‘రావణ’లో హనుమంతునిగా చేయాలని ఉంది - విష్ణు
‘‘నాన్నకు, మనోజ్‌కి ఈ కథ బాగా నచ్చింది. వారిపై నమ్మకంతో కథ పూర్తిగా వినకుండానే నేరుగా సెట్స్‌కి వెళ్లిపోయా. షూటింగ్ జరుగుతుండగా ఈ కథపై ఆసక్తి పెరిగింది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేను ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను’’ అని తెలిపారు మంచు విష్ణు. ఆయన కథానాయకునిగా, వీరుపోట్ల దర్శకత్వంలో డా.మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఈ నెల 17న(రేపు) ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు విష్ణు.
ఇంకా మాట్లాడుతూ-‘‘ఈ సినిమా పూర్తయినప్పట్నుంచీ ఒకటే టెన్షన్. దాసరి, బి.గోపాల్, శ్రీను వైట్ల, శ్రీవాస్, జి.నాగేశ్వరరెడ్డి, విరానికాలకు ఈ సినిమా చూపించాను. అందరూ బాగుందని అభినందించారు. దాసరిగారైతే... ఫస్టాఫ్‌కి 70 మార్కులు వేశారు. శ్రీనువైట్ల అయితే... ‘ఢీ’ చూసినంత ఉద్వేగంగా ఉందన్నారు. దాంతో సినిమాపై నమ్మకం పెరిగింది. దేనికైనా రెడీ కంటే వందరెట్లు బెటర్‌గా ఉంటుందీ సినిమా. మణిశర్మ సంగీతం, రవితేజ వాయిస్ ఓవర్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని తెలిపారు.
మరికొన్ని విషయాలు చెబుతూ-‘‘నాన్నే నాకు గొప్ప క్రిటిక్. ఆయనకు తగ్గ కొడుకుని అనిపించుకోవాలి. తర్వాత విష్ణు తండ్రి మోహన్‌బాబు అనేంతగా చేరుకోవాలి. నా ముందున్న లక్ష్యం అదే. నాన్నగారి ‘రావణ’ చిత్రం సంక్రాంతికి ప్రారంభం అవుతుంది. అందులో నాకు హనుమంతుడు పాత్ర చేయాలని ఉంది. నాన్నగారి సినిమాలను రీమేక్ చేయమని చాలామంది అడుగుతుంటారు. ‘రాయలసీమ రామన్నచౌదరి’ చిత్రాన్ని తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ చేయమంటే... రజనీకాంత్, విష్ణువర్థన్ లాంటి నటులే ధైర్యం చేయలేకపోయారు. ఇక నా వల్ల ఏమవుతుంది. అయితే... ‘అసెంబ్లీ రౌడీ’ మాత్రం చేస్తా. అలాగే... చిరంజీవిగారి ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’ అంటే నాకు చాలా ఇష్టం. చరణ్ దాన్ని చేస్తే బావుంటుంది. ఒకవేళ చరణ్ చేయకపోతే... ఆ అవకాశం నేను దక్కించుకుంటా’’ అని చెప్పారు విష్ణు.