
జన్మలో టాటూ వేయించుకోనన్న హీరోయిన్
'ద గర్ల్ విత్ ఎ డ్రాగన్ టాటూ' సినిమాలో నటించిన నూమీ రాపేస్.. అసలు తాను జీవితంలో ఎప్పుడూ టాటూ అన్నదే వేయించుకోనని స్పష్టం చేసింది. ఒకసారి వేయించుకుంటే తాను దానికి అలవాటు పడిపోతానేమోనన్న భయం వల్లే టాటూలకు దూరంగా ఉన్నట్లు రాపేస్ (34) చెప్పింది. ఒక దాంతో మొదలుపెడితే ఇక ఒళ్లంతా ఎక్కడపడితే అక్కడే వేయించేసుకునే ప్రమాదం ఉందని ఆమె చెప్పినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ తెలిపింది.
ఒకసారి మొదలుపెట్టానంటే మాత్రం తాను పిచ్చి పట్టినట్లు వేయించుకుంటానన్న విషయం తనకు తెలుసని, చివరకు కాలి వేళ్లను కూడా వదిలిపెట్టనని ఆమె చెప్పింది. ఏ విషయాన్నీ తాను సగంలో వదిలేసే అలవాటు లేదని కూడా తెలిపింది. ఒకటి రెండు సార్లు తనకు తానే టాటూ వేసుకోడానికి ప్రయత్నించగా, బాగా రక్తం కారిందని, ఎర్రగా.. నల్లగా మచ్చలు కూడా పడ్డాయని, దాంతో దాదాపు నెల రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నానని రాపేస్ వివరించింది. అందుకే.. అసలు టాటూలకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంది.