ముగ్గురు మావయ్యల ముద్దుల మేనల్లుడ్ని..
ఒక వైపు నుంచి పవర్ స్టార్,ఇంకో వైపు నుం చి మెగా స్టార్, మరో వైపు నుంచి మెగా బ్రదర్....ఈ వర్ణన అంతా ఎవరి గురించా అని ఆలోచిస్తున్నారా? అదేనండీ సాయి ధరమ్ తేజ్ గురించే. నగరంలో 'పిల్లా నువ్వులేని జీవితం' విజయోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చిన తేజ్ విశాఖతో తనకున్న అనుబంధం గురించి సిటీప్లస్‌తో పంచుకున్నారు.
నటన కోసం...
నేను 2009 సెప్టెంబర్‌లో సత్యానంద్ మాస్టార్ దగ్గర యాక్టింగ్‌లో మూడు నెలల ట్రైనింగ్ కోసం వచ్చాను. ఆ సమయంలో నాకు చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా నేను సో అండ్ సో...ఫలానా వాళ్ల తాలూకా అని చెప్పుకోలేదు. అందరి అటెన్షన్ డ్రా చేయడం ఇష్టం లేక అలా చెప్పాను. కానీ నా కోర్సు పూర్తయ్యే సమయానికి చాలా మందికి తెలిసిపోయింది... నేను మెగాస్టార్ మేనల్లుడిని అని.
డాబాలో ఫుడ్...ఫ్రెండ్ ఇంట్లో హ్యాంగౌట్స్
సత్యానంద్ మాస్టార్ దగ్గర ట్రైనింగ్ సమయంలో వైజాగ్‌లో ఎక్కువగా తిరిగేవాడిని. దత్ ఐలాండ్‌లో ఉన్న సబ్‌వేలో తిరిగేవాడిని. దానికి దగ్గర్లోనే ఒక మల్టీక్యూజిన్ రెస్టారెంట్ ఒకటి ఉండేది. రీసెంట్ గా అది క్లోజ్ చేసేశారు. అక్కడకు రెగ్యులర్‌గా వెళ్లేవాడిని. వైజాగ్‌లో నాతో పాటు కోర్సు చేసిన ఒకబ్బాయి అపార్ట్‌మెంట్ ఉంది. అక్కడ ఎక్కువగా హ్యాంగవుట్స్ చేసేవాడిని. రుషికొండ దగ్గర ఉన్న 'రాజుగారి డాబా'లో ఫుడ్ చాలా ఇష్టం. ప్రతి ఆదివారం అక్కడకు వెళ్లి ఫుడ్ తినాల్సిందే. రొయ్యల పలావ్, చికెన్ వేపుడు ఇలా అన్ని రకాల బాగా తినేవాడిని. మ్యాగ్జిమం సీ ఫుడ్ టేస్ట్ చేసేవాడిని.
యాక్టర్ అవుతా అనుకోలేదు...
మా ఫ్యామిలీలో అందరూ యాక్టర్స్ ఉన్నా సరే నాకెప్పుడూ నేను ఒక యాక్టర్ అవ్వాలి అని అనిపించలేదు. నా డిగ్రీ అయిపోయిన తర్వాత 9-5 జాబ్‌లో లేదా ఒక కార్పొరేట్ కంపెనీలో ఎవరో ఒకతనికి 'గుడ్ మార్నింగ్ సార్' అని చెప్తాం అన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. అది నాకు నచ్చదు కూడా. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా భావం ఉంటుంది. సో ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఓ అలోచన వచ్చింది. నేను యాక్టింగ్ సెలక్ట్ చేసుకుంటే...నేను ఏమైనా అవ్వచ్చు....నా ఫ్రీడం నాకు ఉంటుంది. సో అప్పుడు నాకు నటన మీద ఆసక్తి వచ్చింది.
పిల్లా నువ్వులేని జీవితం
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను, రెజీనా జస్ట్ హాయ్ అంటే హాయ్ అని మామూలుగా ఉండేవాళ్లం. సినిమా షూటింగ్ అయిపోయే సమయానికి మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇద్దరం బాగా అల్లరి చేసేవాళ్లం. మా అల్లరి తట్టుకోలేక డెరైక్టర్ వచ్చి కొంచెం షూటింగ్ మీద దృష్టి పెట్టండి..ప్లీజ్ అని చెప్పేవారు. మాతో పాటు జగపతిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. మా కన్నా అతనే ఎక్కువగా అల్లరి చేశారు.
డాన్స్
మా అమ్మగారు క్లాసికల్ డ్యాన్సర్. స్టేజ్ షోస్ చేసి ఇంటికి వచ్చేవారు. అమ్మకు తెలియకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత పెద్ద మావయ్య చిరంజీవి గారి సినిమాలు చూసి ఆయన పాటలకు డాన్స్ చేయడం, చిన్నప్పుడు స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తూ ఉండేవాడిని. అలా చిన్నప్పటి నుంచి డాన్స్‌ను వదల్లేదు.
ముద్దుల మేనల్లుడు
నేను 7వ తరగతి వరకు చెన్నైలో ఉండేవాడిని. అప్పుడు నా బాధ్యత అంతా నాగబాబు గారు చూసుకున్నారు. తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. అక్కడి నుంచి డిగ్రీ వరకు పెద్ద మావయ్య ఆధ్వర్యంలో ఉన్నాను. కెరీర్ పరంగా నాకు కల్యాణ్ మావయ్య గైడ్ చేసేవారు. మా ముగ్గురు మావయ్యలు నాకు మనో బలం,మనో ధైర్యం.
మల్టీస్టారర్
మా ముగ్గురు మావయ్యలతో కలిసి నటించాలి అని ఉంది. ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉంది. వాళ్లు ఓకే అంటే నేను రెడీ.
హరిశంకర్ గారి డెరైక్షన్‌లో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమా చేస్తున్నాను. నేను ఒక రకమైన పాత్రలే చేయాలి అని అనుకోవట్లేదు. అన్ని రకాల జోనర్ సినిమాలు చేస్తాను. ఒక్క హారర్ సినిమాలు తప్పించి. ఎందుకంటే బేసిక్‌గా నాకు హారర్ అంటే భయం.