సాక్షి, ముంబై: రిలీజ్‌కు ముందు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాదాలు కూడా సిన్మాలను జనంలోకి తీసుకెళ్లడానికి అస్త్రంగా పనికొస్తున్నాయి. వివాదాలతో సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. అయితే, ఈ వివాదాలు సినిమా పబ్లిసిటీ కోసం కావాలనే సృష్టిస్తున్నారా? కావాలనే కల్పిత స్కాండళ్లను జనంలోకి వదులుతున్నారా? అంటే మార్కెట్ ట్రెండ్ అలాగే కనిపిస్తోందని అంటున్నారు బాలీవుడ్ దర్శక-నిర్మాత నిఖిల్ అద్వానీ.. జియో మమి 19వ ముంబై చిత్రోత్సవంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు వెల్లడించారు. ఆయన నిర్మించిన తాజా సినిమా 'లక్నో సెంట్రల్' ప్రమోషన్ కోసం ఓ స్కాండల్ (అశ్లీల బాగోతాన్ని)ను సృష్టించాలంటూ మార్కెటింగ్ టీమ్ తనకు సూచించిందని ఆయన వెల్లడించారు.
ఫర్హాన్ అఖ్తర్ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్'.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన 'సిమ్రన్' సినిమాలు ఒకేసారి సెప్టెంబర్ 15న విడుదలయ్యాయి. వివాదాలతో మంచి పబ్లిసిటీ పొందిన 'సిమ్రన్' సినిమా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో 'లక్నో సెంట్రల్' కనీస వసూళ్లు రాబట్టలేక.. ఘోరంగా ప్లాప్ అయింది.
సినీ ప్రమోషన్ విషయంలో మార్కెటింగ్ గురించి ప్రశ్నించగా ఈ యువ నిర్మాత స్పందిస్తూ.. 'కంగనా స్కాండల్ (హృతిక్ రోషన్‌తో తన ఎఫైర్ గురించి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్న విషయాలు పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే) జోరుగా పబ్లిసిటీ పొందుతోందని మార్కెటింగ్ నిపుణుడు నాకు ఫోన్ చేశాడు. ఫర్హాన్ కూడా ఒక స్కాండల్ చేస్తే.. మన సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చని చెప్పాడు. నేను ఏం స్కాండల్ అని అడిగాను. ఏ స్కాండల్ పర్వాలేదు. ఆ అవసరం మనకు ఉందని అన్నాడు. సినిమా కోసం ఓ స్కాండల్ చేసి పెట్టవా అని నేను ఫర్హాన్‌ని ఎలా అడిగేది' అంటూ నిఖిల్ అద్వానీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment