ఇలా ఉంటే పైకి రావడం కష్టం అన్నారు!
‘‘ఇంత సన్నగానా? కథానాయికగా ఏం పనికొస్తుంది? పైగా.. మోడల్‌గా చేసినవాళ్లు కథానాయికలుగా అస్సలు పనికి రారు’’... 13 ఏళ్ల క్రితం త్రిష కథానాయికగా రంగప్రవేశం చేసినప్పుడు ఆమె గురించి కొంతమంది చేసిన కామెంట్స్ ఇవి. ఇటీవల ఓ సందర్భంలో తన కెరీర్‌ని విశ్లేషించుకున్నప్పుడు త్రిష ఆనాటి కామెంట్లను గుర్తు చేసుకున్నారు. మరికొన్ని విశేషాలను ఆమె చెబుతూ - ‘‘నేను కథానాయిక అయిన కొత్తలో ఇక్కడ తమిళ అమ్మాయిలు పెద్దగా లేరు. బాలీవుడ్ కథానాయికల హవా సాగుతుండేది. అందుకేనేమో ‘మన అమ్మాయి’ అంటూ తమిళ మీడియా నన్ను బాగానే ఎంకరేజ్ చేసింది. తెలుగువాళ్లు కూడా తమ అమ్మాయిలానే భావించారు. మీడియాపరంగా నాకు చాలా సపోర్ట్ లభించింది.
కానీ, మీడియాకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది, ‘మోడలింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లు హీరోయిన్లుగా పైకి రావడం కష్టం. పైగా, మీరు మరీ సన్నగా ఉన్నారు. ఇంకాస్త లావైతే బాగుంటుంది’ అన్నారు. ఆ మాటలను నేను పట్టించుకోలేదు. నన్ను నేను మార్చుకోను అని కరాఖండీగా అన్నాను. చివరకు వాళ్ల మాటలను అబద్ధం చేయగలిగాను. నేను ఆ మాటలను పట్టించుకుని ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండేదాన్నేమో. అందుకే అంటున్నా... విమర్శలను పట్టించుకోకూడదు. మనం చేయాలనుకున్న పనిని నిజాయతీగా చేసుకుని వెళ్లిపోవడమే. అప్పుడే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది’’ అన్నారు.