మళ్లీ పెళ్లి చేసుకుంటా! | I want to settle down with someone once again : Zeenat Aman | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకుంటా!

Published Thu, Nov 20 2014 10:35 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మళ్లీ పెళ్లి చేసుకుంటా! - Sakshi

మళ్లీ పెళ్లి చేసుకుంటా!

లేటు వయసులో ఇలాంటి ఆలోచనలేంటి? అని ఆడిపోసుకోవడానికి జనాలు వెనకాడరని తెలిసినా, ‘నేను పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నా’ అని బహిరంగంగా ప్రకటించేశారు బాలీవుడ్ మాజీ కథానాయిక జీనత్ అమన్. ఆమె ఎవరో చెప్పడానికి జస్ట్ ‘దమ్ మారో దమ్’ పాట చాలు. ఇక, జీనత్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే... 1985లో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్‌ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు పుట్టాక జీనత్ పూర్తిగా వారికే అంకితమయ్యారు. మజర్‌తో ఆమె వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు. మజర్ వేధింపులు భరించలేక ఆయన్నుంచి జీనత్ విడిపోయారు. అప్పట్నుంచీ కొడుకులే లోకంగా జీవిస్తున్నారామె.
 
 ఈ బుధవారంతో 63వ పడిలోకి అడుగుపెట్టిన జీనత్.. ‘‘ఇన్నాళ్లూ ఒంటరిగానే నెట్టుకొచ్చాను.. మిగతా జీవితం పంచుకోవడానికి ఓ తోడు కోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన మనోభావాలను విపులంగా వ్యక్తపరుస్తూ -‘‘నటిగా మంచి వైభవాన్ని చూస్తున్న సమయంలోనే నేను పెళ్లి చేసుకున్న విషయం, దానివల్ల సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటికి 15 ఏళ్లు నిర్విరామంగా పని చేసినందువల్లో ఏమో పూర్తిగా నా కుటుంబానికి అంకితమైపోయాను. నా ఇద్దరు కొడుకులు అజాన్, జహాన్‌ని కంటికి రెప్పలా చూసుకున్నాను. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లయ్యారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 
 ఇంకా చెప్పాలంటే.. నా కోసం కొంత సమయం కేటాయించలేనంత బిజీ అయిపోయారు. మా అబ్బాయిలు అంత బిజీ కావడం నాకు ఆనందంగా ఉంది. కానీ, జీవితాంతం ఇలా ఒంటరిగా గడిపేయాలని నాకనిపించడం లేదు. ఆ దేవుడు నాకు మంచి ఆరోగ్యం, జీవితాన్ని ఆస్వాదించే మనసునిచ్చాడు. అలాంటప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఒంటరి బతుకెందుకు? అనుకుంటున్నా. అందుకే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అని జీనత్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement