
పాన్ ఇండియా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌బాబు, ప్రియాంకచోప్రా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ–29’(వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ముగిసింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. మంగళవారంతో షెడ్యూల్ ముగియడంతో అదే రోజు రాత్రి కొంతమంది నటీనటులు, సిబ్బంది వెనుదిరగగా.. బుధవారం ఉదయం రాజమౌళి, ప్రియాంకచోప్రా, మిగిలిన సాంకేతిక బృందం వీడ్కోలు పలికింది. షెడ్యూల్ ముగిసిందనే సమాచారం తెలుసుకున్న పరిసర ప్రాంత అభిమానులు వేకువజామునే కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలో రాజమౌళీ బృందం బస చేసిన హోటల్‌కు పోటెత్తారు. సిమిలిగుడ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రియాంక చోప్రాతో కలిసి ఫొటోలు దిగారు.
కదిలిన కాంగ్రెస్ శ్రేణులు..
షెడ్యూల్ మొత్తం పొట్టంగి నియోజకవర్గంలోనే జరిగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌చంద్ర ఖడం నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ శాసన సభాపక్షనేతగా ఉన్నారు. దాంతో ఖడం నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, జిల్లా పరిషత్ సభ్యులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. అక్కడ ఏ సినిమా షూటింగ్ జరిగినా సరే ఆయన నుంచి సాయం ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కొరాపుట్ జిల్లాలో పండించిన నల్ల ధాన్యం, కొరాపుట్ కాఫీ తదితర మిలెట్స్‌తో కూడిన బాక్స్‌ను రాజమౌళికి బహూకరించారు. మరోసారి ఇదే ప్రాంతంలో షూటింగ్‌కి రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు ఎవరు షూటింగ్‌కు వచ్చినా తాము పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోసారి ఈ ప్రాంతానికి తన సినిమా షూటింగ్ కోసం వస్తానని వారికి రాజమౌళీ మాటిచ్చారు.
వీడ్కోలు పలికిన అధికారులు..
రాజమౌలి బృందానికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, ట్రైనీ ఐఏఎస్ జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరపు సశ్యా రెడ్డి, జయపూర్ ఎస్‌డీపీఓ పార్ధో జగదీష్ కశ్యప్‌లు రాజమౌళి బృందాన్ని కలిశారు. అనంతరం మహేష్‌బాబు ఉంటున్న దేవమాలి కాటేజీకి వెళ్లి ఫొటోలు దిగారు.
చివరిలో రాజమౌళి, ప్రియాంక చోప్రాలు ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. ఇక్కడి ప్రజల సహకారం, స్నేహశీలత మరువలేమన్నారు. ఆ లేఖను ఐఏఎస్ అధికారి సశ్యా రెడ్డికి అందజేసి ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమకు ఇన్ని రోజులు భద్రత కల్పించిన పోలీసులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెల రోజులుగా వాహనాలు, వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన తులమాలి పర్వత ప్రాంతం బోసిపోయింది. సినిమా యూనిట్ వాహనాలు తిరిగి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. సిమిలిగుడ పట్టణంలో ఒక్కసారిగా హోటళ్లలో సందర్శకుల తాకిడి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment