అయిదు వందల రూపాయల పాకెట్ మనీతో...
‘‘అయిదువందల రూపాయల పాకెట్‌మనీతో వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్లాను. కష్టాల్ని కూడా ఇష్టంగా స్వీకరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాను. భవిష్యత్తులో సినీ రంగంలో కూడా రాణిస్తాను’’ అని డా. కేవీ సతీష్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘యమలీల 2’ చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. నేడు సతీశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ఎప్పటికైనా నా సొంత డబ్బుతో సినిమా తీసి, హీరో కావాలనేది నా లక్ష్యం. కుటుంబ కథాచిత్రాలు తీయడంతో మంచి నేర్పు ఉన్న కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా.
ఆయన ఇప్పుడు కుదరదన్నా, కన్విన్స్ చేశాను. ఆయన మూడు, నాలుగు కథలు చెబితే, నాకు ‘యమలీల 2’ నచ్చింది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం అయితేనే బాగుంటుందని కృష్ణారెడ్డి అన్నారు. లక్కీగా వీళ్లు కూడా ఒప్పుకోవడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. అందరి సహకారంవల్ల బాగా నటించగలుగుతున్నా. ఎడిటర్ గౌతంరాజుగారైతే ‘పది సినిమాల అనుభవం ఉన్నవాడిలా చేశావ్’ అని ప్రశంసించారు.
మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఇకనుంచి ప్రతి ఏడాదీ నేను హీరోగా మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుంది’’ అని చెప్పారు. కర్నాటకలో నేను స్థాపించిన కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల దాదాపు 60 మందికి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని, కేన్సర్ రోగులకు సహాయం చేస్తున్నామని, హెచ్‌ఐవి సోకిన పిల్లల కోసం అనాథ శరణాలయం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సతీష్ తెలిపారు. తన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగువారి కోసం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నదే తన ఆశయం అని ఆయన పేర్కొన్నారు.