మా ఊరోళ్లకు వేడివేడిగా ఆరోజే విడుదలైన సినిమాలు బోర్ కొట్టేశాయి. విడుదల కాకముందే లీకైన సినిమాలు సెల్‌ఫోన్‌లో చూసీచూసీ బొర్ కొట్టేశాయి. పనీపాటలేని అప్‌లోడింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ట్రెండింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ఇలాంటి మహాబోర్ సమయంలో...‘‘మన గ్రామ సర్పంచి పుట్టిన రోజు సందర్భంగా రేపు రాత్రి మన ఊళ్లో దానవీరశూరకర్ణ నాటకం ఉంటుందహో’’ అనే చాటింపు విని ఊళ్లో ఆబాలగోపాలం ఆనందించారు.‘నాటకం చూడక ఎన్నాళ్లయిందో...ఆరోజులే వేరు’ అనే నాస్టాల్జియాతో వయసు మళ్లిన వాళ్లు...‘నాటకమటా...ఎలా ఉంటుందో చూద్దాం’ అని సోషల్ మీడియా జమానాలో పుట్టిన లేలేత కుర్రోళ్లు...చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఆరోజు సర్పంచి పుట్టిన రోజు. ఆయన ఇంటెనకాల పెద్ద గ్రౌండ్‌లో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరింటికే ప్రేక్షకదేవుళ్లతో నాటకప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకల తరువాత నాటకం మొదలైంది....నాటుసార సారయ్య శకుని వేషం కట్టాడు. బాగా కుదిరాడు.‘‘దుర్యోధన... నాకే ఓ కూతురు ఉండి ఉంటే....నీ తలపు, వలపు, నీ కులుకు వేరే వన్నెలాడివైపు పొనిచ్చేవాడినాఏంచేయనూ...మేనమామనై ఉండి కూడా మామను కాలేని దురదృష్టవంతుడిని’’ అని విషాదంగా డైలాగు కొట్టాడు ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఒక తాగబోతు గట్టిగా అరుస్తూ పైకి లేచాడు. ఇతడు సారయ్యకు స్వయానాబావమరిది. పేరు సారా సాంబయ్య.‘‘ఒరేయ్ సారిగా...నీకు కూతుళ్లు లేకపోవడం ఏందిరా! పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్నరు. ఒక్కరి పెళ్లి అయినా చేసినవా? పొద్దున లేసుడు....కల్లుతాగుడు....సాయంత్రం గుడంబ తాగుడు...నీ ముఖానికో నాటకం...’’సాంబయ్య తిట్లు విని ప్రేక్షకులు ఒకటే నవ్వడం! పాపం కళాకారుడు సారయ్య ముఖం మాడిపోయిన పెసరట్టయింది.‘‘ఒరేయ్ సాంబా కూకో....’’ అని సర్పంచి అరిచేసరికి సైలెంట్ అయిపోయాడు సాంబయ్య. ఆతరువాత భీష్మ పాత్రధారి కాషయ్య డైలాగు:‘‘నాయనా...వంశం కోసం బ్రతికున్నంత వరకు వయసంతా ధారబోసిన ఘోటక బ్రహ్మచారిని. నేను మాట ఇవ్వను. ఇచ్చాను అంటే దానికి చచ్చినా తిరుగుండదు. నేను ప్రతిజ్ఞ చేసినానుఅంటే, అంతే...తిరుగుండదు. అందుకే భీష్మప్రతిజ్ఞ అంటారు’’ఈలోపే ప్రేక్షకుల మధ్యలో నుంచి కాషయ్య క్లాస్‌మేట్ ఒకడు లేచి....‘‘ఒరే కాశీ....వంశం కోసం వయసంతా ధారపోసావా?! పదిహేడేళ్లకే మూడు కాపురాలు పెట్టావు....నువ్వు వయసు ధారపోయడం ఏమిట్రా బెవకూఫ్. పెళ్లి చేసుకుని వదిలేయడమేనా? వాళ్ల బాగోగుల గురించి పట్టించుకునేదిలేదా! మూడో భార్య ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పిల్లను సాకుతోంది. రెండో భార్య ఎండల్లో కూలీనాలికీ పోతూ కష్టపడుతోంది. మొదటి భార్యను పట్టించుకునే దిక్కేలేదు....భార్యలు కష్టపడుతుంటే నాటకాలంటూ తిరుగుతున్నవేందిరా మొద్దునాయాలా....గబ్బు నాయాలా...’’ అని నాన్‌స్టాప్‌గా తిట్లు మొదలు పెట్టాడు.ఈలోపు లచ్చయ్య అనే వార్డు మెంబరు లేచాడు...
