తాప్సీ
కథానాయికగా సౌత్, నార్త్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. అయితే హీరోయిన్‌గా మిగిలిపోకుండా నిర్మాతగానూ నిరూపించుకోవాలనుకున్నారామె. తొలి ప్రయత్నంగా తాప్సీ నిర్మించిన హిందీ చిత్రం ‘ధక్ ధక్’ శుక్రవారం విడుదలైంది. అయితే నిర్మాతగా తనకు చేదు అనుభవం ఎదురైందని తాప్సీ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌లో స్టార్ సిస్టమ్ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోంది.
కథ వినేటప్పుడే ‘హీరో ఎవరు?’ అని అడుగుతున్నారు. దాంతో జనాలు ‘కంటెంటే కింగ్’ అనుకుంటారనే నా భ్రమ తొలగిపోయింది. హీరోని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఓ నటిగా నేను ఒక కథ వినేటప్పుడు ఆ నిర్మాతలు ఎంత పెద్దవాళ్లు, కో–స్టార్ ఎవరు? అని అడగలేదు. కొత్త దర్శకులతో, కొత్త నటులతో సినిమాలు చేశాను. కానీ వేరేవాళ్లు అలా చేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకీ తేడా? ఈ విషయంలో ఏ ఒక్కర్నో నిందించాల్సిన అవసరం లేదు. యాక్టర్లు, స్టూడియోలు, ప్రేక్షకులు... అందరూ బాధ్యులే. బాలీవుడ్ అర్థవంతమైన చిత్రాలు చేయడంలేదని అంటుంటారు.
కానీ, చేసినప్పుడు మాత్రం సపోర్ట్ దక్కదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. పెద్ద సినిమాలకు పెట్టుబడి పెట్టి, డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బు రికవర్ చేసుకోవచ్చని అనుకుంటారు. చిన్న సినిమాలకు పెట్టుబడి పెట్టడం కష్టం.. రిలీజ్ చేసుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితి స్టార్స్‌కి, యాక్టర్స్‌కి మధ్య దూరం పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక తాప్సీ ఒక నిర్మాతగా వ్యవహరించిన ‘ధక్ ధక్’ కథ నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment