’ చిత్రం నిర్మాణ బాధ్యతల్లో వేశారు. ఇక మీ అబ్బాయిని నటుణ్ణి చేస్తారా? (నవ్వేస్తూ...) చిన్నపిల్లలు... వాళ్ళకు కావాల్సినట్లుగా వాళ్ళను ఉండనివ్వండి. పెద్దయ్యాక వాళ్ళకు ఏది చేయాలనిపిస్తే, అది చేస్తా. అంతేతప్ప, సినిమాల్లోకే రమ్మని బలవంతపెట్టను. మా అబ్బాయికి సినిమాలంటే ఇష్టం. వాళ్ళ అమ్మను తోడు తీసుకొని, ప్రతివారం సినిమాలకు వెళతాడు. నేను ఎంత ఒత్తిడిలో ఉన్నా దాని నుంచి బయటపడడానికి పిల్లలే నాకు పెద్ద రిలీఫ్. ఆ సంగతి చెబితే అర్థం కాదు... పిల్లలున్నవాళ్ళకు ఎవరికి వారికి అనుభవంలోకి వస్తుంది. - రెంటాల జయదేవ -
మరో దానవీరశూరకర్ణ
మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రం ఎవర్గ్రీన్ క్లాసిక్. ఇప్పుడా చిత్రంతోనే నందమూరి నాలుగో తరం నటవారసులు రంగప్రవేశం చేస్తున్నారు. శ్రీ సాయి జగపతి పిక్చర్స్- సంతోష్ ప్రొడ క్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జేవీఆర్ దర్శకుడు. ముహూర్తం దృశ్యానికి హీరో కల్యాణ్‌రామ్ కెమెరా స్విచాన్ చేయగా, హీరో ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత జె. బాలరాజు మాట్లాడుతూ - ‘‘ 90 రోజుల సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి, మార్చి 28న ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కృష్ణుడి పాత్రను మాస్టర్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, నకులుడు-సహదేవునిగా సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నారు’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్‌రెడ్డి, సంగీతం: కౌసల్య.