
మా అమ్మ కూలీలా పని చేసేది!
‘‘ఇలియానాకేం కోట్లు సంపాదిస్తోంది. మహారాణి లాంటి జీవితం అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడైతే నా జీవితం అలానే ఉంది. ఓ మనిషి సుఖంగా జీవించడానికి కావాల్సిన వసుతులన్నీ నాకున్నాయి. కానీ, ఒకప్పుడు అలా కాదు’’ అని ఇలియానా అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో తన చిన్నప్పటి విశేషాలను గుర్తు చేసుకున్నారామె. అప్పట్లో సొంత ఇల్లు కట్టుకోవాలని తన తల్లిదండ్రులు చాలా ఆరాటపడ్డారని ఇలియానా చెబుతూ -‘‘నేను పుట్టి, పెరిగింది ముంబయ్‌లోనే. నాకు పదేళ్లప్పుడు మేము గోవా వెళ్లాం. అప్పటికి నాన్నగారు ఇంకా ముంబయ్‌లోనే పని చేస్తున్నాను. అమ్మ, నేను, నా సిస్టర్ గోవాలో ఉండేవాళ్లం.
సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనిపించి, అప్పటికే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని నాన్న కొన్నారు. అద్దె దండగ కదా అని, ఆ ఇంటిని ఖాళీ చేసి, ఇల్లు మొత్తం రెడీ కాక ముందే కొన్న ఇంట్లోకి మారాం. ఒకవైపు ఇంటి పనులు జరుగుతుంటే మేం ఎలాగోలా సర్దుకునేవాళ్లం. అమ్మ సంగతి చెప్పక్కర్లేదు. దాదాపు కూలీలా పని చేసేది. మేం స్కూల్ నుంచి రాగానే, ఇంటి పనులు చేసేవాళ్లం. ఆ అలసటతో ఒక్కోసారి నేల మీదే పడుకుని, నిద్రపోయేవాళ్లం. కష్టం విలువ నాకు బాగా తెలుసు. అందుకే ఎవరైనా ‘నువ్వు లక్కీ. కష్టాలెలా ఉంటాయో నీకు తెలియదు కదా’ అంటే, వర్తమానాన్ని చూసి అలా ఎవరి పరిస్థితినీ అంచనా వేయొద్దు. గతంలో వాళ్లెలాంటి కష్టాలు పడ్డారో తెలుసుకుని స్టేట్‌మెంట్‌లివ్వండి అంటుంటాను’’ అన్నారు.