‘‘ఆడిన మాటను తప్పను...అని ఎంత సిగ్గులేకుండా అంటున్నావురా కాశీగా! నన్ను ఉపసర్పంచి చేస్తానని మాటిచ్చావు. చేశావా? చేయకపోతే చెయ్యకపోతివి...నా దగ్గర తీసుకున్న డబ్బైనా ఇచ్చినవా? నీకేమాత్రం సిగ్గున్నా నా డబ్బు నాకు ఇచ్చేయాలి లేదా నన్ను ఉపసర్పంచి చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను’’ అని అవేశంగా అరిచాడు.ఉపసర్పంచి రాజయ్య ఆగ్రహంగా లేచి...‘‘దైవం మీద ఆన. నన్ను పదవీచ్యుతుడిని చేస్తే ఊరుకునేది లేదు. ఫస్ట్‌టైమ్ వార్డ్‌మెంబర్‌గా గెలిచాను. భగవంతుని దయతో ఫస్ట్‌టైమ్ ఉపసర్పంచి అయ్యాను. పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మీ కళ్లు మండిపోయాయి. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండాలా? ఇదేనా డెమోక్రసీ? అని ఈ సందర్భంగా అడుగుతూ, ఓటరు మహాశయులకు నమస్తేచెబుతూ...నా సీట్లో నేను కూసుంటున్నాను’’ అంటూ కూర్చున్నాడు.ఫ్రెండ్స్ మాటలతో భీష్మ పాత్రధారి కాశయ్య హర్ట్ అయ్యాడు....‘‘రేయ్ దొంగనాయల్లారా...టేజీ(స్టేజీ) మీదున్నంత వరకే నేను భీష్ముడిని. టేజీ దిగానా....మాస్....పక్కా మాస్. నా డైలాగులు అయిపోయేంతవరకు గమ్మునుండండి. ఆ తరువాత...మీరు మా ఇంటికొచ్చినా సరే. నన్ను మీ ఇంటికి రమ్మన్నా సరే...ఎక్కడైనాసరే...ఎప్పుడైనా సరే...మొకాలి చిప్పలు పగిలిపోవాలా....ఏం అనుకున్నారో ఏమో....’’ అన్నాడు ఆవేశంగా.సర్పంచి మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నాటకం వేస్తరా? నకరాలు చేస్తరా?’’చిన్నబ్రేక్ తరువాత నాటకం మళ్లీ మొదలైంది.దుర్యోధన సార్వభౌముడు రేకుల కైలాసం ఆవేశంగా తన డైలాగు స్టార్ట్ చేశాడు...‘‘ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి?ఎంత మాట ఎంత మాటా!మట్టికుండలో పుట్టిన నీదే కులం?(ఆ తరువాత డైలాగు మరిచిపోయాడు కైలాసం. ఈ మతిమరుపు వల్లే పదవతరగతి పరీక్ష మూడుసార్లు తప్పాడు. ఇంకా తప్పుతూనే ఉన్నాడు. ఏదో ఒక సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసై తనను తాను ప్రూవ్ చేసుకోవాలనేది కైలాసం ఆశయం. ఎంత పెద్ద మొనగాడైనా స్టేజీ మీద డైలాగులు మరిచిపోవడం కామన్ విషయమని, అలాంటప్పుడు ప్రేక్షకులకు అనుమానం రాకుండా ఫ్లోలో నోటికొచ్చింది దంచుకుంటూ పోవాలని సీనియర్ నటుడు, నటరత్న కల్లు నాగమల్లు చెప్పిన విషయం కైలాసానికి గుర్తుకు వచ్చింది. ఇక చూస్కోండి. ఇలా అందుకున్నాడు...)‘ఆచార్యదేవాఏమంటివి ఏమంటివి?ఇది క్షేత్రపరీక్ష కాని క్షత్రియపరీక్ష కాదు... టెన్త్‌క్లాస్ పరీక్ష కానేకాదు.ఆచార్యదేవా...ఏమంటివి?టెన్త్‌క్లాస్‌పరీక్ష పాసు కావడమంటే మామూలనుకుంటివా?పొద్దున లేచి పండ్లు తోముకున్నంత ఈజీ అనుకుంటివా?ఆచార్యాదేవా...క్షేత్రపరీక్ష, క్షత్రియపరీక్షైనా పాస్‌కావచ్చుగానీ... టెన్త్‌క్లాసుపరీక్ష పాస్ కావడం అల్లాటప్పా వ్యవహారం అనుకుంటివా...’ఇంకేముంది....ఒన్స్‌మోర్ అంటూ ఒకటే లీలలు!
– యాకుబ్ పాషా
దాన వీర శూర కర్ణ
Published Sun, Mar 10 2019 12:31 AM | Last Updated on Sun, Mar 10 2019 12:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment