నిజంగానే రియల్ స్టార్
1999... శ్రీహరి హీరోగా ‘పోలీస్’ సినిమా ప్రకటించగానే చిత్రసీమలోని చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానించుకున్నారు. బాడీ బిల్డర్‌లా ఉంటూ విలన్ వేషాలేసుకునే శ్రీహరి హీరో రోల్లో ఫిట్ అవుతాడా? ఇన్ని సందేహాల మధ్యలోనే ‘పోలీస్’ సినిమా చకచకా పూర్తి కావడం, విడుదల కావడం, నిర్మాతకు ఆర్థికంగా లాభాలు రావడం... ఇవన్నీ జరిగిపోయాయి. ఏదో ఫ్లూక్ హిట్ అనుకున్నారు మొదట. తర్వాత వచ్చిన ‘దేవా’, ‘సాంబయ్య’ హిట్లతో శ్రీహరి హీరోగా హ్యాట్రిక్ సాధించారు. దాంతో శ్రీహరి స్టామినా ఏంటో అటు బాక్సాఫీస్‌కి, ఇటు పరిశ్రమకీ అవగతమైంది. కంఫర్టబుల్ బడ్జెట్లో శ్రీహరితో సినిమా చేస్తే, ఆ నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే బ్రాండ్ తెచ్చుకున్నారాయన.
హీరోగా తనకొచ్చిన బూమ్ని సద్వినియోగం చేసుకోవడానికి శ్రీహరి ప్రతి క్షణం తపించారు. దాదాపుగా సినిమాలు తీయడం మానుకున్న నిర్మాత జయకృష్ణను పిలిచి మరీ డేట్లు ఇచ్చారు. ఒకప్పుడు స్టార్ ఫైనాన్షియర్‌గా వెలుగొంది, తెరమరుగైన వాళ్లకి అడక్కుండానే కాల్షీట్లు కేటాయించారు. అలాగే బాగా చితికిపోయిన నిర్మాతలను పిలిచి మరీ అవకాశాలిచ్చారు. తనను నమ్ముకున్న స్నేహితులను, ప్రొడక్షన్ మేనేజర్లను కూడా నిర్మాతలను చేసిన ఘనత శ్రీహరిదే. ఇప్పుడు పరిశ్రమలో అగ్రనిర్మాతగా వెలుగొందుతున్న బెల్లంకొండ సురేష్‌కి ‘సాంబయ్య’ సినిమాతో లైఫ్ ఇచ్చింది శ్రీహరే. ఒక్క నిర్మాతలనే కాదు ఎందరో కొత్త దర్శకులకు, సాంకేతిక నిపుణులకు బంగారు భవిష్యత్తుని ప్రసాదించారు. అయిదారేళ్ల పాటు హీరోగా ఆయన హవా సాగింది. తను ఎదుగుతూ, తనను నమ్ముకున్న వారిని కూడా ఎదిగేలా చేయడం శ్రీహరి గొప్పతనం. అందుకే శ్రీహరిని రియల్ స్టార్ అనేది.
ఫైటింగ్ స్పిరిట్: అసలు శ్రీహరి కెరీర్ ఓ చిన్న ఫైటర్‌గా మొదలైంది. ఆ ఫైటింగ్ స్పిరిట్‌తోనే తన కెరీర్‌ని శక్తివంతంగా నిర్మించుకున్నారాయన. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మనాయుడు’ సినిమాతో శ్రీహరి నటప్రస్థానం మొదలైంది. తన వైవిధ్యమైన నటనతో, వ్యక్తిత్వంతో, స్నేహంతో అందరితో మంచి అనిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. తనకొచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని శ్రీహరి సద్వినియోగం చేసుకున్నారు. సైడ్ విలన్ పాత్ర అయినా, మెయిన్ విలన్ అయినా తనదైన డిక్షన్ ఆఫ్ డైలాగ్స్‌తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకుల్ని చాలా తొందరగానే ఆకట్టుకోగలిగారు. ఆయనలో మంచి కామెడీ టింజ్ ఉందని హలో బ్రదర్, అల్లరి ప్రేమికుడు, బావగారు బాగున్నారా లాంటి సినిమాలు నిరూపించాయి. ‘అల్లరి ప్రేమికుడు’లో ‘ఈ హరి బీరు కొట్టి బరిలోకి దిగాడూ అంటే... ఎవడైనాసరే హరీ అనాల్సిందే’ అనే డైలాగ్‌ని ఆయన చెప్పిన విధానం బాగా ఆకట్టుకుంది.
హయ్యెస్ట్ పెయిడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్: ‘పోలీస్’ (1999) చిత్రంతో హీరోగా మారిన శ్రీహరి, మొత్తం 28 సినిమాల్లో హీరోగా చేశారు. 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’తో కేరెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్రీహరి అన్న పాత్ర పోషిస్తే, ఆ సినిమా విజయం తథ్యమనే సెంటిమెంట్ కూడా పరిశ్రమలో ఏర్పడింది. ఆయన కీలకపాత్ర పోషించిన ఢీ, మగధీర, బృందావనం లాంటి చిత్రాలు ఘనవిజయాల్ని సాధించాయి. దాంతో హయ్యెస్ట్ పెయిడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలుగొందారు. మధ్య మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు. ఏదో రొడ్డ కొట్టుడు తరహా పాత్రలకు కాకుండా వైవిధ్యానికే పెద్దపీట వేసేవారాయన. ఏం చేసినా తనదైన మార్కు చూపడానికి ప్రయత్నించేవారు. హీరోగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సమయంలోనే కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ కావడమనేది నిజంగా సాహసమే. హీరో అంటే ఆరు పాటలు, ఐదు ఫైట్లు అన్న ధోరణిలో కాకుండా శక్తివంతమైన పాత్రలతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చని శ్రీహరి చాలామందికి ఓ కొత్త మార్గం చూపించారు. హీరోగా చేస్తున్న సమయంలో హీరోయిన్‌కి అన్నగా చేయాలనుకోవడం శ్రీహరి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. అదే ఆయన కెరీర్‌ని మరోవైపు టర్న్ చేసింది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌గా ఆయన చూపించిన అభినయం ఆ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
పోలీస్ అంటే ప్రేమ: పోలీస్ పాత్రల్లో కూడా శ్రీహరి బాగా రాణించారు. ఆయన చేసిన పోలీసు పాత్రలన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. నిజానికి ఆయన ఒకప్పుడు పోలీస్ కావాలనుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎస్.ఐ. పోస్టింగ్ కూడా సాధించి, చివరకు వద్దనుకున్నారు. సమాజానికి పోలీసు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఓ గొప్ప సినిమా చేయాలని కలలు కన్నారు. అందుకోసం ఓ రచయితతో స్క్రిప్టు కూడా సిద్ధం చేయిస్తున్నారు.
ఆదర్శ దాంపత్యం: సినిమాల్లో నటునిగా ఎదుగుతున్న సమయంలోనే నృత్యతార డిస్కో శాంతితో పరిచయం ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. శాంతితో ఆయన దాంపత్యం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండేవారు. వీరికి ఇద్దరు మగపిల్లలు.
27 ఏళ్లు... 97 సినిమాలు: 27 ఏళ్ల కెరీర్లో మొత్తం 97 సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు. యమధర్మరాజు లాంటి పౌరాణిక పాత్రల్లో కూడా రాణించారు. ఇటీవల విడుదలైన ‘ఆది శంకర’లో గోవింద భగవత్పాదగా శ్రీహరి తన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా, ప్రేయసి రావే, సముద్రం, శ్రీరాములయ్య, ప్రేమంటే ఇదేరా, సూర్యుడు, అల్లుడా మజాకా, తాజ్‌మహల్, హలో బ్రదర్, భద్రాచలం, అయోధ్య రామయ్య, విజయరామరాజు, హనుమంతు, కుబుసం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర, ఢీ, కింగ్, బృందావనం... తదితర చిత్రాలు శ్రీహరి అభినయ సామర్థ్యానికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి. నిర్మాతగా ‘హనుమంతు’లాంటి సినిమాలు కూడా చేశారు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రాలు శివకేశవ్, వీకెండ్‌లవ్. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రస్తుతం హిందీలో తయారవుతున్న ‘రాంబో రాజ్‌కుమార్’లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇదే ఆయనకు తొలి హిందీ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ కోసం ముంబైలో ఉన్నప్పుడే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
ఎప్పుడూ పర్ఫెక్ట్ బాడీతో ఫిట్‌గా కనిపించే శ్రీహరి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైనట్టుగా, బాగా చిక్కి కనిపిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా శ్రీహరి మరణం చిత్ర పరిశ్రమకు రియల్‌గా లాసే. కొన్ని పాత్రల్లో ఆయనకు రీప్లేస్‌మెంటే లేదు. ఇది సత్యం.
