
పాలమూరు పల్లెను దత్తత తీసుకుంటా
ట్వీటర్‌లో హీరో మహేశ్‌బాబు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: శ్రీమంతుడులో సొంత గ్రామాన్ని దత్తత తీసుకునే యువకుడి పాత్ర పోషించి సినీ ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరో మహేశ్‌బాబు నిజ జీవితంలోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే తన తండ్రి కృష్ణ స్వస్థలమైన ఏపీలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్‌బాబు తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ట్వీటర్‌లో ప్రకటించారు.
ఈ చిత్రం విజయవంతం కావడంపై మహేశ్‌బాబుకు బుధవారం ఫోన్ చేసి శుభాకాంక్ష లు తెలిపిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. తాము చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి చేయూతనివ్వాల్సిందిగా మహేశ్‌ను కోరారు. కరువు, వలసలతో అత్యంత వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా సూచిం చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మహేశ్... గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు మహేశ్ నిర్ణయంపై ట్వీటర్‌లో కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్...ఆయన నిర్ణయం మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు రీట్వీట్ చేశారు.