నాకు జరిగినట్లే తేజ్‌కీ జరగడం యాదృచ్ఛికం : చిరంజీవి
‘‘తేజ్ మా ఇంట్లోనే ఉండేవాడు. క్రమశిక్షణ గల కుర్రాడు. మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కష్టపడుతూ, తమను తాము నిరూపించుకుంటూ నిలదొక్కుకుంటున్నారు. తేజ్ కూడా ఆ జాబితాలో చేరతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలపై బన్నీ వాసు, హర్షిత్ నిర్మించిన చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో చిరంజీవి సీడీని ఆవిష్కరించి హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘తేజ్ నా లాగానే ఉంటాడని అందరూ అంటూ ఉంటారు. నా తొలి చిత్రం ‘పునాదిరాళ్ళు’ అయినా, ముందుగా రిలీజైంది మాత్రం రెండో చిత్రమైన ‘ప్రాణం ఖరీదు’. అచ్చంగా అప్పుడు నాకు జరిగినట్లే ఇప్పుడు తేజ్‌కి కూడా జరుగుతుండడం యాదృచ్ఛికం. రామ్‌చరణ్ రెండో చిత్రం ‘మగధీర’ను నిర్మించిన గీతా ఆర్ట్స్ తేజ్ రెండో చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం విజయం సాధించి, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుం టున్నా’’ అని చెప్పారు. ‘‘సాయిధరమ్ తేజ్‌ను పరిచయం చేయడం వెనుక మొత్తం మా మెగా కుటుంబమంతా ఉన్నా, తొలి షో వరకే అది ఉపయోగపడుతుంది. నటుడిగా నిరూపించుకుంటేనే అతనికి మనుగడ ఉంటుంది. తేజ్ ఆ విషయంలో మా కుటుంబానికి చెందిన నలుగురు హీరోల్లో ఒకడవుతాడు’’ అని అల్లు అరవింద్ అన్నారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీహరి చనిపోయారు. అప్పుడు చాలా డీలా పడ్డాను. ఆ తర్వాత ఈ పాత్ర కోసం జగపతిబాబుగారిని తీసుకు న్నాం’’ అని చెప్పారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా పెద్ద మావయ్య నా హార్ట్ బీట్ అయితే పవన్ మావయ్య నా మనస్సాక్షి. నాలోని సహనం నాగబాబు మావయ్య. ఈ ముగ్గురూ నాకు కొండంత అండ’’ అన్నారు. ఇంకా వీవీ వినాయక్, ‘దిల్’ రాజు, హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్ తదితర అతిథులు చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనూప్ రూబెన్స్, రెజీనా తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు నిర్మాతలు డా. వెంకటేశ్వరరావు, పోకూరి బాబురావు, శరత్ మరార్, దర్శకులు శ్రీవాస్, వీరు పోట్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు.