త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సంఘం ఏర్పాటుకానుంది. ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రిక తీసుకురావడంతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా ఈ సంఘం పాల్గొంటుంది. ఇది ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండబోదని, విభిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు.
ఆ కళాకారుడి ద్వారా అభిమానులకు చేరువ కావడమే అభిమాన సంఘాల ఉద్దేశం అవుతుందని, దాన్ని తాము సాధిస్తామని అన్నాడు. 'ఇసైజ్ఞాని' అనే పేరుతో వారపత్రికను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఇందులో ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలు అన్నీ ఉంటాయి. ఇళయరాజా వారసుడిగా సంగీత దర్శకత్వంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇప్పటికి దక్షిణాదిలోని పలు భాషల్లో 50 సినిమాలకు సంగీతం అందించాడు.