స్పెషల్ సాంగ్స్‌కే కాదు...ఆర్ట్ సినిమాలకూ రెడీ!
Published Wed, Oct 30 2013 12:24 AM | Last Updated on Thu, Jul 11 2019 5:38 PM
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ‘ఈగ’లో అతిథి పాత్రకు అంగీకరించినప్పుడు హంసానందిని కూడా తన కెరీర్‌కి అది మంచి మలుపు అవుతుందని ఊహించలేదు. ‘ఈగ’ తర్వాత వరుసగా మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారామె. ఈ ఆరడుగుల అందం అసలు పేరు పూనమ్. ‘అనుమానాస్పదం’తో కథానాయికగా పరిచయం చేసినప్పుడు సీనియర్ దర్శకుడు వంశీ ఆమె పేరుని హంసానందినిగా మార్చారు. ఆ పేరంటే తనకెంతో ఇష్టమంటున్న హంసానందినితో జరిపిన ఇంటర్వ్యూ...
ఈ మధ్య అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్స్‌కు మీరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినట్టున్నారు. ఈ పరిణామం ఎలా అనిపిస్తోంది?
లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే, నేను స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోతున్నాను. హంసా చాలా స్టయిలిష్‌గా ఉందనీ గ్లామరస్‌గా ఉందనీ అభినందిస్తున్నారు.
ఇలా ఐటమ్ సాంగ్స్‌కే పరిమితమైపోవాలనుకుంటున్నారా?
అలా ఏం లేదు. నేను చేసేవి ఐటమ్ సాంగ్స్ కాదు... స్పెషల్ సాంగ్స్ అనాలి. ఎందుకంటే, మీరిప్పటివరకు నేను చేసిన పాటలను చూస్తే కథలో భాగంగానే అవి ఉంటాయి. అలాగే, పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా ఉంటాను కదా. స్పెషల్ సాంగ్స్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. అలాగని పాటలకే పరిమితమైతే నాకు నేను బోర్ కొట్టడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తాను. అందుకే లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను.
‘ఈగ’ ఒప్పుకున్నప్పుడు గెస్ట్ రోల్స్ పరంగా మీకు డిమాండ్ పెరుగుతుందనుకున్నారా?
అస్సలు ఊహించలేదు. ఆ సినిమాకి రాజమౌళిగారు అడిగినప్పుడు, మీ పాత్ర తెరపై కనిపించేది కాసేపే... ఎక్కువసేపు కనిపిస్తే అంత ఇంపాక్ట్ ఉండదన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజం. ‘ఈగ’లో నేను తక్కువ సమయం కనిపించినా, మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు ఫోన్ చేసి, చిన్న పాత్ర అయినా క్యూట్‌గా ఉందన్నారు.
వంశీ ‘అనుమానాస్పదం’లో కథానాయికగా చేశారు.. ఆ తర్వాత హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి కారణం ఏంటి?
వంశీగారు ఎంత మంచి దర్శకులో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలో కథానాయికగా చేసే అవకాశం రావడం ఓ అదృష్టం. ఆ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో తప్పు జరిగింది. దానివల్ల కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు.
ఇప్పుడు హీరోయిన్‌గా ఏమైనా సినిమాలు చేస్తున్నారా?
నేను చేసే అతిథి పాత్రలకు ఎంత పేరొచ్చినా, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసినప్పుడు లభించే సంతృప్తి వేరు. అందుకే, లీడ్ రోల్స్‌పై దృష్టి సారించాలనుకుంటున్నాను. కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ఏది పడితే అది కాకుండా మంచి ప్రాజెక్ట్‌ని ఎన్నుకోవాలనుకుంటున్నాను.
ప్రస్తుతం చేస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నా పాత్ర పేరు ‘మధానికా’. ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాను. ఏడెనిమిది లుక్స్ టెస్ట్ చేసిన తర్వాత ఓ లుక్‌ని ఫైనలైజ్ చేశారు. ఈ సినిమా కోసం నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాను.
గ్లామరస్ రోల్స్ మాత్రమేనా.. డీ-గ్లామర్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నారా?
నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తాను. కథ, కేరక్టర్ బాగుంటే ఆర్ట్ ఫిల్మ్‌లో చేయడానికి కూడా రెడీ. అలాగే మంచి ఫైట్స్ డిమాండ్ చేసే యాక్షన్ మూవీస్‌లో చేయడానికి కూడా సిద్ధమే.
Advertisement
Advertisement