ప్రముఖుల నివాళి
మా సంస్థలో శివయ్య, తాజ్‌మహల్... ఇలా పలు చిత్రాల్లో నటించాడు శ్రీహరి. వెంకటేష్ కాంబినేషన్లో కూడా పలు చిత్రాలు చేశాడు. నాయుడుగారూ అంటూ ఎంతో అభిమానంగా పిలుస్తాడు. నన్ను ‘గాడ్‌ఫాదర్’ అంటుంటాడు. కొత్త నటీనటులను ప్రోత్సహించే మీలాంటి నిర్మాతలు అరుదని అనేవాడు. ఓ మంచి ఆత్మీయుణ్ణి కోల్పోయాను.
- డా. డి.రామానాయుడు
శ్రీహరితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ముఠా మేస్త్రీ, బావగారు బాగున్నారా తదితర చిత్రాల్లో కలిసి నటించాం. నేను చెన్నయ్‌లో ఉన్నప్పుడు.. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే శ్రీహరి నాతోనే ఉండేవాడు. మొదట్లో తను చిన్న చిన్న పాత్రలు చేసినా, ఆ తర్వాత స్వశక్తితో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. శ్రీహరి ప్రతిభకు అద్దం పట్టే చిత్రాల్లో ‘మగధీర’ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన మృతి నాకు తీరని లోటే.
- డా. చిరంజీవి
శ్రీహరిని దాసరిగారి దగ్గరికి తీసుకెళ్లింది నేనే. కష్ట సుఖాలను చెప్పుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. నా కుటుంబ సభ్యుడు లాంటివాడు. స్వశక్తితో పైకొచ్చిన సహజ నటుడు. చిత్రపరిశ్రమకు ఓ గొప్ప నటుడు దూరమయ్యాడు. తన మరణవార్త చాలా కలచివేసింది.
- డా. మోహన్‌బాబు
శ్రీహరిగారి కాంబినేషన్లో ‘ఢీ’ చిత్రం చేశాను. ఆ టైంలో యాక్టింగ్ గురించి ఆయన ఎన్నో సలహాలిచ్చేవారు. ఆయన్ను అన్నా అని పిలవడం అలవాటు. ఓ మంచి సోదరుణ్ణి కోల్పోయాను.
- మంచు విష్ణు
శ్రీహరి కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను. మంచి నటుడు మాత్రమే కాదు... మంచి వ్యక్తి కూడా. నాకున్న ఆత్యంత ఆప్తమిత్రుల్లో ఆయన ఒకరు. శ్రీహరి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను.
- సుమన్
నాలుగు రోజుల క్రితం శ్రీహరికి ఫోన్ చేస్తే, ‘ముంబైలో ఉన్నాను. వచ్చిన తరువాత కలుద్దాం’ అన్నాడు. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు’. మా అనుబంధం 22 ఏళ్లుగా కొనసాగుతోంది. హీరోగా రాణించేందుకు తను, దర్శకుడిగా ఎదిగేందుకు నేను ఇద్దరం చాలా కష్టపడ్డాం. జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ప్రతి క్షణం ఆ లక్ష్యం దిశగా నడిచిన మనిషి శ్రీహరి. ‘శ్రీరాములయ్య’ సినిమాలో శ్రీహరికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు లభించింది. ‘భద్రాచలం’ సినిమాను ఒక సవాల్‌గా తీసుకొని చేశాము. శ్రీహరి చాలా అరుదైన మనిషి, అరుదైన నటుడు కూడా. ఎవరైనా బాధలో ఉన్నారంటే వెంటనే చలించిపోతాడు. వీలైనంత వరకు సహాయం చేస్తాడు. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయాను.
- ఎన్. శంకర్