వయసు దాచడం నాకిష్టం లేదు: షరాన్ స్టోన్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ఆ పేరు చెబితే చాలు.. కుర్రాళ్లు ఉర్రూతలూగిపోయేవారు. పోస్టర్ మీద ఆ పేరుంటే చాలు.. సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. ఆమే.. ప్రముఖ హాలీవుడ్ నటి, నిర్మాత షరాన్ స్టోన్. ఆడాళ్లు సర్వసాధారణంగా అబద్ధాలు ఎక్కువగా చెప్పేది, వీలైనంతవరకు దాచాలని అనుకునేది కూడా వాళ్ల వయసు గురించే. కానీ, షరాన్ స్టోన్ మాత్రం తన వయసు విషయంలో ఏ ఒక్కరోజూ అబద్ధాలు చెప్పనే లేదట. వయసు పెరుగుతోందంటే మనం కూడా ఎదుగుతున్నట్లేనని, అందువల్ల దాని గురించి భయపడటం సరికాదని ఆమె చెప్పింది.
ప్రస్తుతం 55 ఏళ్ల వయసున్న షరాన్ స్టోన్.. ప్రతిరోజూ తప్పనిసరిగా కొన్ని గంటల పాటు జిమ్లో గడుపుతుంది. అలాగే నీళ్లలో జలకాలాడటం అన్నా ఆమెకు చాలా ఇష్టం. ఈ రెండింటినీ తాను ఎంతో ఇష్టపడతానని, జిమ్కు వెళ్తేనే తన మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పింది. నీళ్లంటే చెప్పలేనంత మక్కువ అని, పాడిల్బోర్డు మీద ఎలా వెళ్లాలో కూడా ఈమధ్యే నేర్చుకుంటున్నానని తెలిపింది. తాను హోటల్ గదిలో ఉన్నప్పుడు బాగా డాన్సు చేస్తానని, అక్కడున్న ఫర్నిచర్ అంతా ఒక పక్కకు తోసేసి, ఎక్కువ ఖాళీ చేసుకుని, పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని మరీ డాన్సు చేస్తానని వివరించింది. తన ముగ్గురు మగపిల్లలు తనను అటూ ఇటూ పరుగులు పెట్టిస్తారని, అది కూడా మంచి వ్యాయామంలాగే ఉంటుందని షరాన్ స్టోన్ చెబుతోంది.