'దంగల్'లో ఆ సీన్ చూసి ఏడ్చేశాను!
ముంబై: హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ 'దంగల్' వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. మరోసారి ఆమీర్ మ్యాజిక్ చేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీలో ఓ సీన్ తనకు అంతగా నచ్చలేదని, తన మనసు నొచ్చుకుందని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు. ఆ సీన్ ఏంటంటే.. కొన్ని అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఓటమిపాలైన గీతా వ్యవహారం మహావీర్ ఫోగట్ కు నచ్చదు. ఈ విషయంపై గురువుగా గీతను మందలించగా, తండ్రితో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుంది. తన పాత్రలో కనిపించిన ఫాతిమా సనా షేక్, ఆమీర్ మధ్య జరిగిన కుస్తీ సీన్ తో తాన మనసు ఎంతో వేదనకు గురైందన్నారు. ఆ సీన్ చూసి తాను ఏడ్చేశానని రెజ్లర్ గీతా వెల్లడించారు.
వాస్తవానికి తాను తన తండ్రి మహావీర్ తో ఒక్కసారి మాత్రమే తలపడ్డానని అంతటితో విషయం ముగిసిపోయింది. కానీ, మూవీలో తండ్రితో కాస్త కఠినంగా ప్రవర్తించినట్లు చూపించారంటూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఓవరాల్‌గా మూవీని తాను ఎంతో ఎంజాయ్ చేశానని, సహజరీతిలో అఖారాలో కుస్తీ ప్రాక్టీస్ సీన్లను చిత్రించడంపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు. జీవిత కథాంశాన్ని తెరపై చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.