కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించినప్పుడే సంతృప్తి. ఎంతో కష్టపడి తీసిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తేనే హీరోకు సంతోషం. తనను, తన సినిమాలను ఎప్పటికీ ఆదరిస్తూ ఉండే అభిమానులంటే హీరోలకు ఎనలేని ప్రేమాభిమానాలు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ తన ఫ్యాన్స్ మీద ప్రేమను చాటుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ఓ అభిమాని పెళ్లికి వెళ్లి ఆశీర్వదించాడు. సూర్య వీరాభిమాని, ఆలిండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడు హరికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య వివాహ సమయానికి పెళ్లి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వధువు మెడలో కట్టే తాళిబొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుక్కు అందించాడు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు నిల్చొని పెళ్లి తంతును దగ్గరుండి జరిపించాడు. మీ ప్రయాణం సంతోషంగా సాగాలంటూ వధూవరులను మనసారా ఆశీర్వదించాడు. కాగా బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి మరీ తన పెళ్లికి విచ్చేయడంతో సదరు అభిమాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇక పెళ్లి మండపంలో సూర్య సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ)
ఇదిలా వుంటే సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకురాలిగా పని చేసింది. గౌతమ్ మీనన్ 'నవరస' షార్ట్ ఫిల్మ్‌లోనూ సూర్య ప్రధాన పాత్ర పోషించనున్నాడు. తొమ్మిది కథలుండే ఈ చిత్రాన్ని తొమ్మది మంది దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్లందరూ ఈ చిత్రానికి ఒక్క పైసా తీసుకోకపోవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్న ఈ చిత్ర లాభాలను ఇండస్ట్రీలోని పది వేల మంది కార్మికులకు పంచి పెట్టనున్నారు. మరోవైపు సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కూతురి గురించి చెప్తూ నాగబాబు భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment